ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Rangareddy - Jan 27, 2021 , 00:10:44

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు

 • ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవం
 • వాడవాడలా ఎగిరిన జాతీయ పతాకం 
 • అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు 
 • సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా చూడాలి
 • జిల్లాలో 4,175 మంది వైద్యారోగ్య సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ 
 • ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతుల ప్రారంభం
 • ‘పల్లెప్రగతి’తో మారుతున్న పల్లెలు
 • ఈసారి 74 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం
 • ఎస్‌హెచ్‌జీలకు రూ.125.46 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు అందజేత
 • అర్హులందరికీ సంక్షేమం  : అమయ్‌కుమార్‌, కలెక్టర్‌, రంగారెడ్డి జిల్లా
 • గచ్చిబౌలిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినరంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలి. పేదల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర సర్కార్‌ అమలుచేస్తున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. పల్లెప్రగతితో  గ్రామాల రూపురేఖలు మారాయి. యాసంగిలో  రూ.342 కోట్ల రైతుబంధు, 317 మంది రైతు కుటుంబాలకు రూ.16 కోట్ల రైతుబీమా అందించాం. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా 847 పరిశ్రమలకు అనుమతులు మంజూరుకాగా.. ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి. 

రంగారెడ్డి, జనవరి 26, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ హరీశ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.125.46 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు,  హరితహారంలో అత్యుత్తమ విధులను నిర్వర్తించినందుకుగాను అటవీ శాఖకు చెందిన ఎస్‌.శ్రీధర్‌, పిర్యానాయక్‌కు రూ.10 వేల చొప్పున నగదు, ప్రశంసా పత్రాలను కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అందజేశారు.

4,175 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌.. 

జిల్లావ్యాప్తంగా 4,175 ప్రభుత్వ వైద్యారోగ్య సిబ్బందితో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలకు కరోనా వ్యాక్సిన్‌ వేశారని కలెక్టర్‌ తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసులు, పారిశుధ్య కార్మికులు, 50 ఏండ్లకు పైబడిన వారికి టీకా వేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. మెరుగైన వైద్యం కోసం 35 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

‘పల్లెప్రగతి’తో మారిన పల్లెల ముఖచిత్రం.. 

‘పల్లెప్రగతి’ కార్యక్రమంతో జిల్లాలోని పల్లెల రూపురేఖలు మారాయని కలెక్టర్‌ అన్నారు.  డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. జిల్లాలోని 558 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్‌, ట్రాలీలను అందజేశామన్నారు. హరితహారంలో భాగంగా  ఈ ఏడాది 74 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా వానకాలం సీజన్‌లో 2.69 లక్షల మంది రైతులకు రూ.343 కోట్లు, యాసంగిలో 2.73 లక్షల మంది రైతులకు రూ.342 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా పథకం కింద 317 మంది రైతు కుటుంబాలకు రూ.16 కోట్ల పరిహారాన్ని అందజేసినట్లు తెలిపారు.

టీఎస్‌-ఐపాస్‌ నుంచి రూ.18,024 కోట్ల పెట్టుబడులు.. 

టీఎస్‌-ఐపాస్‌ నుంచి జిల్లాలో రూ.18,024 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.  జిల్లాలో 847 పరిశ్రమలకు అనుమతులు వచ్చాయన్నారు. జిల్లాలో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో 7,209 మంది లబ్ధిదారులకు రూ.72.17 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశామన్నారు.  జిల్లాలో 6 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,777 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదని కలెక్టర్‌ వెల్లడించారు. 

ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులు.. 

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. మిగతా తరగతుల విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నామన్నారు. మరోవైపు మత్స్యశాఖ నుంచి 576 చెరువుల్లో వంద శాతం సబ్సిడీతో 132 లక్షల చేపపిల్లలను వదిలామన్నారు. గొర్రెల పంపిణీ పథకం కింద రూ.142 కోట్ల వ్యయంతో 11,312 గొర్రెలను పంపిణీ చేశామన్నారు. ఈ వేడుకల్లో  అదనపు కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌జైన్‌, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ కవిత, డీఆర్వో హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.   

VIDEOS

logo