శనివారం 23 జనవరి 2021
Rangareddy - Nov 27, 2020 , 04:16:51

హైదరాబాద్‌ కీ జాన్‌.. మూసీకి షాన్‌

హైదరాబాద్‌ కీ జాన్‌.. మూసీకి షాన్‌

 • కాళేశ్వర జలాలతో చారిత్రక నది ప్రక్షాళన
 • ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు 700 క్యూసెక్కులు
 • కొండ పోచమ్మతో జంట జలాశయాల అనుసంధానం
 • సంగారెడ్డి కాల్వ డిజైన్‌లోనే సీఎం కేసీఆర్‌ ముందుచూపు
 • మూసీకి పూర్వవైభవంతో భాగ్యనగరానికి బహుళ ప్రయోజనాలు

చారిత్రక మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.  ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల్లో కాళేశ్వర జలాల్ని నింపి మురికిలేని మూసీగా తీర్చిదిద్దనున్నారు.  అందుకోసం  సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో  కాళేశ్వరం ప్రాజెక్టులోనే డిజైన్‌ చేయించారు.  కొండపోచమ్మ సాగర్‌ నుంచి కాళేశ్వర జలాల్ని జంట జలాశయాలకు తరలించేలా అలైన్‌మెంట్‌ రూపొందించారు.

థేమ్స్‌ నది ఒడ్డున లండన్‌.. సెయిన్‌ నది ఒడ్డున ప్యారిస్‌.. మూసీ నది చెంతన హైదరాబాద్‌.. నీరున్న చోట నాగరికత విలసిల్లిందనేందుకు ప్రబల తార్కాణాలు. కానీ ఆ నాగరికతే జీవ నదులకు ఉరికొయ్యగా మారింది. థేమ్స్‌, సెయిన్‌తోపాటు మన మూసీ కూడా కాలుష్య కోరల్లో చిక్కుకొని మురికి కూపాలుగా మారాయి. అయితే అక్కడి పాలకులు కండ్లు తెరువడంతో థేమ్స్‌, సెయిన్‌ నదులు బతికి బట్టకట్టాయి. కానీ మూసీ?! అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురికికూపంగా మారింది. కాలగర్భంలో కలిసిపోయే అవసానదశలో తెలంగాణ సర్కారు దానికి తిరిగి ఊపిరిలూదుతున్నది. మూసీ నది పరిరక్షణకు ఆరేండ్ల కాలంలో అనేక రకాల చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు గోదావరి-మూసీ అనుసంధానంతో ఈ చారిత్రక జీవనదికి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.  ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల్లో కాళేశ్వరజలాల్ని నింపి మురికిలేని మూసీని సాక్షాత్కరింపజేసేందుకు సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోనే డిజైన్‌ పూర్తిచేశారు.

చారిత్రక మూసీ నదికి పూర్వ వైభవం రానుంది. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మూసీ మురికిని కూడా వదిలించనుంది. ఎత్తిపోతల పథకంలో భాగంగా పదిహేను టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ నుంచి కాళేశ్వర జలాల్ని జంట జలాశయాలకు తరలించేలా అలైన్‌మెంట్‌ రూపొందించారు. కొండ పోచమ్మసాగర్‌ సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉంది. గోదావరి బేసిన్‌లోనే ఇది గరిష్ఠ ఎత్తు. ఈ రిజర్వాయర్‌ నుంచి 127 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వను నిర్మిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో గ్రావిటీ కాల్వ కాగా.. 27వ కిలోమీటర్‌ వద్ద మూసీ దిశగా కాళేశ్వరజలాల్ని మళ్లించనున్నారు. వాస్తవంగా సంగారెడ్డి కాల్వ గరిష్ఠ వరద ప్రవాహ సామర్థ్యం 5054 క్యూసెక్కులు. ఇందులో సాగునీటికి 4,354 క్యూసెక్కులు పోగా మిగిలిన 700 క్యూసెక్కులను హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు తరలించనున్నారు. 

