మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 09, 2020 , 00:57:07

మార్పు షురూ..

మార్పు షురూ..

వీఆర్వో వ్యవస్థకు మంగళం.. హర్షణీయం..! 

విధుల్లో నిర్లక్ష్యం.. కాసుల కక్కుర్తిపై రైతుల ఆగ్రహం   

ప్రభుత్వానిది సరైన నిర్ణయమేనంటూ కితాబు  

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/వికారాబాద్‌ : వీఆర్వోలను తీసేసిడ్రంటా కదా.. వారి నుంచి రెవెన్యూ రికార్డులను తీసుకున్నారంటా కదా..! రెండు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతున్నది. అవినీతి అంతానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు నుంచే రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే నిర్ణయత్మాకమైన భూ ప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రెవెన్యూ సమస్యలకు పుల్‌స్టాప్‌ పెట్టింది. అయినప్పటికీ రెవెన్యూలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు అక్రమ వసూళ్లకు తెరలేపారు. దీంతో గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. కాగా ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కాగా రంగారెడ్డిజిల్లాలో చేవెళ్ల, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌, కందుకూర్‌, ఇబ్రహీంపట్నం డివిజన్ల పరిధిలో 606 రెవెన్యూ గ్రామాలుండగా.. 282 మంది వీఆర్‌వోలు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరి సేవలు సోమవారంతో ముగిశాయి. రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు సైతం ఆపేశారు.

రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోలే కీలకం

ఇప్పటివరకు రెవెన్యూ వ్యవస్థలో వీఆర్‌వోలే కీలక పాత్ర పోషించారు. గ్రామ స్థాయిలో ఈ వ్యవస్థతోనే అన్ని పనులు సాగుతుండేవి. రెవెన్యూ వ్యవస్థ అంటేనే దోపిడి, లంచం అన్న చందంగా మారింది. కొందరు వీఆర్‌వోలు కాసుల కోసం ఏకంగా రికార్డులను తారుమారు చేసి వాటిని సరి చేసేందుకు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిమిషాల్లో పూర్తయ్యే పనిని లంచం ఇవ్వకుంటే నెలలు, సంవత్సరాలపాటు వెంట తిప్పుకునేవారు.. ఎంతో కొంత ముట్టచెబితే కానీ పని జరిగేదికాదనే విమర్శలున్నాయి.. వ్యవస్థలోని లోపాలే తమను కోటిశ్వరులుగా మార్చాయని కొంతమంది వీఆర్‌వ్వోలు సమర్థించుకున్న దాఖలాలు ఉన్నాయి.  దీన్ని అధిగమించేందుకు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే వీఆర్వో వ్యవస్థకు మంగళం పాడింది. 

రైతు చేతిలో హత్య.. ఏసీబీ వలలో..

రంగారెడ్డి జిల్లాలో ఓ రైతు చేతిలో అబ్దుల్లాపూర్‌మెట్‌ తాసిల్దారు విజయారెడ్డి దారుణ హత్యకు గురైంది. ఓ రైతుకు సంబంధించిన భూ వ్యవహారమే ఆమె నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఒక వర్గానికి అనుకూలంగా, మరో వర్గానికి వ్యతిరేకంగా తాసిల్దారు తీరు ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత రైతు పెట్రోల్‌పోసి నిప్పంటించి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు కొన్ని మాసాల ముందు కేశంపేట్‌ తాసిల్దారు లావణ్య రూ.లక్షల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం, సోదాల్లో రూ.కోట్లు బయటపడడం సంచలనం సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ఎన్నో ఘటనలు ఉన్నాయి. ఎన్నో ఆరోపణలకు కేంద్ర బిందువైన వీఆర్వో వ్యవస్థను అధికారుల లంచాలే చిన్నాబిన్నం చేశాయి. లంచాల కోసం ఎందరో రైతుల ఉసురు తీసింది ఈ వ్యవస్థ. మరెందరో సామాన్యులను ముప్పు తిప్పలు పెట్టింది. ఏసీబీ కేసుల్లో ముందు వరుసలో రెవెన్యూ అధికారుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న సర్కార్‌ రెవెన్యూ ప్రక్షాళనకు పూనుకున్నది.  అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకమైన, మెరుగైన, వేగవంతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నది. మొత్తానికి ఈ వ్యవస్థ రద్దు కావడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది గొప్ప నిర్ణయమని, సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని  అభివర్ణిస్తున్నారు. 

వికారాబాద్‌ జిల్లాలో... 

