బుధవారం 03 మార్చి 2021
Rangareddy - Jan 24, 2021 , 00:32:00

అటెన్ షన్

అటెన్ షన్

 • మే 17 నుంచి పదోతరగతి పరీక్షలు
 • షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం
 • ఉత్తీర్ణతశాతం పెంచేందుకుజిల్లా విద్యాశాఖ ప్రణాళికలు 
 • ఉమ్మడి జిల్లాలో 72,650 మంది విద్యార్థులు
 • ఫిబ్రవరి నుంచి 9, 10 తరగతులు ప్రారంభం

కరోనా నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు ఫిబ్రవరి 1న తెరుచుకోనున్నాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు కొవిడ్‌ నిబంధనల పాటిస్తూ  పాఠాలు బోధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించగా.. జిల్లా అధికారులు ఆ దిశగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌ మొత్తం కలుపుకొని 72,650 మంది ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు ఉన్నారు. అందులో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 50,923 మంది, వికారాబాద్‌ జిల్లాలో 21,727 మంది విద్యార్థులు ఉన్నారు. 

-రంగారెడ్డి, జనవరి 23, (నమస్తే తెలంగాణ)

రంగారెడ్డి, జనవరి 23, (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌తో పాటు 9, 10 తరగతుల క్యాలెండర్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 15 నుంచి మొదటి అసెస్‌మెంట్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 15 నుంచి రెండో అసెస్‌మెంట్‌, మే 7 నుంచి 13 వరకు సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు మొత్తం 72,650 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 50,923 మంది, వికారాబాద్‌ జిల్లాకు సంబంధించి 21,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 

ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..

కరోనా ప్రభావంతో దాదాపు పది నెలలపాటు మూతపడిన పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. అన్ని తరగతులకు కాకుండా కేవలం 9, 10 తరగతులకు మాత్రమే తరగతులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు శనివారం 9, 10 తరగతుల క్యాలెండర్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో బోధన కొనసాగగా, ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష బోధన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలను శుభ్రం చేయడంతోపాటు శానిటైజ్‌ చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. రెండు, మూడు రోజులుగా జిల్లాలోని అన్ని పాఠశాలల పరిసరాలతోపాటు తరగతి గదులను పరిశుభ్రం చేస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించి 9, 10 తరగతుల విద్యార్థులు 1,06,875 మంది హాజరుకానున్నారు. తరగతి గదిలోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. ఒక్కొ తరగతి గదిలో 20 మంది విద్యార్థులుండేలా, బెంచీకి ఒక్కరు చొప్పున తరగతి గదులను సిద్ధం చేస్తున్నారు. ఏదైనా తరగతిలో అధిక మంది విద్యార్థులు ఉన్నట్లయితే సెక్షన్లుగా విభజించి తరగతులు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రతి విద్యార్థి శరీర ఉష్టోగ్రతలు తెలుసుకునేందుకు థర్మామీటర్లను పాఠశాలల్లో అందుబాటులో ఉంచనున్నారు. వీటితోపాటు ప్రతీ విద్యార్థికి మాస్కులు, శానిటైజర్స్‌ను అందించేలా ఈనెల 27లోగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని నిర్ణయించారు.

 • రంగారెడ్డి జిల్లాలో జడ్పీహెచ్‌ఎస్‌లు-244
 • కేజీబీవీలు-20
 • మోడల్‌ స్కూళ్లు-9
 • ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు-36
 • ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలు-782
 • 9,10 తరగతుల విద్యార్థులు-36 వేలు

VIDEOS

logo