బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jul 23, 2020 , 00:12:53

అభివృద్ధికి ఆమడ దూరం..

అభివృద్ధికి ఆమడ దూరం..

అధ్వానంగా మట్టి రోడ్లు 

అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ 

కనీస వసతులు కూడా కరువు 

సౌకర్యాలు కల్పించాలంటున్న కాలనీ వాసులు

ఆర్కేపురం, జూలై 22 : సరూర్‌నగర్‌ డివిజన్‌లోని శ్రీనివాస కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కాలనీ పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. నగరంలో ఉంటున్నామన్న సంతోషం తప్ప సౌకర్యాలు లేవంటూ కాలనీవాసులు విచారం వ్యక్తం చేస్తు న్నారు. సరూర్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయానికి సమీపంలో ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

కాలనీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వీధుల గుండా మురుగునీరు ప్రవహిస్తున్నది. 

అసలే వర్షాకాలం కావడంతో రోగాల బారినపడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం తాగునీటి సమస్యను పరిష్కరించేదుకు పైపులైన్ల కోసం రోడ్లను తవ్వారు. పనులు పూర్తయిన వెంటనే ప్యాచ్‌ వర్క్స్‌ చేపట్టాల్సిన కాంట్రాక్టర్‌ అలాగే వదిలేయడంతో వర్షం వచ్చినప్పుడల్లా రోడ్లు బురదయంగా మారి కాలనీలో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి కాలనీ రోడ్లు, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. చిన్నచిన్న సమస్యలే అయినా దీర్ఘ కాలికంగా పరిష్కారానికి నోచుకోకపోవడంతో అవి పెద్దవిగా మారుతున్నాయి. 

మౌలిక సదుపాయాలు కల్పించాలి 

మా కాలనీలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్నాం. తాగునీటి పైపులైన్ల కోసం రోడ్లను తవ్వి పనులు పూర్తయిన తరువాత ప్యాచ్‌వర్క్స్‌ చేపట్టకుండా వదిలేయడంతో కాలనీ లో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. డ్రైనే జీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అధికారులు స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. 

- చారి, స్థానికుడు 

కాలనీల అభివృద్ధే ధ్యేయం

కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. తెలంగాణ ప్రభుత్వంలో కాలనీలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్నాయి. డివిజన్‌ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సరూర్‌నగర్‌ డివిజన్‌ను సమస్యలు లేని డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నా. ప్రతి కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.

- అనితాదయాకర్‌రెడ్డి, కార్పొరేటర్‌ పారుపల్లి