నీటి మళ్లింపు ఇలా

సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్‌ నుంచి మళ్లించే కాళేశ్వరజలాల్ని సమీపంలో ఉన్న రావిల్‌కోల్‌ చెరువుకు తరలిస్తారు. అక్కడి నుంచి 52 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా జంట జలాశయాల్లోకి తరలించనున్నారు. గండిపేట (ఉస్మాన్‌సాగర్‌) ఎఫ్‌ఆర్‌ఎల్‌ అంటే సముద్ర మట్టానికి 545 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో 618 మీటర్ల ఎత్తు నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు ఉస్మాన్‌సాగర్‌కు తరలించడం సులభమవుతుంది. హిమాయత్‌సాగర్‌ సముద్ర మట్టానికి (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 537.25 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో గండిపేటకు వచ్చిన జలాల్ని సులువుగా హిమాయత్‌సాగర్‌లోకి మళ్లించవచ్చు. ఇందుకు సంబంధించి గతంలో పైప్‌లైన్‌ కూడా ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ దాని ద్వారా సాధ్యం కాకపోయినా... గండిపేట నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా హిమాయత్‌సాగర్‌లోకి జలాల్ని తరలించవచ్చు. 

ప్రారంభమైన పనులు

కొండపోచమ్మ సాగర్‌ నుంచి సాగునీటి జలాల్ని అందించే సంగారెడ్డి కాల్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రావిల్‌కోల్‌ చెరువు నుంచి గండిపేటకు జలాలను తరలించే పనుల్ని జలమండలి చేపట్టాల్సి ఉంది. ఈ మేరకు త్వరలో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కొండపోచమ్మ సాగర్‌ నుంచి జంట జలాశయాల వరకు 85 కిలోమీటర్ల కాల్వ పనులకుగాను 27 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వ పనులను జల వనరుల శాఖ పూర్తి చేస్తుంది. మిగిలిన 52 కిలోమీటర్ల కాల్వ పనులను జలమండలి చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తయితే గండిపేట, హిమాయత్‌సాగర్‌లో మూడున్నర టీఎంసీల చొప్పున కాళేశ్వరజలాలు నిండనున్నాయి. తద్వారా గోదావరి జలాలతో మూసీ నది తళుకులీననున్నది.

ప్రయోజనాలు

 • కాళేశ్వరజలాలను జంట జలాశయాలకు తరలించడం వల్ల చారిత్రక చెరువులకు పూర్వ వైభవం వస్తుంది. 
 • రెండు జలాశయాల్లో నిత్యం నీటి నిల్వ ఉండటం వల్ల చుట్టూ పది-పదిహేను కిలోమీటర్ల పరిధిలో భూగర్భజలాలు పెరుగుతాయి.
 • రెండు జలాశయాల్లోని నీటితో అతి తక్కువ ఖర్చుతో అనేక ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించవచ్చు. 
 • జంట జలాశయాల్లోకి గోదావరిజలాలు రావడం వల్ల మూసీలోకి జలాల్ని వదిలి మురికిని తొలగించవచ్చు. దీంతో మురుగురహిత మూసీ సాక్షాత్కారం కానుంది. 
 • ముఖ్యంగా మూసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్‌, రంగారెడ్డి, భువనగిరి-యాదాద్రి, నల్లగొండ జిల్లాల పరిధిలో కాలుష్యజలాల పీడ వదలనుంది. నది పొడవునా చుట్టుపక్కల దోమల బెడద తప్పనుంది. 
 • ప్రస్తుతం మూసీ మురికికూపంలా తయారైనందున దాని పొడవునా వస్తున్న వ్యవసాయ దిగుబడులు ఆరోగ్యపరంగా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రక్షాళన పూర్తయితే కొంతకాలంలో ఈ ప్రధాన సమస్య తీరనుంది. 
 • విశ్వ నగరంగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన హైదరాబాద్‌ నడిబొడ్డున మూసీ పారడం వల్ల పర్యాటకంగా అద్భుత శోభ రానుంది. 
 • లండన్‌లోని ఏథెన్స్‌, పారిస్‌లోని సెయిన్‌ నదుల ద్వారా ఆయా నగరాలకు పర్యాటకంగా, పర్యావరణపరంగా ఎంత ప్రయోజనం చేకూరుతున్నదో మూసీ ద్వారా కూడా హైదరాబాద్‌కు ఆ మహర్దశ పట్టనుంది.


logo