దుమ్ము రేపుతున్నాయి...

- పుట్టగొడుగుల్లా రెడిమిక్స్ ప్లాంట్లు
- పంట పొలాలు, ఇండ్లలోకి చేరుతున్న దుమ్ము
- వ్యవసాయం మానుకున్న అన్నదాతలు
- ఇబ్బంది పడుతున్న రైతులు, గ్రామస్తులు, ప్రయాణికులు
శంకర్పల్లి రూరల్, జనవరి 15 : శంకర్పల్లి మండలంలోని జనవాడ, మిర్జాగూడ, మేఖాన్గడ్డ, మహారాజ్‌పేట్, మోకిల గ్రామ శివారుల్లో, శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇష్టానుసారంగా ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా రెడిమిక్స్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో వాటి నుంచి వెలువడే దుమ్ముకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం రెడిమిక్స్ ప్లాంట్లపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ప్లాంట్లపై చర్యలు తీసుకోకపోవడం పట్ల గల కారణాలు తెలియడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శంకర్పల్లి మండలంలోని మిర్జాగూడ గ్రామ శివారుల్లో 3 సంవత్సరాలుగా ఎనిమిది రెడిమిక్స్ ప్లాంట్లు నడుస్తున్నాయి. వీటి వల్ల వెలువడే దుమ్ము నుంచి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం చుట్టుపక్కల భూముల్లో వ్యవసాయం చేసేవారు. వీటి నుంచి వెలువడే దుమ్ముతో రైతులు పూర్తిగా వ్యవసాయం మానుకున్నారు. గత సంవత్సరం మిర్జాగూడ గ్రామస్తులు, రైతులు రెడిమిక్స్ ప్లాంట్ల వల్ల తీవ్రంగా దుమ్ము వస్తున్నదని.. తమకు తీవ్ర ఇబ్బందిగా మారిందని కాలుష్య నివారణ మండలి (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పొల్యూషన్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు శంకర్పల్లి తాసిల్దార్ కృష్ణకుమార్ మిర్జాగూడ గ్రామ శివారుల్లోని రెడిమిక్స్ ప్లాంట్లకు నోటీసులు అందించి సీజ్ చేయగా.. రెడిమిక్స్ ప్లాంట్ల యాజమాన్యం ఓ యూనిట్‌గా ఏర్పడి రెండు రోజుల్లో మళ్లీ ప్లాంట్లను ప్రారంభించారు. రెడిమిక్స్ ప్లాంట్లు మూతపడ్డాయి.. తమకు ఇక దుమ్ముతో బాధ తప్పుతుంది అనుకున్న గ్రామస్తులకు నిరాశే మిగిలింది. మూసిన ప్లాంట్లు తెరువడానికి గల కారణాలు తెలియడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
మిర్జాగూడ గ్రామ శివారుల్లో మొదలైన రెడిమిక్స్ ప్లాంట్లు మండలంలోని జనవాడ, మహారాజ్‌పేట్ గ్రామాలకు పాకింది. దీంతో ఆ గ్రామాల్లో కూడా ఇదే తంతు మొదలైంది. జనవాడ గ్రామ శివారుల్లో ఇటీవల కాలంలో రెండు ప్లాంట్లు వెలిశాయి. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఏర్పాటు చేయడంతో గ్రామస్తులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని మోకిల గ్రామంలో పెద్దఎత్తున అపార్ట్మెంట్లు, వెంచర్లు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడంతో ఈ ప్లాంట్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి చట్టవిరుద్ధంగా రెడిమిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని ఆయా గ్రామాల సర్పంచ్‌లు పేర్కొంటున్నారు.
కాగా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగాపురం గ్రామంలో ఓ రెడిమిక్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసే సమయంలో చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులు తమ పంట పొలాల్లోకి దుమ్ము వస్తున్నదని అడ్డుకున్నారు. శంకర్పల్లి తాసిల్దార్ కృష్ణకుమార్, మున్సిపల్ కమిషనర్ జైత్రాంనాయక్, పొల్యూషన్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ఆర్డీవో వెంకట్‌రెడ్డి ప్లాంటును పరిశీలించి పంట పొలాల మధ్య రెడిమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని పనులను నిలిపివేశారు. కాగా ప్రస్తుతం అక్కడే పంట పొలాల మధ్య ప్లాంటును నెలకొల్పడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు రెడిమిక్స్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం : ఐలయ్య, జనవాడ మాజీ సర్పంచ్
జనవాడ, మిర్జాగూడ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా రెడిమిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ఇండ్లలోకి, పంట పొలాల్లోకి దుమ్ము చేరడంతో తీవ్ర నష్టానికి గురవుతున్నాం. పక్కనే ఉన్న చెరువులు, చెక్‌డ్యామ్‌లలో నిలిచి ఉన్న నీటిలో దుమ్ము నిండిపోవడంతో నీటిని తాగే పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి. పరిసరాల్లో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి.
పంట పొలాలు నాశనమవుతున్నాయి : మాధవరెడ్డి, రైతు, సింగాపురం
మా గ్రామ పరిధిలో రెడిమిక్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి మా పంటలపై తీవ్రంగా దుమ్ము చేరుతున్నది. పూర్తిగా నష్టపోతున్నాం. గతంలో ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ ప్లాంట్ యాజమాన్యాలు ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్లాంట్ మూసేసి రైతులకు న్యాయం చేయాలి.
చర్యలు తీసుకుంటాం : కృష్ణకుమార్, శంకర్పల్లి తాసిల్దార్
గతంలో మిర్జాగూడ గ్రామ శివారులో ఉన్న రెడిమిక్స్ ప్లాంట్ల వల్ల తీవ్రంగా దుమ్ము వెలువడుతున్నదని ఆ ప్రాంతంలో ఉంటున్న ఓ ప్రైవేటు సంస్థవారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సుమారు 5 రెడిమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశాం. తమ నుంచి ప్లాంట్లకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. పొల్యూషన్ బోర్డు వారికి నివేదికను పంపిస్తాం.
తాజావార్తలు
- పల్లాకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలి
- టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం
- నిబంధనల ప్రకారం ఎన్నిక నిర్వహించండి
- సామాజిక బాధ్యతగా టీకా తీసుకోవాలి
- మేడారం హుండీలు భద్రమేనా?
- ఉన్నొక్కటీ పనిరాదు
- ప్రజల అండతో టీఆర్ఎస్ బలోపేతం
- బంజారాలను గుర్తించింది కేసీఆరే..
- పల్లా గెలుపుతోనే సమస్యలు పరిష్కారం
- పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి