బుధవారం 27 జనవరి 2021
Rangareddy - Jan 14, 2021 , 00:34:32

కమనీయం.. రమణీయం

కమనీయం.. రమణీయం

  • గోదాదేవి కల్యాణం
  • కన్నులపండువగా గోదాదేవి కల్యాణం
  •  భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

ఉమ్మడి జిల్లాలో బుధవారం గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మొయినాబాద్‌లోని చిలుకూరు బాలాజీ సన్నిధి, కొడంగల్‌లోని మహాలక్ష్మివేంకటేశ్వరస్వామి దేవాలయం, కడ్తాల్‌లోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకకు వేలాదిగా భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని వీక్షించారు.

  • ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనం
  • మార్మోగిన గోవింద నామ స్మరణ
  • ముగిసిన ధనుర్మాస పూజలు
  • ఆలయ ప్రాంగణాల్లో కిక్కిరిసిన భక్త జనం
  • కొడంగల్‌లో పాల్గొన్న టీటీడీ ఆగమశాస్త్ర ముఖ్య సలహాదారుడు సుందర వరద భట్టాచార్యులు

మొయినాబాద్‌/కడ్తాల్‌, జనవరి 13: మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు బాలాజీ సన్నిధిలో పచ్చని తోరణాలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య  గోదాదేవి కల్యాణం కన్నులపండువగా జరిగింది. ధనుర్మాసం చివరి రోజు భోగి పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. బుధవారం అర్చకుడు పరావస్తు రంగాచార్యుల ఆధ్వర్యంతో వేదపండితుల సమక్షంలో ఆలయ ప్రాంగణంలో అద్ధాల మహల్‌లో వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి సన్నిధిలో గోదాదేవి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామి వారిని మహాద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ అనంతరం చిలుకూరులో జరిగే మొదటి ఉత్సవం గోదాదేవి కల్యాణం అని అన్నారు. కరోనా నిబంధనలు అనుసరిస్తూ ఎక్కువ మంది భక్తులను అనుమతించలేదన్నారు. అరిష్టాలు, దోషాలు తొలగిపోయి, అనారోగ్యాలు, కరోనా భయాలు పోవాలని వేడుకుంటూ స్వామి వారికి పూజలు చేశారు. ఈ కల్యాణోత్సవంలో ఆలయ మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణ, అర్చకులు రంగరాజన్‌, కన్నయ్య, మురళీ, సురేశ్‌ పాల్గొన్నారు.  

కొడంగల్‌లో..

కొడంగల్‌ మండల కేంద్రంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆగమశాస్త్ర ముఖ్య సలహాదారుడు ఎన్‌ఏకే సుందర వరద భట్టాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవీ సమేతుడైన శ్రీహరికి కుంకుమార్చన వంటి కైంకర్యాలు నిర్వహించారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని, అమ్మవార్లను భక్తజనం దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవాలయాల వద్ద అన్నదానం నిర్వహించారు. 

కడ్తాల్‌లో..

కడ్తాల్‌ మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని తోరాణాలు, రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామిని శుద్ధజలం, పంచామృతాలతో అభిషేకించి, పూజలు చేశారు. రకరకాల పూలతో గోదాదేవి, రంగనాథస్వామి విగ్రహాలను సుందరంగా అలంకరించారు. స్వామి వారికి  బాచిరెడ్డి మంజుల, నరేందర్‌రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలను సమర్పించారు. పుస్తెమెట్టెలను బాచిరెడ్డి శారదమ్మ, వాసుదేవరెడ్డి దంపతులు అందజేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజారులు గోదాదేవి, స్వామివారికి కల్యాణం జరిపించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌గుప్తా, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ రామకృష్ణ, నాయకులు, అర్చకులు పాల్గొన్నారు.


logo