సోమవారం 18 జనవరి 2021
Rangareddy - Nov 24, 2020 , 04:20:44

మంత్రి కేటీఆర్‌ రోడ్డు షోకు భారీగా తరలివచ్చిన జనం

మంత్రి కేటీఆర్‌ రోడ్డు షోకు భారీగా తరలివచ్చిన జనం

బడంగ్‌పేట:  మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో సందర్భంగా  ఆర్కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్‌లు గులాబీమయంగా మారాయి. యువకులు తలపాగాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లంబాడీ నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. తెలంగాణ జానపదులు, పల్లెసుద్దులు ఆటపాటలతో అలరింపచేశారు. గులాబీ జెండాలను చేబూని రోడ్ల వెంట పెద్ద సంఖ్యలో కనిపించారు. ఎన్టీఆర్‌నగర్‌ పరిసర ప్రాంతాలన్నీ కారుగుర్తుకు ఓటు వేయాలనే నినాదాతో మార్మోగాయి. కాలనీ నుంచి స్వచ్ఛందంగా ప్రజలు కేటీఆర్‌ రోడ్‌షో చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో గులాబీ దండు కదిలింది.

పురవీధుల గుండా భారీ ర్యాలీలుగా బయలు దేరి ఎన్టీఆర్‌నగర్‌ ప్రధానకూడలి వద్దకు చేరుకున్నారు.  ‘కారు..సారు.. సర్కారు మనదే’ నంటూ నినాదాలు చేశారు. ఆర్కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్‌లలో గులాబీ జెండా ఎగురువేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ రాకతో శ్రేణుల్లో నూతనుత్తేజం ఉరకలేసింది. డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల విజయం దాదాపుగా ఖాయమైనట్లేనని శ్రేణులు అంటున్నారు.  సరూర్‌నగర్‌లో అనితా దయాకర్‌రెడ్డి, ఆర్కేపురంలో విజయభారతి అరవింద్‌శర్మ గెలుపు నల్లేరు మీద నడకేనని ఇక్కడికి వచ్చిన ప్రజలు చెబుతున్నారు.