జిల్లాలో 501 రెవెన్యూ గ్రామాలకు 192 మంది వీఆర్‌వోలు ఉన్నారు. భూ రికార్డులతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయడం వంటి విధులను వీరు నిర్వహిస్తుంటారు. వీటిలో భూ రికార్డులకు సంబంధించిన సేవలు అత్యంత కీలకం కాగా భూ సమస్యల పరిష్కారంలో వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నారు.  భూ సమస్యల పరిష్కారానికి వీఆర్వో కార్యాలయానికి వస్తే అందుబాటులో ఉండకపోవడం, ఉన్నా రేపు, ఎల్లుండి అంటూ కాలం వెళ్లదీసేవారని రైతులు తెలిపారు. వీఆర్వోల ధన దాహం, నిర్లక్ష్యం వల్ల తాము రైతుబంధు పథకానికి దూరమయ్యామని మరికొందరు వాపోయారు. 

అందినకాడికి దండుకోవడమే...

భూ సమస్యలు సృష్టించడం.. పరిష్కారం పేరుతో అందినకాడికి దండకోవడమే పనిగా వీఆర్వోలు వ్యవహరించారని రైతులు మండిపడ్డారు. గతేడాది నవాబుపేట మండలం గేటువనంపల్లిలో రైతు సాయికుమార్‌ తన భూమి పట్టా మార్పిడి కోసం వీఆర్వో రాములు వద్దకు వెళ్తే రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేసి ముందుగా రూ.4 వేలు ఇవ్వాలన్నాడు. దీంతో సాయికుమార్‌ ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. కాపుకాసిన అధికారులు సాయికుమార్‌ వద్ద వీఆర్వో రాములు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక కోట్‌పల్లి మండలం అన్నసాగర్‌ గ్రామంలోని మల్ల య్య అనే రైతుకు రెండు ఎకరాల పొలం ఉంది. వీఆర్‌వో నిర్లక్ష్యంతో కొత్త పాసు పుస్తకంలో కేవలం ఒక ఎకరా మాత్రమే నమోదు కావడంతో ఆ రైతు ఆందోళన గురయ్యాడు. పాసు పుస్తకంతో వీఆర్వో వద్దకు వెళ్తే రూ.1000 ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో చేసేదేమీ లేక డబ్బులు ఇచ్చాడు. అయినా పని జరుగకపోవడంతో వారం తర్వాత వీఆర్వోను కలువగా రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అంటూ చెప్పులరిగేలా వెంట తిప్పుకున్నాడు. పట్టువదలక తిరగడంతో చివరికి ఆర్డీవో కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది అని చేతులు దులుపుకున్నాడు.  ఇలాంటి ఘటనలు ప్రతి గ్రామంలో చోటుచేసుకున్నాయి. వీఆర్వోల నిర్లక్ష్యంతో చాలా మంది రైతులకు ఇంకా కొత్త పాసుపుస్తకాలు అందలేదు. అంతేకాకుండా భూమి కొనుగోలు చేసి చేతికి పట్టా పాసుపుస్తకం రావాలంటే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. అలాంటి లంచగొండి వ్యవస్థను రద్దు చేయడం సంతోషంగా ఉందని జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి అంతం పలికేలా నూతన రెవెన్యూ చట్టం ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. 

 ప్రభుత్వ నిర్ణయం 

హర్షణీయం : వెంకటేశ్‌, కడ్తాల్‌

వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీ యం. వీఆర్వోల నుంచి రికార్డులన్నీ తీసుకోవడం.. వారిని రెవెన్యూ వ్యవస్థకు దూరంగా పెట్టడం అభినందనీయం. ఏ చిన్న పనికైనా ప్రజలను రోజుల తరబడి తిప్పించుకోవడం వారికి అలవాటైపోయింది. పైసలిచ్చినా పని చేయకపోయేది. అవినీతి ఊబిలో కూరుకుపోయిన వీఆర్వోలను తొలగించడం సబబే.          

రైతులు సంతోష పడుతున్నరు

రాములు, రైతు జంగోనిగూడ.నందిగామ

ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామాల్లో రైతులు, సామాన్య ప్రజలు సంతోషపడుతున్నారు. డబ్బులకు ఆశ పడి రెవెన్యూ రికార్డుల్లో తప్పులు చేయడంతో ఎన్నో ఏండ్లుగా రైతులు, రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏండ్లు గడుస్తున్నా ఆసమస్యలు పరిష్కారం కావడంలేదు. వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడం శుభపరిణామం.

రెవెన్యూ అంటేనే అవినీతికి కేరాఫ్‌  

నరేందర్‌, రైతు , ఆమనగల్లు మం.

భూమి సమస్య ఉం దంటేనే ఏండ్ల తరబడి కా ర్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే కాలం ఉండే ది. పైసలు తడిపితేనే పనిజరిగేది. భూమి రికార్డుల్లో ఎక్కించేటప్పుడు మస్తు కిరికిరీలు పెట్టేటోళ్లు. కేసీఆర్‌ సార్‌ కొత్త చట్టం తీసుకొస్తుంటే అంతా స్వాగతిస్తున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు మంచి నిర్ణయం.

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం..

శాంతయ్య, రైతు, రావిర్యాల,  జిల్లెడు చౌదరిగూడ మం. 

