గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Nov 21, 2020 , 03:55:02

టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

  • గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ గుబాళింపు ఖాయం
  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
  • ఇబ్రహీంపట్నంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం

ఇబ్రహీంపట్నం : హైదరాబాద్‌లో జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి టీఆర్‌ఎస్‌ హయాంలోనే జరిగిందని వివరించారు. మతతత్వ బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌లో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకపోగా 24గంటలు విద్యుత్‌ సరఫరా జరుగుతురన్నదని, దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ సాఫీగా ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ప్రపంచానికే తలమానికంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ మరింత అభివృద్ధి జరుగాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించక తప్పదన్నారు. 

శివారు మున్సిపాలిటీల గెలుపు ఓటములను శాసించే స్థాయి మనదని, అందుకే శివారు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించడం కోసం ప్రతి కార్యకర్త నడుం బిగించాలన్నారు. ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, హస్తినాపురం, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, ఆర్కేపురం పరిధిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఎంతోమంది నివాసాలుంటున్నారని, వారికి టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హస్తినాపురం డివిజన్‌ ఇన్‌చార్జి తనకు అప్పగించినందున ఈ డివిజన్‌లో పనిచేయడానికి ప్రతి టీఆర్‌ఎస్‌ నాయకుడు, కార్యకర్తలు కదలిరావాలన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్రవంతి, ఎంపీపీ కృపేశ్‌, గడ్డిఅన్నారం మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్‌ ముత్యంరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తువెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.