శనివారం 16 జనవరి 2021
Rangareddy - Nov 25, 2020 , 03:53:59

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

  • అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదు
  • రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌
  • తలకొండపల్లి మండలంలో పర్యటన
  • అభివృద్ధి పనుల పరిశీలన

తలకొండపల్లి : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నెలఖారులోగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. మంగళవారం గట్టుఇప్పలపల్లి, చౌదర్‌పల్లి, వెల్‌జాల్‌ గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీల పనులను ఆర్డీవో రవీందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. గట్టుప్పలపల్లిలో డంపింగ్‌యార్డు, వెల్‌జాల్‌లో రైతువేదిక, చౌదర్‌పల్లిలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. తలకొండపల్లిలో పల్లెప్రకృతి వనాన్ని రోల్‌మోడల్‌గా తీసుకుని మండలంలోని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను చేట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తలకొండపల్లి మండల కేంద్రంలో తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పరిశీలించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి పట్టాదారు పత్రాలను అందజేశారు. 

పల్లెప్రకృతి వనంలో బెంచీల ఏర్పాటు, వాకింగ్‌ ట్రాక్‌ అభివృద్ధి, డంపింగ్‌యార్డులో ఎప్పటికప్పుడు తడి, పొడి చెత్తను వేరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . అనంతరం చౌదర్‌పల్లి గ్రామంలో నర్సరీని పరిశీలించి, మండలంలో ఎన్ని నర్సరీలు ఏర్పాటు చేశారు? ఎన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు, వాటిని ఎలా సంరక్షిస్తున్నారు? తదితర విషయాలను ఏపీవో కృష్ణను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో మొక్కలను సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మొక్కలను పెంచాలని సూచించారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు నివేదించాలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు గోపాలకృష్ణ, ఆంజనేయులు, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.