చేవెళ్లలో 17 రైతు వేదికలు

- ఒక్కొక్క వేదిక రూ. 22లక్షలతో నిర్మాణం
- ప్రారంభానికి ముస్తాబు
చేవెళ్ల, జనవరి24: తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు పూర్తయ్యాయి. వ్యవసాయంలో రైతులకు ఆధునిక సాంకేతిక పద్ధతులు క్షేత్ర స్థాయిలో అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేది కలను నిర్మిస్తున్నది. మండలాన్ని క్లస్టర్లుగా విభజించి వ్యవసాయ సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్యకనుగుణంగా వీటి నిర్మాణాలను ప్రా రంభించారు. అతితక్కువ కాలంలో వీటి నిర్మాణం పూర్తయింది. చేవెళ్ల డివిజన్లోని చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో రైతు వేదికలు నిర్మాణం పూర్తయింది. చేవెళ్ల మండలంలో (5), చేవెళ్ల, ఆలూర్, కందవాడ, కమ్మెట, ఖానాపూర్‌లలో రైతు వేదికల నిర్మాణం పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా యి. అదే విధంగా శంకర్పల్లి మండలంలో (4) శంకర్పల్లి, మహాలింగాపూర్, మోకిలా, పర్వేద, షాబాద్ మండలంలో (6) షాబాద్, మాచన్‌పల్లి, హైతాబాద్, మన్ మర్రి, కాక్లూర్, తాలపల్లి, మొయినాబాద్‌లో రెండు మొయినాబాద్, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కాగా శంకర్ పల్లిలో రెండు రైతు వేదికలు ప్రారంభించారు.
అన్నదాతలకు అందుబాటులోకి సాంకేతికత ....
రైతుల వేదికల నిర్మాణం ద్వారా రైతులకు ఇక నుంచి ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి రానున్నాయి. వ్యవసా యంలో ఆధునిక పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను వచ్చే ప్రక్రియలకు అధికార యం త్రాంగం శ్రీకారం చుట్టింది. రైతుల సంఖ్యకనుగుణంగా క్లస్టర్ల వారీగా విభజించి రైతులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు అందిస్తారు. ఈ రైతు వేదికలలో రైతులతో ముఖాముఖీ సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. వ్యవసాయ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయోత్పత్తులు పెరగడానికి కృషి చేస్తారు.
ఒక్కొక్క వేదిక రూ. 22లక్షలతో నిర్మాణం...
రైతు వేదికలను నూతన హంగులతో ఎంతో సుందరంగా తీర్చిద్దుతున్నారు. రైతులకు తగు సూచనలు.సలహాలు ఇవ్వడానికి విశాలమైన హాలుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అధికారులు నాణ్యత విషయంలో రాజీపడడం లేదు. రూ. 22లక్షల్లో పది లక్షలు ఎన్ఆర్ఈజీఎస్, మరో 12 లక్షలు అగ్రికల్చర్ శాఖ నిధులతో ఒక్కో రైతువేదిక నిర్మాణమవుతున్నది.