శనివారం 23 జనవరి 2021
Rangareddy - Dec 05, 2020 , 06:47:52

శివారులో హోరాహోరి..

శివారులో హోరాహోరి..

  • టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోరు ...
  • శేరిలింగంపల్లిలో 6 స్థానాల్లో గులాబీపార్టీ గెలుపు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ ఫలితాల్లో హోరాహోరీగా సాగింది. జిల్లా పరిధిలో ఉన్న డివిజన్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య పోరు సాగింది. చివరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆధిక్యత కొనసాగించారు. మొదటి, రెండో విడుత రౌండ్‌ ఎన్నికల్లో కారు జోరుగా దూసుకుపోయింది. జిల్లావ్యాప్తంగా 25 డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరిగాయి. 192 మంది అభ్యర్థులు తలపడ్డారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి వరకు అధికారులు ఓట్ల లెక్కించారు. ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఫలితాల్లో దూసుకుపోయారు. శుక్రవారం జిల్లా గ్రేటర్‌ పరిధిలో 6చోట్ల నిర్వహించిన డివిజన్ల ఎన్నికల ఫలితాల జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీతో బీజేపీ పోటీపడగా, కాంగ్రెస్‌ పార్టీ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. 

నియోజకవర్గాలవారీగా వివరాలు 

రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఐదు డివిజన్లలో 2 ఎంఐఎం, 3 బీజేపీ దక్కించుకుంది. శేరిలింగంపల్లి అసెం బ్లీ నియోజకవర్గం 7 డివిజన్ల పరిధిలో 6 టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకోగా ఒకటి బీజేపీ కైవసం చేసుకుంది. ఎల్బీ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం 11 డివిజన్లకు 11 డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుని ఇక్కడ బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం 2 డివిజన్లకు 2 డివిజన్లను బీజేపీ దక్కించుకుంది. 25 డివిజన్లలో టీఆర్‌ఎస్‌కు 6, బీజేపీ 17, ఎంఐఎం 2 చొప్పున డివిజన్లను పార్టీలవారీగా దక్కించుకున్నాయి. అయితే జిల్లా పరిధిలో పలుచోట్ల స్వల్ప మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి చెందింది.

*శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోని మూడు వార్డులు కొండాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలకు సంబంధించి గచ్చిబౌలిలోని బాలయోగి క్రీడా ప్రాంగణంలోని ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో టీఆర్‌ఎస్‌ 2, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. కొండాపూర్‌, శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా, గచ్చిబౌలిలో బీజేపీ విజయం సాధించింది.

* ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో కమలం వికసించింది. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 2016లో నియోజకవర్గంలోని 11 స్థానాలకు గాను 11 డివిజన్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా తాజాగా 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కోటా లో బీజేపీ పాగా వేసింది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బీజేపీ హవా కొనసాగింది. నాగోలు డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి చింతల అరుణా సురేందర్‌యాదవ్‌, మన్సూరాబాద్‌లో కొప్పుల నర్సింహారెడ్డి, హయత్‌నగర్‌లో కళ్లెం నవజీవన్‌రెడ్డి, కొత్తపేట డివిజన్‌లో నాయికోటి పవన్‌కుమార్‌, చైతన్యపురిలో రంగా నర్సింహాగుప్తా, గడ్డిఅన్నారం డివిజన్‌లో బద్దం ప్రేం మహేశ్వర్‌రెడ్డి, చంపాపేటలో వంగా మధుసూదన్‌రెడ్డి, లింగోజిగూడ డివిజన్‌లో ఆకుల రమేశ్‌గౌడ్‌, వనస్థలిపురం డివిజన్‌లో వెంకటేశ్వర్‌రెడ్డి, హస్తినాపురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి సుజాత విజయం సాదించారు. 

సంబురాలు..

గ్రేటర్‌ పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించడంతో గ్రేటర్‌ వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో వచ్చిన ఫలితాలతో జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. టీఆర్‌ఎస్‌కు 6, బీజేపీకి 17, ఎంఐఎం 2 చొప్పున కార్పొరేటర్‌ స్థానాలు దక్కించుకున్నాయి. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థులు పటాకులు కాలుస్తూ డప్పువాయిధ్యాలతో నృత్యా లు చేస్తూ ఒక్కరిపై ఒక్కరూ రంగులు చల్లుకుంటూ విజయోత్సవ  ర్యాలీలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీ పీ, ఇతర  అభ్యర్థులకు డిపాజిట్‌ దక్కలేదు.


logo