గురువారం 04 మార్చి 2021
Rangareddy - Jan 20, 2021 , 00:26:58

దర్గా.. ధగధగ

దర్గా.. ధగధగ

  • రేపటి నుంచి ఉర్పు
  • ముస్తాభైన జేపీదర్గా

కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులోని హజరత్‌ జహంగీర్‌పీర్‌దర్గా ఉర్సుకు ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 700 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ దర్గాను కులమతాలకతీతంగా భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. 

కొత్తూరు రూరల్‌, జనవరి 19 : కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులోని హజరత్‌ జహంగీర్‌పీర్‌ దర్గా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు వచ్చి దర్శించుకుంటారు. దర్గాలోని బాబాలను పూజించిన వారికి కోరిన కోరికలు తీరుతాయని  భక్తుల ప్రగాఢ నమ్మకం. దర్గాకు హిందూ, ముస్లిం అన్న  తేడా లేకుండా వారంలో మూడు రోజులూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు దట్టీలను కట్టడంతోపాటు తలనీలాలను సమర్పిస్తారు. మరికొందరు న్యాజ్‌(కందూరు)ను చేస్తారు. భక్తులు న్యాజ్‌ చేసి మొక్కులను తీర్చుకుని కానుకలను బాబాలకు సమర్పిస్తారు. ముఖ్యంగా ప్రతి గురు, ఆదివారాల్లో భక్తుల సందడి అధికంగా ఉంటుంది.

విశిష్టత...

జహంగీర్‌పీర్‌ దర్గా ఏర్పడడం వెనుక అప్పటి నుంచి నేటి వరకు ఓ కథనం వినికిడిలో ఉంది. 700 ఏండ్ల కింద ఓ మేకల కాపరి రోజూ అటువైపుగా ఉన్న అడవిలో మేకలు కాస్తూ జీవనం కొనసాగించే వాడు. ఈ క్రమంలో ఒక రోజు మేకలను కాస్తుండగా మేకలు శిలలు(రాళ్లు)గా మారాయి. గమనించిన కాపరి కన్నీరు మున్నీరుగా విలపించి, ఓ చెట్టుకింద నిద్రపోయాడు. నిద్రలో ఇద్దరు వ్యక్తులు హజరత్‌ రహమతుల్లా అలే, హజరత్‌ బురానుద్దీన్‌ వలియా అలేలు కలలో కనిపించి తమకు ఓ మేకను నైవేద్యంగా సమర్పిస్తే యథావిధిగా మారుతాయని చెప్పడంతో ఆ మేకల కాపరి కందూరు(న్యాజ్‌)ను నిర్వహిస్తాడు. దీంతో రాళ్లు కాస్తా జీవాలుగా మారాయి. అప్పటి నుంచి నేటి వరకు భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవంగా కొలుస్తున్నారు.  

ప్రాముఖ్యత.. 

దేశంలో అతి పవిత్రమైన అజ్మీర్‌ దర్గాలో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలందరూ దేశం నలుమూలల ప్రచారానికి వెళ్లారని, అలా వెళ్లిన వక్తలు మొదట బాగ్దాద్‌ నగరానికి, తర్వాత ఢిల్ల్లీకి, గుల్బార్గాకు తిరిగి చివరకు ఇక్కడి(ప్రస్తుత దర్గా)కి వచ్చి సమాధి అయినట్లు మతపెద్దలు చెబుతుంటారు. ఇలా వెలసిన హజరత్‌ జహంగీర్హ్రమతుల్లా అలే, హజరత్‌బురానుద్దీన్‌ వలియా అలేలను నిజాం రాజ్యాన్ని పరిపాలించిన ఔరంగాజేబు దర్శించుకున్నట్లు చరిత్రలో ఉన్నట్లు వినికిడి.  

21 నుంచి 23వరకు ఉర్సు...

ప్రతి ఏడాది జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత మూడు రోజులపాటు ఉర్సును వక్ఫ్‌బోర్డు, స్థానిక నాయకులు, భక్తుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఉర్సును నిర్వహించేందుకు వక్ఫ్‌బోర్డు అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 21న గంధం, 22న దీపారాధన, 23న ఖత్‌మే ఖురాన్‌ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో బాబాలకు గంధాన్ని సమర్పించడం ఆచారం. ఇన్ముల్‌నర్వ గిరిజనులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇన్ముల్‌నర్వ గ్రామం నుంచి దర్గా వరకు డప్పుచప్పుళ్లతో గంధాన్ని తీసుకొచ్చి బాబాలకు సమర్పిస్తారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. 

దర్గాకు మరింత ప్రాముఖ్యత...

సీఎం కేసీఆర్‌ జహంగీర్‌పీర్‌ దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో జేపీ దర్గా ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇప్పటికే సీఎం ఆదేశాలతో రూ.18.5కోట్ల వ్యయంతో కొత్తూరు నుంచి జేపీ దర్గా వరకు నాలుగులైన్ల రహదారిగా,  ఇన్ముల్‌నర్వ, దర్గాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. రోడ్డు విస్తరణ పనులకు దర్గాలో షాపింగ్‌ మాల్స్‌, అంతర్గత మురుగుకాల్వలు, వీధి దీపాలతో కొత్త హంగులు రానున్నాయి. దర్గాకు రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించేలా అభివృద్ధి చేస్తుండడంతో మండల ప్రజలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

షాపింగ్‌ మాల్స్‌...

ప్రతి గురు, ఆదివారాల్లో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన షాపుల్లో యాత్రికులు అధిక సంఖ్యలో కొనుగోళ్లు చేస్తారు. ఆదివారం ఇక్కడ సందడి వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన షాపింగ్‌ మాల్స్‌లో యాత్రికులు కొనేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. దర్గా ఆవరణలో ఏర్పాటు చేసే కుండలకు ఎంతో ప్రత్యేకత ఉంది. దర్గాకు వచ్చిన భక్తులు వివిధ ఆకృతుల్లో ఉండే కుండలను కొనేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు.  

VIDEOS

logo