బుధవారం 20 జనవరి 2021
Rangareddy - Nov 27, 2020 , 04:20:01

మైసమ్మ జాతరకు ముస్తాబు

మైసమ్మ జాతరకు ముస్తాబు

కడ్తాల్‌ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత జాతర ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. భక్తులకు కొంగుబంగారమైన మైసమ్మ ఉత్సవాలు ఏడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం కార్తికమాసంలో ప్రారంభమయ్యే ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా నుండి కాకుండా హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, మెదక్‌, వికారాబాద్‌ తదితర జిల్లాల నుంచి భక్తులు జాతరకు తరలివస్తారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయానికి నిర్వాహకులు రంగులు వేశారు. అలాగే రకరకాల పూలు, మామిడి తోరణాలు, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే మైసమ్మ ఆలయ సమీపంలోని శివాలయ, రామాలయాల వద్ద ఉత్సవాలకు సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలోని కోనేరు నిండటంతో భక్తులను కనువిందు చేస్తుంది.

జాతర కార్యక్రమాలు

మైసిగండి మైసమ్మతల్లి జాతర ఉత్సవాల కార్యక్రమాలు వివరాలు... ఈ నెల 30న కార్తిక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకం, విశేష అలంకరణ, కుంభహారతి, డిసెంబర్‌ 1న అమ్మవారికి విశేష అర్చనలు, పూజలు, రాత్రికి కార్తిక దీపోత్సవం, 2న చండిహోమం, అర్చనలు, విశేష పూజలు, రాత్రికి పుష్పరథోత్సవం, 3న చండీహోమం, పూర్ణాహుతి, రాత్రికి అమ్మవారికి రథోత్సవము, 4న అమ్మవారికి పుష్పార్చన, ప్రత్యేక పూజలు, 5న అమ్మవారికి విశేష పూజలు, 6న వివిధ కూరగాయలతో అమ్మవారికి అలంకరణ, బండ్లుతిప్పుట కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తు ఏర్పాట్లు

 ఏడు రోజులపాటు నిర్వహించే మైసమ్మతల్లి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్‌-19 నిబంధనలను అనుకరిస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఆలయ ఆవరణలో వసతులు, దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఆలయ ఉత్సవాలకు నిర్వహణకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పనులు వేగవంతంగా చేయిస్తున్నాం. -శిరోలీ, ఆలయ ట్రస్టీ, మైసమ్మ ఆలయం


logo