ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Nov 11, 2020 , 09:02:31

నిఘా నేత్రాలుగా సీసీ కెమెరాలు

నిఘా నేత్రాలుగా సీసీ కెమెరాలు

బడంగ్‌పేట : నిఘా నేత్రాలుగా సీసీ కెమెరాలు పని చేస్తాయని, మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ పరిధిలోని గాయిత్రీహిల్స్‌ కాలనీలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌తో కలిసి మంగళవారం సీసీ కెమెరాలను ప్రారంభించారు. రూ.14.50లక్షలతో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సాయి బాలాజీనగర్‌, గాయిత్రీ హిల్స్‌, రాఘవేంద్ర కాలనీల్లో వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే ఐదు లక్ష ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. జెల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపల్‌తోపాటు బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని ఇతరులు వాగ్ధానాలు చేస్తున్నారని, అలాంటి అవకాశాలను ఇవ్వకుండానే తామే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నేను సైతం అనే కార్యక్రమం ద్వారా చాలా ప్రాం తాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి కాలనీవాసులు ముందుకు వస్తున్నారన్నారు.  

ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు చేయిస్తాం..

బాలాపూర్‌ మండల పరిధిలో ఉన్న 48 చెరువులను అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చెరువుల్లోకి మురుగు నీరు పోకుండా ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. మీర్‌పేట ట్రంక్‌ లైన్‌ను బడంగ్‌పేట వరకు పొడిగిస్తామన్నారు. భవిష్యత్‌లో వరద సమస్య రాకుండా చూస్తామన్నారు. అనంతరం సీపీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ వంద మందికి సమానంగా ఒక్క సీసీ కెమెరా పనిచేస్తుందని అన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తున్నారన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు 167 జీవోను ఏర్పాటు చేశారన్నారు. ప్రతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పినట్లు గుర్తు చేశారు. జంటనగరాల్లో పది లక్షల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు. వీటి ఆధారంగానే ఇతర రాష్ర్టాల్లో దాగిన దొంగలను సైతం పట్టుకొచ్చామని వివరించారు. కార్యక్రమంలో మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, మీర్‌పేట డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి,  కార్పొరేటర్‌ అమిత శ్రీశైలం చారి, పెద్ద బావి సుదర్శన్‌రెడ్డి,  కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి, ఏసీపీ శంకర్‌, లిక్కి కృష్ణారెడ్డి, కాలనీ అసోసియేషన్‌ నాయకులు ధనేశ్వర్‌ రెడి,్డ నర్సింగ్‌ రావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.