గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Nov 21, 2020 , 04:06:02

మోడల్‌ మార్కెట్‌ ద్వారా వీధి వ్యాపారులకు ఉపాధి

మోడల్‌ మార్కెట్‌ ద్వారా వీధి వ్యాపారులకు ఉపాధి

  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
  • యూనియన్‌ బ్యాంకు ద్వారా రూ.కోటి రుణాలు అందజేత..

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న మోడల్‌ మార్కెట్‌ ద్వారా వీధి వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మార్కెట్‌యార్డులో యూనియన్‌ బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాలకు, వీధి వ్యాపారులకు సంబంధించిన రుణాల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యాధునిక హంగులతో ఇబ్రహీంపట్నంలో మోడల్‌ మార్కెట్‌ నిర్మిస్తున్నామని, ఈ మార్కెట్‌ నిర్మాణం పూర్తియితే వీధి వ్యాపారులందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం వీధి వ్యాపారుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుందన్నారు. అందులో భాగంగానే మున్సిపాలిటిలల్లో వీధివ్యాపారం చేసుకునే వారందరిరీ ఒక్కొక్కరికి రూ.పదివేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఈ సాయంతో వీధి వ్యాపారం చేసుకునే కూరగాయలు, ఇతరత్రా వ్యాపారులు అభివృద్ధి సాధించుకోవచ్చునని అన్నారు. 

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సుమారు నాలుగువందల మంది వీధి వ్యాపారులకు రుణాలు అందజేయాలని టార్గెట్‌ పెట్టుకున్నామని, మొదటి విడుతలో శుక్రవారం యాభై మందికి రుణాలు అందజేశామని అన్నారు. ఒక్కొక్కరికి రూ.పదివేల చొప్పున రుణాలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే, స్వయం సహాయక సంఘాలు ఇతరత్రా వాహనదారులకు సుమారు కోటి రూపాయలను అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్రవంతి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రమణారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, యూనియన్‌ బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ భాస్కర్‌రావు, రీజనల్‌ హెడ్‌ రవీంద్రబాబు, బ్రాంచ్‌ మేనేజర్‌ రమేశ్‌బాబు పాల్గొన్నారు.