సోమవారం 18 జనవరి 2021
Rangareddy - Dec 01, 2020 , 04:19:50

విమానయానం@ 30 లక్షల మంది..

విమానయానం@ 30 లక్షల మంది..

రంగారెడ్డి : కొవిడ్‌-19 నేపథ్యంలో విమానాశ్రయాల పున: ప్రారంభం అనంతరం విమాన ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. విమాన ప్రయాణాలు సురక్షితమన్న నమ్మకం పెరిగింది. ఈ నేపథ్యంలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటూ, దేశీయ ప్రయాణికుల సంఖ్య నవంబర్‌ నెలలో 37వేలకు చేరింది. అన్‌లాక్‌ 5.0 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికుల వైద్య పరీక్షలు ఇతర వాటి ఆధారంగా క్వారంటైన్‌ నిబంధనలను సడలించడంతో భారత విమానయాన రంగం క్రమంగా పుంజుకుంటోందని ప్రస్తుత పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అనేక రాష్ర్టాలు ఇంకా ప్రయాణికుల ఆరోగ్య ప్రొఫైల్‌, ఆర్టీపీసీఆర్‌ మెడికల్‌ రిపోర్టులను అడుగుతున్నా, జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న కొవిడ్‌-19 టెస్టింగ్‌ కేంద్రం ద్వారా పరీక్షలు చేయించుకున్న తర్వాత ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నారు. 

నాటితో పోలిస్తే దాదాపు 10 రెట్లు అధికం..

మే 25 నుంచి దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన మొదటి కొన్ని వారాల్లో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 3వేల మంది ప్రయాణికులు ప్రయాణించారు. నాటి నుంచి నవంబర్‌లో రోజూ 3వేల మంది ప్రయాణికులకు చేరింది. ఇది విమాన సర్వీసులు పున: ప్రారంభం నాటితో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువైంది. విమానాశ్రయం తిరిగి ప్రారంభమైన రోజు నుంచి నవంబర్‌ 23 వరకు 30 లక్షల మందికి పైగా ప్రయాణికుల రాకపోకలు జరిగాయి. విమాన సర్వీసులు పున:ప్రారంభమైన మొదటి కొన్ని వారాల్లో హైదరాబాద్‌ నుంచి రోజూ 40 విమానాల రాకపోకలు జరగ్గా, నవంబరులో ప్రతిరోజూ 260 దేశీయ విమానాల రాకపోకలు జరిగాయి. విమాన సర్వీసులు పున:ప్రారంభమైన మొదటి రోజుకు ఇది ఆరురెట్లకన్నా ఎక్కువ. నవంబర్‌ 23వరకు సుమారు 35వేలకు పైగా దేశీయ విమానాల రాకపోకలు జరిగాయి.

51 గమ్యస్థానాలకు సర్వీసులు తిరిగి ప్రారంభం..

ఇటీవల దేశీయ ప్రయాణికుల సంఖ్య ఒక రోజులో 37వేలను తాకింది. దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తరువాత ఇదే అత్యధికం. విమానాల రాకపోకల సంఖ్య ఒకే రోజు 284ను దాటింది. కొవిడ్‌-19 ముందు హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి 55 గమ్యస్థానాలు ఉండగా, నవంబర్‌ 23 నాటికి 51 గమ్యస్థానాలకు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మరో మూడు కొత్త దేశీయ గమ్యస్థానాలు - కోజికోడ్‌ ఇంఫాల్‌, జగదల్‌పూర్‌కు కూడా సర్వీసులు ప్రారంభమై, ఆర్‌జీఐఏ నుంచి ఇప్పుడు మొత్తం 54 దేశీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. కొవిడ్‌-19 తర్వాత మొదటి 5 గమ్యస్థానాల్లో ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, బెంగళూరు, ముంబై ఉన్నాయి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ విమానాశ్రయాలకు సేవలు అందిస్తున్న మొదటి 3 విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ ఇండియాలున్నాయి. 

‘మ్యాప్‌జీనోమ్‌'తో ఒప్పందం..

ప్రయాణికులంతా సురక్షితంగా ప్రయాణించే దిశగా జీఎంఆర్‌ ఆధ్వర్యంలోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇటీవల రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) లోపలే కరోనా వైరస్‌ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది. దీని వల్ల నగరంలోకి ప్రవేశించే ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించగలుగుతారు. కొవిడ్‌-19 నమూనాలను పరీక్షించడానికి సేవలను అందించడానికి జీహెచ్‌ఐఏఎల్‌ (ఎన్‌ఏబీఎల్‌) (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లాబొరేటరీస్‌), ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) సర్టిఫైడ్‌ ఏజెన్సీ అయిన ‘మ్యాప్‌జీనోమ్‌'తో ఒప్పందం చేసుకున్నది. ఇది ప్రయాణికులు, ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది కోసం 24 గంటలూ పని చేస్తుంది. అక్టోబర్‌ నెలలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఈ-బోర్డింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చి, ఆ పని చేసిన మొట్టమొదటి భారతదేశ విమానాశ్రయంగా నిలిచింది.

త్వరలో పూర్వస్థాయికి చేరుకుంటాం: ప్రదీప్‌ ఫణికర్‌, అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి 

జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి(సీఈవో) ప్రదీప్‌ పణికర్‌ మాట్లాడుతూ.. ప్రయాణంపై పెరుగుతున్న ప్రయాణికుల విశ్వాసానికి ఈ ముప్పై లక్షల మంది ప్రయాణికులు ఒక తార్కాణం. కొవిడ్‌-19 పూర్వం ఉన్న కెపాసిటీలో 70% ఆపరేట్‌ చేయడానికి ప్రభుత్వం విమానయాన సంస్థలకు అనుమతించడంతో, జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక కాంటాక్ట్‌-లెస్‌ కార్యక్రమాలతో సురక్షిత ప్రయాణానికి సన్నద్ధమైంది. కొవిడ్‌-19 పరీక్ష సదుపాయంతో కూడా నెగిటివ్‌ ఆర్టీపీసీఆర్‌ రిపోర్ట్‌ సమస్య కూడా పరిష్కరించబడింది. స్థిరమైన పెరుగుదలతో, కార్యకలాపాలపరంగా త్వరలో కొవిడ్‌-19 పూర్వస్థాయికి చేరుకుంటామని ఆశిస్తున్నాం.