380 ఎకరాల్లో ఎన్ పీఏ

- వినోభానగర్‌లో ఏర్పాటుకు రంగం సిద్ధం
- రూ.22.50కోట్లతో భూసేకరణ పూర్తి
- రెండునెలల్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు
అనేక రక్షణరంగ సంస్థలకు నిలయంగా మారిన ఇబ్రహీంపట్నంలో మరో సంస్థ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆక్టోపస్, ఎన్ఎస్జీ తరహాలోనే ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్ వద్ద నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ) ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి రూ.22.50కోట్లతో సర్వే నెంబర్ 58లో 380 ఎకరాల భూమిని సేకరించగా, మరో రెండు నెలల్లో పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నగర శివారులోని శివరాంపల్లి వద్ద ఉన్న సర్దార్‌వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి అనుబంధంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ శిక్షణ పొందే ఐపీఎస్ అధికారులకు ఫారెస్ట్‌లోనూ ఎలా విధులు నిర్వర్తించాలనే అంశంపై ఇక్కడ శిక్షణ ఇస్తారు.
- ఇబ్రహీంపట్నానికి మరో రక్షణ రంగ సంస్థ
- వినోభానగర్‌లో నేషనల్ పోలీసు అకాడమీ ఏర్పాటు
- ఆక్టోపస్, ఎన్ఎస్జీ తరహాలోనే ఎన్పీఏ
- 380 ఎకరాల్లో ఐపీఎస్‌లకు శిక్షణ
- రూ.22.50 కోట్లతో భూసేకరణ
- మార్చిలో పనుల ప్రారంభానికి యత్నం
ఇబ్రహీంపట్నం, జనవరి 19 : రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో మరో రక్షణ రంగ సంస్థ ఏర్పాటు కాబోతున్నది. ఎన్ఎస్జీ, ఆక్టోపస్ తరహాలో ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్ వద్ద నేషనల్ పోలీస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీఎస్‌లకు ఇచ్చే శిక్షణలో భాగంగా అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. మార్చి లేదా ఏప్రిల్‌లో (ఎన్పీఏ) నేషనల్ పోలీస్ అకాడమీ పనులను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్‌లో సర్వేనెంబర్ 58లో 380ఎకరాలను తీసుకున్నారు. మొదటి విడుతలో 339ఎకరాలను తీసుకోగా, సరిపోదని మరో 41 ఎకరాలను ఇటీవల సేకరించారు. రైతులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఈ భూమిని రెవెన్యూ అధికారులు, ఎన్పీఏ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం నగరశివారుల్లోని శివరాంపల్లి వద్ద గల సర్దార్వల్లబాయ్పటేల్ పోలీస్ అకాడమీకి అనుబంధంగా, ఇబ్రహీంపట్నంలో మరో అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. సర్దార్వల్ల్లబాయ్పటేల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందే ఐపీఎస్ అధికారులకు ఫారెస్టులో విధులు ఎలా నిర్వర్తించాలన్న దానిపై శిక్షణ ఇవ్వనున్నారు.
త్వరలో పనులు ప్రారంభం..
ఇబ్రహీంపట్నం సమీపంలో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు మార్చి లేదా ఏప్రిల్ మాసంలో పనులను ప్రభుత్వం ప్రారంభించనున్నది. ఇందుకోసం అవసరమైన నిధులను ఇప్పటికే కేటాయించింది. ఎన్‌పీఏకు కేటాయించిన భూమికి ప్రహరీ నిర్మాణంతోపాటు శిక్షణకు వచ్చే ఐపీఎస్‌లకు ప్రత్యేక వసతుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
రక్షణ రంగ సంస్థలకు నిలయంగా ఇబ్రహీంపట్నం..
ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే అనేక రక్షణ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఎన్ఎస్జీ, ఆక్టోపస్ శిక్షణ కేంద్రాలు ఇప్పటికే ప్రాంరభం అయ్యాయి. బీడీఎల్‌లో కూడా రక్షణ రంగానికి సంబంధించిన అనేక మిసైల్ వంటి వాటిని తయారు చేసేందుకు వీలుగా శిక్షణ ఇస్తున్నారు. నగర శివారుల్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో రక్షణ రంగ సంస్థ ఏర్పాటు పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇబ్రహీంపట్నం సమీపంలో ఏర్పాటు చేసిన ఆక్టోపస్‌లో అనేక మంది పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. ఎన్ఎస్జీలో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఎన్‌పీఏను ఇక్కడే ఏర్పాటు చేస్తే అన్నింటికి సులువుగా ఉంటుంది.
భూసేకరణకు రూ.22.50కోట్లు..
నేషనల్ పోలీస్ అకాడమీ కోసం పోలీస్ శాఖకు కేటాయించిన భూమిలోని రైతులకు ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించింది. ఈ భూమి గతంలో భూదాన్‌బోర్డు ఆధీనంలో ఉండగా, పట్టాలు పొందిన రైతులకు ఎకరాకు రూ.ఏడున్నర లక్షల చొప్పున సుమారు రూ.22 కోట్ల యాభై లక్షలను ప్రభుత్వం రైతులకు పరిహారంగా అందజేసింది. రైతులకు పరిహారం పూర్తయిన వెంటనే పోలీస్ శాఖకు ఈ భూమిని కేటాయించింది.
పూర్తయిన భూసేకరణ..
ఇబ్రహీంపట్నం సమీపంలోని సర్వేనంబర్ 58లో నేషనల్ పోలీస్ అకాడమీ ఏర్పాటుకు గానూ 385 ఎకరాలను స్వాధీనం చేసుకుని పోలీస్ శాఖకు అందజేశాం. భూమికి సంబంధించిన రైతులందరికీ పరిహారం చెల్లించాం.
- వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం తాసిల్దార్