సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Sep 22, 2020 , 00:42:26

బిడ్డా.. మల్లెప్పుడొస్తవ్‌

బిడ్డా.. మల్లెప్పుడొస్తవ్‌

వరదల్లో కొట్టుకుపోయి.. చెరువులో శవమై

పని నిమిత్తం బయటకువెళ్లి.. కానరాని లోకానికి

వాహనాన్ని తోస్తున్న క్రమంలో.. వరద నీటిలో పడిపోయిన వ్యక్తి   

ఆదివారం సాయంత్రం ఘటన

సోమవారం సరూర్‌నగర్‌ చెరువులో శవమై తేలిన వైనం  

శోక సంద్రంలో కుటుంబ సభ్యులు 

రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబానికి అతడే పెద్దదిక్కు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇద్దరు బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నాడు. కాని భారీ వర్షం.. వదరనీరు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి వరదనీటిలో 

కొట్టుకుపోయి సరూర్‌నగర్‌ చెరువులో శవమై తేలాడు. విషయం తెలుసుకున్న తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు చెరువు వద్దకు చేరుకున్నారు. ఇక తమకు దిక్కెవరని గుండెలు బాదుకుంటూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన ఆదివారం రాత్రి తపోవన్‌ కాలనీలో చోటుచేసుకున్నది. 

సోమవారం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.6లక్షలు ఆర్థిక సాయం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తామని  ప్రకటించారు. అంతేకాకుండా వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చదివిస్తామని హామీ ఇచ్చారు. 

ఎల్బీనగర్‌/బడంగ్‌పేట/లింగోజిగూడ : బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బాలాజీ టౌన్‌షిప్‌లో నవీన్‌కుమార్‌ (45) తన భార్య శాలినీ, ఇద్దరు కూతుళ్లు హర్షిత, తేజస్వినితో కలిసి నివాసముంటున్నాడు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తి వద్ద డెకరేషన్‌ విద్యుత్‌ దీపాలను అద్దెకు తీసుకుని ఆర్డర్లకు వేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య శాలిని బండ్లగూడలోని చాక్లెట్‌ కంపెనీలో పనిచేస్తున్నది. హర్షిత 8వ తరగతి, తేజస్విని 7వ తరగతి చదువుతున్నారు. కాగా నవీన్‌కుమార్‌ గత మూడు రోజుల క్రితం తన స్నేహితుడైన శివ వాహనాన్ని తీసుకున్నాడు. కాగా ఆదివారం తాను చేసిన ఆర్డర్‌లో వచ్చిన రూ.2 వేల నుంచి తనకు డెకరేషన్‌ మెటీరియల్‌ ఇచ్చే ప్రవీణ్‌ను స్థానిక ఓ ఫంక్షన్‌ హాల్‌ వద్దకు పిలిచి రూ.500 ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన నవీన్‌కుమార్‌ వరద ఉధృతి ఉన్న తపోవన్‌ కాలనీ నాలా ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే తనకు నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నందున వెళ్లేందుకు కాస్తా భయం అవుతుందని చెప్పడంతో ప్రవీణ్‌ తాను తోడు వస్తానంటూ నవీన్‌కుమార్‌ వద్ద నుంచి స్కూటీని తీసుకున్నాడు. ముందుగా ప్రవీణ్‌ స్కూటీని తోసుకుంటూ వెళ్లగా.. నవీన్‌కుమార్‌తో పాటు మరో వ్యక్తి వెనుక వరద నీటిని దాటే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు నవీన్‌కుమార్‌ కిందపడి వరద ఉధృతిలో కొట్టుకుని సరూర్‌నగర్‌ చెరువులోకి వెళ్లి మునిగిపోయాడు. చెరువులో మట్టి ఒండ్రు ఉండటంతో అందులోనే చిక్కుకుపోయాడు. 

గజ ఈతగాళ్లు, డీఆర్‌ఎస్‌ టీం, బోట్స్‌ సహాయంతో..

నవీన్‌కుమార్‌ నీటిలో మునిగిపోతున్న దృశ్యాలను అక్కడే ఉన్న స్థానికులు సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి చూపడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగి నవీన్‌కుమార్‌ కోసం గాలించారు. విపత్తుల నివారణ సిబ్బంది కూడా చెరువులో గాలించారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాస్‌రావులు కూడా బోట్‌లో గాలింపులో పాల్గొన్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం సమయానికి నవీన్‌కుమార్‌ మృతదేహం చెరువులో లభ్యంకాగా 108 వాహనంలో ఉస్మానియా దవాఖానకు తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సరూర్‌నగర్‌ సీఐ సీతారాం తెలిపారు. 

హృదయ విదారకంగా కుటుంబం 

నవీన్‌కుమార్‌ మృతదేహం సరూర్‌నగర్‌ చెరువులో లభించడంతో వారి కటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోధించారు. నవీన్‌కుమార్‌ ఎలక్ట్రీషియన్‌గా ఆయన సతీమణి శాలినీ టైలరింగ్‌ చేసుకుంటూ ఇద్దరు చిన్నారులతో హాయిగా జీవనం సాగిస్తున్నాడు. ఇంటికి వస్తాడనుకున్న తమ కుటుంబం పెద్ద ఒక్కసారిగా వరదనీటిలో కొట్టుకొనిపోయి మరణించాడన్న వార్త తెలిసి వారి కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులు దుఖః సాగరంలో మునిగిపోయారు. 

స్నేహితుడి కలిసి వస్తానని 

కానరాని లోకానికి : లలిత, తల్లి  

ఉదయం 10గంటలకు స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పిపోయాడు. మీర్‌పేటలో ఓ స్నేహితుడిని కలిశాడు. సరూర్‌నగర్‌లో ఉన్న మరో స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పాడు. టీవీలో చూసేంత వరకు ఏం జరిగిందో తెలియదు. వరద నీటిలో కొట్టుకు పోయాడని తెలియగానే సంఘటన స్థలానికి పోయాం. చివరకు చెరువులో శవమై తేలాడని ఆ తల్లి గుండెలు బాదుకుంటూ విలపించింది.