ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Rangareddy - Jan 17, 2021 , 00:19:32

‘ఇరిగేషన్‌'లో కొత్త సర్కిళ్లు

‘ఇరిగేషన్‌'లో కొత్త సర్కిళ్లు

  • హైదరాబాద్‌ సీఈ పరిధిలోకి జిల్లా
  • మారిన నీటిపారుదల శాఖ స్వరూపం
  • ఇరిగేషన్‌ పునర్‌వ్యవస్థీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఇరిగేషన్‌ శాఖలో పెరిగిన పోస్టులు
  • మూడు సర్కిళ్లతో జిల్లా ఇరిగేషన్‌ శాఖ, ఐదు డివిజన్లుగా ఏర్పాటు

రంగారెడ్డి, జనవరి 8, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సాగునీటి వనరులన్నింటినీ ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది. భారీ, మధ్య తరహా, చిన్ననీటి పారుదల శాఖలను జలవనరుల శాఖగా మార్పు చేసింది. నీటి పారుదల శాఖను పునర్‌వ్యవస్థీకరిస్తూ ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సర్కిళ్ల పరిధి మార్పు, కొత్త డివిజన్లు, కొత్త సబ్‌ డివిజన్లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా నీటి పారుదల శాఖ పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియతో పరిధి తగ్గడంతోపాటు పోస్టులు పెరిగాయి. వ్యవస్థీకరణ ప్రక్రియతో ఇరిగేషన్‌ శాఖలోని అన్ని క్యాడర్లలోని ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మొత్తం హైదరాబాద్‌ చీఫ్‌ ఇంజినీర్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. గతంలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఆధ్వర్యంలో ఉండగా, ప్రస్తుతం సీఈ పోస్టును ప్రభుత్వం  సృష్టించింది. గతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న కొన్ని డివిజన్లు, సబ్‌ డివిజన్లను మార్చుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాతిపదికన డివిజన్లు, సబ్‌ డివిజన్లను ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ జిల్లాలోని ఒక డివిజన్‌ను జిల్లా ఇరిగేషన్‌ సర్కిల్‌లోకి తీసుకువచ్చారు. 

జిల్లాకో చీఫ్‌-ఇంజినీర్‌ 

ఇకపై జిల్లాకో చీఫ్‌ ఇంజినీర్‌ ఉండనున్నారు. సీఈ నియంత్రణలోనే జల వనరుల శాఖ కార్యకలాపాలన్నీ కొనసాగనున్నాయి. నీటి పారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణతో ఇప్పటివరకు జిల్లా నీటి పారుదల శాఖకు బాస్‌గా ఉన్న ఎస్‌ఈ(సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌)ల పరిధి తగ్గనున్నది. అంతేకాకుండా డివిజన్‌, సబ్‌ డివిజన్‌ స్థాయి పోస్టులు ప్రతి జిల్లాలో పెరుగనున్నాయి. హైదరాబాద్‌ నీటిపారుదల శాఖ చీఫ్‌-ఇంజినీర్‌ పరిధిలో కొత్తగా మూడు సర్కిళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు రంగారెడ్డి సర్కిల్‌గా ఉండగా, కొత్తగా హైదరాబాద్‌ సర్కిల్‌గా పేరు మార్చుతూ, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్‌, కృష్ణాబేసిన్‌ హైదరాబాద్‌ సర్కిల్‌ను షాద్‌నగర్‌గా ఏర్పాటు చేశారు.    హైదరాబాద్‌ ఐబీ డివిజన్‌,  హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్‌, కృష్ణాబేసిన్‌ హైదరాబాద్‌, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, షాద్‌నగర్‌, వికారాబాద్‌,  హైడ్రాలజీ, ఇన్వెష్టిగేషన్‌, కృష్ణాబేసిన్‌, మహబూబ్‌నగర్‌ డివిజన్లు ఉండగా, హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో హైదరాబాద్‌ డివిజన్‌-1, హైదరాబాద్‌ డివిజన్‌-2, షాద్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో షాద్‌నగర్‌, షాద్‌నగర్‌ సర్కిల్‌లో వికారాబాద్‌, చేవెళ్ల డివిజన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డివిజన్లలో సబ్‌ డివిజన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. హైదరాబాద్‌ డివిజన్‌-1లో సబ్‌ డివిజన్లుగా ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌, మేడ్చల్‌, హైదరాబాద్‌ ఉండనున్నాయి. అదేవిధంగా హైదరాబాద్‌ డివిజన్‌-2లో పెద్ద అంబర్‌పేట్‌, యాచారం, హైదరాబాద్‌ సబ్‌ డివిజన్లను ఏర్పాటు చేశారు. షాద్‌నగర్‌ డివిజన్‌లో షాద్‌నగర్‌, కొందుర్గు, కొత్తూరు సబ్‌ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ డివిజన్‌లో రెండు సబ్‌-డివిజన్లు ఏర్పాటయ్యాయి. వికారాబాద్‌ డివిజన్‌లో వికారాబాద్‌, తాండూర్‌, కోట్‌పల్లి, యాలాల సబ్‌-డివిజన్లు ఉండనున్నాయి. చేవెళ్ల డివిజన్‌లో రంగారెడ్డి జిల్లాతోపాటు వికారాబాద్‌ జిల్లాలోని ప్రాంతాలను కలుపుతూ చేవెళ్ల డివిజన్‌ పరిధిలో చేవెళ్ల, పరిగి, దోమ, శంకర్‌పల్లిలను సబ్‌-డివిజన్లుగా ఏర్పాటు చేశారు.

జిల్లాలో 2339 చెరువులు..

జిల్లావ్యాప్తంగా 2339 చెరువులుండగా, 69,197 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉన్నది. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 875 చెరువులుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో 141, హయత్‌నగర్‌లో 7, ఇబ్రహీంపట్నంలో 122, మంచాలలో 301, యాచారంలో 137, సరూర్‌నగర్‌లో 5, బాలాపూర్‌లో 48, మాడ్గులలో 114 చెరువులున్నాయి. శంషాబాద్‌ సబ్‌ డివిజన్‌లో 579 చెరువులుండగా 14,942 ఎకరాల ఆయకట్టు ఉన్నది. చేవెళ్ల డివిజన్‌లో మొత్తం 306 చెరువులుండగా 9671 ఎకరాల ఆయకట్టు ఉన్నది. షాద్‌నగర్‌ డివిజన్‌లో 579 చెరువులుండగా 19,996 ఎకరాల ఆయకట్టు ఉన్నది.

VIDEOS

logo