బుధవారం 20 జనవరి 2021
Rangareddy - Nov 30, 2020 , 05:55:44

పూల రైతుకు కలిసొచ్చిన కార్తికం

పూల రైతుకు కలిసొచ్చిన కార్తికం

చేవెళ్ల: భారీ వర్షాలతో పూల తోటల దిగుబడి తగ్గడంతో పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వర్షలకు పాడై దిగుబడి తగ్గడంతో పాటు గురుపౌర్ణమి, పెండ్లీలు, నోములు ఉండడంతో ధరలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. ప్రసుత్తం మార్కెట్‌లో చామంతి, గులాబీ, లిల్లి పూల ధరలు పెరిగాయి. నెల రోజుల క్రితం పూలను నగరంలోని మార్కెట్‌కు తరలిస్తే కిలో రూ.20 నుంచి 30 పలుకుతుండడంతో రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోయారు. కొనేవారు లేక మార్కెట్‌లోనే వదిలేసి వచ్చారు. రూ.10 నుంచి 20 పలికిన పూల ధరలు ఇప్పుడు రూ.60 నుంచి 200 వరకు పెరిగాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చేవెళ్ల డివిజన్‌లో చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌, మొయినాబాద్‌ మండలాల్లో దాదాపు 4వేల ఎకరాల్లో పూలతోటలు సాగుచేశారు.  చామంతి, గులాబీ, లిల్లి, బంతి పూల తోటలు సాగుచేశారు. ప్రధానంగా పల్గుట్ట, కందవాడ, మిర్జాగూడ, బస్తేపూర్‌, ఆలూర్‌, చేవెళ్ల, పామెన, చన్‌వల్లి, దేవుని ఎర్రవల్లి, కౌకుంట్ల తదితర గ్రామాల్లో రైతులు సాగు చేశారు. ఈ ప్రాంత రైతులు పండించిన పూలను అమ్మేందుకు నగరంలోని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు ప్రతి రోజు తరలిస్తారు. పూల ధరలు పెరుగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేసున్నారు. చామంతి కిలో రూ.200, గులాబీ కిలో రూ.250, లిల్లి కిలో రూ.180, బంతి రూ.60లు పలికింది. 


logo