సోమవారం 18 జనవరి 2021
Rangareddy - Nov 24, 2020 , 04:22:44

టీఆర్‌ఎస్‌తోనే.. అభివృద్ధి

టీఆర్‌ఎస్‌తోనే.. అభివృద్ధి

బండ్లగూడ, నవంబర్‌ 23: టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారని, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఐదు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఘన విజయంతో గెలుపించుకుంటామని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. అత్తాపూర్‌ డివిజన్‌లో మాధవీ అమరేందర్‌ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తాపూర్‌ పాత గ్రామం, హైదర్‌గూడ, హుడాకాలనీ, ఫెండ్స్‌కాలనీ, భరత్‌నగర్‌, మారుతినగర్‌ తదితర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఆయన  సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో తమ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని గుర్తుచేశారు. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, విద్యుత్‌ స్తంభాలు వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టామని వివరించారు. ప్రజలందరూ టీఆర్‌ఎస్‌కే ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. బస్తీల్లో పర్యటిస్తుంటే ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోందన్నారు.

 పలు బస్తీల్లో మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను విజయతీరాలకు చేరుస్తాయని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 105 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల అభ్యున్నతికీ పాటుపడుతున్నారని అన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.