సోమవారం 26 అక్టోబర్ 2020
Rangareddy - Sep 26, 2020 , 01:04:47

కేంద్రం మెచ్చింది..

కేంద్రం మెచ్చింది..

కాయకల్ప అవార్డుకు  ఎంపికైన బొంరాస్‌పేట  పీహెచ్‌సీ

అందనున్న రూ.2లక్షల నిధులు

మెరుగైన వైద్యం.. ఆహ్లాదకర వాతావరణం

హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు

బొంరాస్‌పేట : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. జిల్లాస్థాయిలో బొంరాస్‌పేట పీహెచ్‌సీని ఉత్తమంగా గుర్తించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, దవాఖానలో సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డుకు ఎంపిక చేస్తుంది. ఈ అవార్డు కింద దవాఖానకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలను మంజూరు చేస్తుంది. ఈ నిధులను దవాఖాన అభివృద్ధికి, సౌకర్యాలను మెరుగుపర్చడానికి వినియోగించుకోవచ్చు. పీహెచ్‌సీ కాయకల్ప అవార్డుకు ఎంపిక కావడంపై వైద్య సిబ్బంది, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  పీహెచ్‌సీని సందర్శించడానికి త్వరలో అధికారుల బృందం వస్తుందని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్‌ తెలిపారు. 

ఆహ్లాదకరమైన వాతావరణంలో పీహెచ్‌సీ..

బొంరాస్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పచ్చని చెట్లు విరివిగా ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో పీహెచ్‌సీ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. వేసవిలో కూడా చల్లటి గాలిలో సిబ్బంది, రోగులు సేద తీరుతుంటారు. ఆవరణలో రోగులు, వారి వెంట వచ్చిన వారు కూర్చోవడానికి దవాఖాన అభివృద్ధి నిధుల నుంచి ఇటీవల సిమెంటుతో తయారు చేసిన బెంచీలను తెప్పించారు. పీహెచ్‌సీ లోపలి భాగంలో కూడా ప్రైవేటు దవాఖానలో ఉండే మాదిరిగా రిసెప్షన్‌ కౌంటర్‌, పట్టీలు కట్టే గది, ఆరోగ్య మిత్ర విభాగం, ఫార్మసీ విభాగం ప్రత్యేకంగా ఉన్నాయి. నేలపైన ఎప్పుడూ శుభ్రంగా ఉండేవిధంగా మ్యాట్‌ను పరిచారు. రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.26 వేలతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ఫిల్టర్‌ను ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీకి ఆనుకునే అదనంగా ఒక గదిని నిర్మించారు. ఇన్‌పేషంట్‌ రోగులకు బెడ్లు కూడా నీట్‌గా ఉంచారు. కొత్త వారు ఎవరైనా పీహెచ్‌సీకి వస్తే ఇది సర్కారు దవాఖానేనా అని ఆశ్చర్యపోక మానరు. 

కాన్పులకు పెరిగిన స్పందన..

పీహెచ్‌సీలో కాన్పులు చేయించుకునే వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో పెరిగింది. ప్రభుత్వ దవాఖానలలో  కాన్పులు చేయించుకుంటే సర్కారు కేసీఆర్‌ కిట్‌లను అందించడంతో పాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లవాడైతే రూ.12 వేలు అందజేస్తుంది. ఒకప్పుడు సర్కారు దవాఖానల్లో కాన్పులంటేనే మహిళలు భయపడేవారు. కానీ ఇపుడు సర్కారు దవాఖానకు వెళ్లితేనే సుఖ ప్రసవాలు అవుతున్నాయని పేదలు నమ్ముతున్నారు. సిబ్బంది కూడా కాన్పులకు వచ్చే వారికి నాణ్యమైన వైద్యం అందిస్తుండడంతో ప్రసవాల సంఖ్య పెరుగుతుంది. బొంరాస్‌పేట పీహెచ్‌సీలో ప్రతి నెలా 20 వరకు కాన్పులు జరుగుతున్నాయి. రోజూ 100 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తున్నారు.  

అందరి సహకారం వల్లే..

వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మండల ప్రజల అందరి సహకారం వల్లే పీహెచ్‌సీ కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. పీహెచ్‌సీ అభివృద్ధికి నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో దవాఖానను మరింత అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన వైద్యం అందిస్తాం. 

-డాక్టర్‌ రవీంద్ర, మండల వైద్యాధికారి

logo