బుధవారం 20 జనవరి 2021
Rangareddy - Nov 26, 2020 , 03:46:37

సైన్స్‌, మ్యాథ్స్‌ ప్రయోగాల కోసం పరికరాలు

సైన్స్‌, మ్యాథ్స్‌  ప్రయోగాల కోసం  పరికరాలు

  • రంగారెడ్డి జిల్లాలో 379పాఠశాలలకు మంజూరు
  • జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరిన 338 కిట్లు 
  • యూపీఎస్‌లకు 218.. జడ్పీహెచ్‌ఎస్‌లకు 120..
  • త్వరలో పంపిణీ  చేసేందుకు ఏర్పాట్లు  చేస్తున్న అధికారులు 

ప్రాక్టికల్‌ విద్యాబోధనతో విద్యార్థులకు సైన్స్‌, మ్యాథ్స్‌ పాఠాలు సులభంగా అర్థమవుతాయి. అందుకోసం అవసరమైన ప్రయోగ పరికరాలను ప్రభుత్వ స్కూళ్లకు  సమకూర్చేందుకు సర్కార్‌ చర్యలు తీసుకుంటున్నది.  రంగారెడ్డి జిల్లాలో మొత్తం 379 పాఠశాలలకు 338 కిట్లు మంజూరయ్యాయి. అందులో అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లకు 218, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు 120 ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకోగా, డిసెంబర్‌ 1వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  జిల్లాలో 886 ప్రాథమిక,178 ప్రాథమికోన్నత, 244 ఉన్నత పాఠశాలల్లో 1,43,178 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, యూపీఎస్‌లకు 105 మ్యాథ్స్‌, 113 సైన్స్‌, హైస్కూళ్లకు 80 మ్యాథ్స్‌ , 40 సైన్స్‌ కిట్లు  వచ్చాయి. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ప్రయోగాలు చేయిస్తూ పాఠాలు బోధిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. ఇందుకు అవసరమైన కిట్లను ప్రభుత్వ ఆదేశాలతో ఎన్‌సీఈఆర్‌టీ వారు సమగ్ర శిక్షా అభియాన్‌ ద్వారా సరఫరా చేశారు. ఇవి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి పాఠశాలలకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

జిల్లాలో 579 పాఠశాలలకు..

రంగారెడ్డి జిల్లాలో 886 ప్రాథమిక, 178 ప్రాథమికోన్నత, 244 ఉన్నత పాఠశాలల్లో 1,43,178 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో 579 సైన్స్‌ అండ్‌ మ్యాథ్స్‌ కిట్లను 250 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మంజూరు చేశారు. మొత్తం 338 కిట్లలో యూపీఎస్‌ లెవల్‌లో మ్యాథ్స్‌ 105, సైన్స్‌ 113 పాఠశాలలకు వచ్చాయి. హైస్కూల్‌ లెవల్‌లో మ్యాథ్స్‌ 80, 40 సైన్స్‌ కిట్లు వచ్చాయి. 

160 రకాల వస్తువులు, 142 పరికరాలు

ఉన్నత పాఠశాలలకు వచ్చిన సైన్స్‌ కిట్లలో 160 రకాల వస్తువులు, ప్రాథమికోన్నత పాఠశాలలకు వచ్చిన కిట్లలో 142 రకాల పరికరాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మైక్రోస్కోప్‌, స్టాప్‌క్లాక్‌, స్ప్రింగ్‌ బ్యాలెన్స్‌, వివిధ రకాల ఆయస్కాంతాలు, గాజు, పరికరాలు, విద్యుత్‌ వలస పరికరాలు, జనరేటర్‌, ట్యూబ్‌ తదితర పరికరాలు ఉన్నాయి. గణితం కిట్లలో ప్రధానంగా జియోబోర్డు, జామియా ఆకారాలు, పూసల చట్రం, వివిధ రకాల చక్రాలు, సంపూర్ణ కొలమానివి, సరళ కొలమానివి, ఇతర చిన్న పాటి సామగ్రి ఇలా మొత్తం 20రకాల పరికరాలు కిట్లలో ఉన్నాయి. వీటిని పాఠశాలలకు అందజేస్తే కరోనా తర్వాత తరగతులు ప్రారంభమైతే, విద్యార్థులకు ప్రయోగ పాఠాలు పూర్తి స్థాయిలో అందనున్నాయి. 

కిట్లతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం 

సైన్స్‌, మ్యాథ్స్‌ కిట్లతో విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. వీటి ద్వారా పాఠాలు సులువుగా అర్థమవుతాయి. గతంలో జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ప్రయోగ పరికరాలు లేవు. ఫలితంగా విద్యార్థులు పాఠ్యపుస్తక పాఠాలకే పరిమితమవుతున్నారు. దీనిని గుర్తించిన విద్యాశాఖ గతేడాది 150 పాఠశాలలకు పైగా సైన్స్‌ మ్యాథ్స్‌ కిట్లు అందజేసింది. అయితే మళ్లీ ఇప్పుడు పాఠశాలలకు కిట్లు వచ్చాయి. ప్రస్తుతం కరోనా కారణంగా పాఠశాలలు తెరువకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి మంజూరైన పాఠశాలలకు కిట్లను పంపిణీ చేయనున్నారు. 

త్వరలో అందిస్తాం: చంద్రశేఖర్‌, జిల్లా  సెక్టోరియల్‌ అధికారి 

జిల్లాకు సైన్స్‌, మ్యాథ్స్‌ పాఠ్యాంశాల బోధనకు అవసరమైన ప్రయోగ పరికరాలు, కిట్లు మంజూరయ్యాయి. వాటిని ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌లోని మండల విద్యాశాఖ కార్యాలయం గోదాంలో భద్రపరిచాం. త్వరల్లోనే అన్ని పాఠశాలలకు అందజేస్తాం. పాఠశాలలు తెరువగానే విద్యార్థుల కోసం తప్పనిసరిగా వినియోగించాలి.


logo