బుధవారం 28 అక్టోబర్ 2020
Rangareddy - Sep 28, 2020 , 01:04:37

ప్రజలు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు

ప్రజలు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు

అధిక వర్షపాతం వల్లనే వరద పోటెత్తింది

 విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి... ఆర్కేపురం డివిజన్‌లో విస్తృత పర్యటన

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : గతంలో ఎప్పుడూ లేని విధంగా అధిక వర్షాలు పడడంతో కాలనీలలో వరదనీరు చేరిందని, ముందుజాగ్రత్తగా తీసుకున్న చర్యలతో నష్టం తగ్గిందని మంత్రి సబితారెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి సబితారెడ్డి రెండోరోజు సైతం విస్తృత పర్యటన చేసి బాధితులతో మాట్లాడి, తక్షణ చర్యలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్‌లోని హరిపురికాలనీ, జనప్రియ గార్డెన్స్‌, యాదవనగర్‌, ఎన్టీఆర్‌ కాలనీ ఫేస్‌-1, ఫేస్‌-2, బంజారాకాలనీ, జూనియర్‌ ఎన్టీఆర్‌ నగర్‌లలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఈ ఏడాది గతంలోకంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయిందని, డ్రైనేజీల సామర్థ్యం సరిపోక, వరద పోటెత్తిందని చెప్పారు. ఎల్‌బీ నగర్‌ వైపు నుంచి ఎన్టీఆర్‌ నగర్‌ మీదుగా నీరు కిందికి వెళ్తుందని, ఈసారి వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో సమస్యలు వచ్చాయన్నారు. తాగునీరు కూడా కలుషితమవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వరద, డ్రైనేజీ నీరు ఇందులో కలువకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణాల బాగు కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.65వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. సమస్యలు లేని విశ్వనగరంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నట్లు, ఎన్టీఆర్‌ నగర్‌ లాంటి చోట్ల రెగ్యులరైజేషన్‌ గురించి ఇటీవలి ఓ సమావేశంలో సీఎం ప్రస్తావించారని మంత్రి చెప్పారు. కాలనీవాసుల ఆస్తులకు సంబంధించి పాస్‌బుక్కులు సైతం ఇవ్వనున్నట్లు, ఇంకా ఏమైనా ఇలాంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలతో సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడ్డట్లు మంత్రి స్పష్టం చేశారు.


logo