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రెవెన్యూ చట్టం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఉండే వీఆర్వోల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు వారు లేకపోవడం వల్ల రైతులు నేరుగా తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లి పనులు చేయించుకుంటారు.  ఇప్పటి నుంచి ఎలాంటి తప్పులు జరగవని అనుకుంటున్నా.

 రైతులకు ఎంతో మేలు 

నర్సింలు రైతు , రాఘవపూర్‌, పరిగి మం. 

 అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం అభినందనీయం. కాస్తులో ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో రైతు వివరాలు నమోదు చేసుకునేందుకు కార్యాలయం చుట్టూ తిరిగినం. సీఎం కేసిఆర్‌ వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం వల్ల నిజమైన రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. 

సీఎం కేసీఆర్‌ ఆలోచనలు భేష్‌ 

శ్రీశైలంయాదవ్‌, రైతు, కడ్తాల్‌ మండలం

రెవెన్యూ వ్యవస్థలో రాజ్యమేలుతున్న అవినీతిని అరికట్టేందుకు కేసీఆర్‌ సార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయి. రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకొని రికార్డులు తారుమారు చేసి సొమ్ము చేసుకునేవారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెవెన్యూశాఖలో అవినీతి అంతమైనట్టే.

 మార్పు వస్తుందని భావిస్తున్నా..

గానుగ శేఖర్‌, రైతు, దోమ

 రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెవెన్యూ వ్యవస్థలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. భూస్వాముల భూముల రికార్డులు ఎప్పుడైనా సరిగ్గానే ఉంటున్నాయి కానీ సాధారణ రైతులే ఇబ్బందులకు గురవుతున్నారు. నూతన రెవెన్యూ చట్టంలో  మార్పులతోనైనా పేదలకు మేలు కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిదే. 

 పొరపాట్లు పునరావృతం కాకూడదు ఎం. విఠల్‌రెడ్డి, రైతు, పులుమామిడి, నవాబుపేట మం.

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడం శుభపరిణామమే. అయితే, కొత్త చట్టంలో గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలి. వీఆర్వోల బాధలు భరించలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డబ్బు ఇచ్చినవాడికి మర్యాదతో పాటు పనులను త్వరితగతిన చక్కదిద్దేవారు. వీఆర్వోలు చేసే పనులకు పనినిబట్టి డిమాండ్‌ ఉండేది. 

పైసలు తీసుకుంటరు.. పని చేయరు...

బిల్లపాటి మల్లయ్య, రైతు, అన్నాసాగర్‌, కోట్‌పల్లి మం.

 నా భార్య బిల్లపాటి లక్ష్మి పేర ఉన్న రెండు ఎకరాల భూమికి బదులుగా కొత్త పాసుబుక్కులో ఒక ఎకరం భూమి నమోదైంది. మిగతా ఒక ఎకరం కోసం ఏండ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా... ఈ రోజు.. రేపు అంటూ.. నాలుగైదు మంది ఎమ్మార్వోలు మారారు. వీఆర్వోలు  లంచాలు పుచ్చుకున్నారు. కానీ ఇంతవరకు పని కాలేదు.

 వీఆర్వోల రద్దుతో ఇబ్బంది లేదు 

గడ్డం సత్యనారాయణ యాదవ్‌ రైతు, సోలిపూర్‌ గ్రా, షాద్‌నగర్‌ మం.

 క్షేత్రస్థాయిలో పని చేసే వీఆర్వోలు రైతులకు అందుబాటులో లేకపోవడం, పైగా రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం అలవాటుగా ఉండే. రైతులకు ఏ కష్టం లేకుండా చేయాలని తెలంగాణ సర్కార్‌ ఎంతో కృషి చేస్తుంది. వీఆర్వో వ్యవస్థ రద్దు తో సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 


రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మంజుల రైతు, శంకర్‌పల్లి మం.

ప్రభుత్వం ఏ పని చేసినా రైతుల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకునే ముందుకువెళ్తుందని చెప్పడానికి వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడమే నిదర్శనం. వీర్వోలు  చేసే పని చిన్నదైనా వారు వ్యవహరించే తీరు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండేది.  నూతనంగా పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇచ్చేటప్పుడు ఇబ్బందులు కల్గించారు.

ఐదారు సార్లు కార్యాలయం చుట్టూ తిరిగా.. 

 బేగరి పర్మయ్య,  రైతు, అంతారం, చేవెళ్ల మం.

నాకు 3 ఎకరాల పట్టా పొలం ఉంది. అందులో రెండు ఎకరాలకు మొదటి నుంచి రైతు బంధు డబ్బు జమ అవుతోంది. ఇంకో ఎకరానికి ఇప్పటివరకు రాలే దు. మా వీఆర్వోకు పలుమార్లు ఆన్‌లైన్‌లో భూమి వివరాలు పొందుపర్చమని కోరా. సరే అయిపోతుందిలే అని సమాధానమిచ్చారే తప్పా ఇప్పటివరకు పరిష్కారం కాలేదు.