శివారులో మందకొడిగా.. పోలింగ్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రంగారెడ్డి శివారులోని 25 డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వరుస సెలవులు, కరోనా తదితర కారణాలతో ఈ డివిజన్లలో ఓటింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగింది. మొత్తం గ్రేటర్ పరిధిలో 37.5శాతం ఓటింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 25 డివిజన్లలో మొత్తం 192 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లాలో 13.52 లక్షల మంది ఓటర్లు ఉండగా, 1,710 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 8,550మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు 4న చేపట్టనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారున్నారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : గ్రేటర్ ఎన్నికల్లో రంగారెడ్డి శివారు ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. జిల్లా పరిధిలో ఉన్న 25 డివిజన్లలో ఓటర్లు ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగింది. అయితే 5 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్నవారికి 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో సైతం పోలింగ్ తక్కువగా నమోదైంది. మరోవైపు ..పోలింగ్ కేంద్రాల వైపు విద్యాధికులు కన్నెత్తి కూడా చూడలేదు. జిల్లా పరిధిలోని 25 డివిజన్లలో మొత్తం 192 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 13.52లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 1,710 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 800 నుంచి 1000 మంది ఓటర్లు ఉన్నారు. 8,550మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 5గంటల వరకు 37.5గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆయా డివిజన్లలో చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ, విల్లాల ఓటర్లు దూరం..
జిల్లాలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ అంతా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ లోకేశ్‌కుమార్ జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి ఎన్నికల సరళిని ఎల్ఈడీ స్క్రీన్, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అయితే నగర శివారు ప్రాంతాల్లో ఉన్న అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ, విల్లాల్లో ఉండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో పాటుగా కరోనా వైరస్ నేపథ్యంలో కూడా ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హస్తినాపురం డివిజన్‌కు సంబంధించిన రోషన్‌దౌలా కాలనీలో ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సెంటర్లలో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పోలింగ్ బూత్‌లను పరిశీలించారు.
పోలింగ్ శాతం ఇలా...
ప్రధానంగా జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్‌లో 24.18, గచ్చిబౌలిలో 31.98, శేరిలింగంపల్లిలో 29.36, మాదాపూర్‌లో 25.04, మియాపూర్‌లో 26.33, హఫీజ్‌పేట్‌లో 22.14, చందానగర్‌లో 32.85, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని సులేమాన్‌నగర్‌లో 39.20, శాస్త్రీపురంలో 38.60, మైలార్‌దేవ్‌పల్లిలో 37.89, రాజేంద్రనగర్‌లో 21.11, అత్తాపూర్‌లో 55.92, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురంలో36.6, హస్తినాపురంలో 44.6, చంపాపేట్‌లో 43.8, లింగోజిగూడలో 42.6 తదితర చోట్ల పోలింగ్ నమోదైంది.
పోలింగ్ కేంద్రాల వద్ద అంతంతే..
జిల్లాలోని డివిజన్ల పరిధిలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అంతంతగానే వచ్చారు. ఆయా డివిజన్ల పరిధిలో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేం దుకు వచ్చారు.
9 గంటల వరకు లైన్లో ఓటర్లు ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో పోలింగ్ జరిగిన ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.