ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైన విద్యార్థినులు అక్సా, మైత్రి

మొయినాబాద్, జనవరి 16 : కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు చిన్నమంగళారం గ్రామానికి చెందిన అక్సా ఎంపికైంది. ఈ సందర్భంగా శనివారం అక్సాను, భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయడు శ్రీనివాస్‌ను గ్రామస్తులు, ఉపాధ్యాయులు సన్మానించారు. మండల పరిధి చిన్నమంగళారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్సా 9వ తరగతి చదువుతున్నది. గత ఏడాది డిసెంబర్ 18న ఆన్లైన్ ద్వారా కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ఇన్స్పైర్ సైన్స్‌ఫేర్ నిర్వహించారు. 156 ప్రాజెక్టులు ప్రదర్శించారు. అక్సా మానిటరింగ్ ఓవర్ లోడ్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే అంశాన్ని ఎంచుకుని ప్రాజెక్టు తయారుచేసింది. జిల్లాస్థాయిలో నిర్వహించిన సైన్స్‌ఫేర్‌లో ఆన్లైన్ ద్వారా అక్సా తన ప్రాజెక్టును ప్రదర్శించింది. జిల్లాకు చెందిన 15మందితోపాటు అక్సా అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఎంపీటీసీ మల్లేశ్ మాట్లాడుతూ చదువులో రాణించిన ఆక్సా రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికై గ్రామానికి మంచి గుర్తింపు తేవడం అభినందనీయమన్నారు.
కేశంపేట, జనవరి 16 : కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి ఎన్స్పైర్ అవార్డుకు కేశంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మైత్రి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు రసూల్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు మైత్రి రూపొందించిన హోమ్ సెక్యూరిటీ డివైజ్ ఎంపికైనట్లు వివరించారు. మైత్రికి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు మహేందర్‌రెడ్డి సహకారం అందించారన్నారు.