సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Nov 20, 2020 , 03:56:15

యాసంగికి ‘మిషన్‌ కాకతీయ’ ఫలాలు

యాసంగికి ‘మిషన్‌ కాకతీయ’ ఫలాలు

షాద్‌నగర్‌ : నాడు తుమ్మచెట్లు, లొట్టపీసు మొక్కలతో నిండుగా చీదును తలపించే చెరువులు నేడు జలకళతో నిండు కుండలను తలపిస్తున్నాయి.  ఉమ్మడి రాష్ట్రంలో తెగిన కట్టలు, మరమ్మతులకు  నోచుకోని చెరవులు, చెక్‌డ్యాంలు నేడు మిషన్‌ కాకతీయ పథకంతో కొత్తసోగసులను అందుకున్నాయి. రాష్ట్ర సర్కారు తలపెట్టిన మిషన్‌ కాకతీయ పథకం ఫలితంగా మారుమూల పల్లెల్లో సహితం చెరువులు, కుంటలు తమ పూర్వవైభవాన్ని పొందాయి.  కొన్నేండ్లుగా చెరువుల్లో నీళ్లను చూడని రైతన్నలు వరుణి కరుణతో నీళ్లతో ఈ సంవత్సరం నిండిన చెరువులను చూసి సంబురపడుతున్నారు. వరుసగా నాలుగేళ్ల కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఈ యాసంగి మరింత భరోసాను ఇస్తుంది. యాసంగి వస్తుందటే భూగర్భజలాలపై రైతుల్లో తెలియని ఆందోళన ఉండేది. కానీ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం ఫలాలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలాలు పెరిగి యాసంగిలో చింత లేని వ్యవసాయం చేసుకోవచ్చని రైతులు సంతోష  పడుతున్నారు. 

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల  నియోజకవర్గాల్లో  సుమారుగా 200లకు పైగా చెరువులను  మిషన్‌ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌ పరిధిలోని 175 చెరువులకు గాను రూ. 58.2 కోట్లను కేటాయించి మరమ్మతు పనులను చేపట్టారు. అదేవిదంగా చేవెళ్ల తాలుకా పరిధిలో 30కి పైగా చెరువులు అభివృద్ధిలోకి వచ్చాయి.  చేవెళ్ల డివిజన్‌లోని మిర్జగూడ, గుండాల, కౌకుంట్ల, తాలరాం, ఇర్లపల్లి, బతుకమ్మకుంట, సొరంగల్‌, నక్కలపల్లి, పెద్ద మంగళారం, బాకారం, పోచమ్మకుంట, ఫైల్‌వాన్‌ చెరువు, షాబాద్‌ చెరువులు అలుగుపారాయి. అదేవిధంగా పలు గ్రామాల్లోని వాగులపై నిర్మించి చెక్‌డ్యాంల్లో వర్షపు నీళ్లు భారీగా నిలిచాయి. వీటితో పాటు ఇబ్రహీంపట్నం  డివిజన్‌ పరిధిలో సుమారు 50  చెరువులకు  పైగా వర్షం నీరుతో అలుగు పారాయి. ఎన్నడూ లేనివిధంగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అలుగుపారింది. చెరువులకు, కుంటలకు జలకళ సంతరించుకోవడంతో ఆయా గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటలపై కోటి ఆశలు పెంచుకున్నారు. 

నియోజకవర్గంలో  534 చెరువులు.. 15 వేల ఎకరాల ఆయకట్టు

షాద్‌నగర్‌ నియోజకవర్గం 90, 332 హెక్టార్ల విస్తీర్ణంలో  రైతులు పంటలను సాగుచేస్తున్నారు.  111 రెవెన్యూ గ్రామాలతో పాటు 95 గ్రామ పంచాయతీలు, ఆరు మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ  55, 618 మంది రైతులతో పాటు వేలాది మంది సామాన్య ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 46,  825 హెక్టార్ల భూ విస్తీర్ణంలో ఆయా గ్రామాల రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాధార పంటలతో పాటు బోరుబావుల ద్వారా పంటలను సాగుచేస్తున్నారు. భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఉపాధిని చూపాలనే  లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది. చెరువులను మరింత అభివృద్ధి చేసి వాటి ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరును అందించేందుకు చర్యలు తీసుకుంది. షాద్‌నగర్‌ పరిధిలో 534 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 15 వేల ఎకరాలకు పైగా భూమికి సాగునీరు అందనున్నది. చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం ఇప్పటికి రూ.  3278. 06 లక్షల నిధులు కేటాయించగా ఇందులో రూ.  2293.5 లక్షల నిధులను ఖర్చుచేసింది. దీంతో సుమారు 141 చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయి. మొదటి, రెండో విడుతలో కేశంపేట మండలంలో 48 చెరువులు, కొందుర్గు, చౌదరిగూడెం మండలాల్లో 34, కొ త్తూరు, నందిగామ మండలాల్లో 21, ఫరూఖ్‌నగర్‌ మండలంలో 38 చెరువుల్లో పూడిక తీసి, కట్ట మరమ్మతు పనులు చేశారు. మూడో విడుతలో షాద్‌నగర్‌ డివిజన్‌లోని ఆరు మం డలాల్లో కలిపి 53 చెరువును రూ. 7.8 కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు.   రాష్ట్రంలో వందల సంఖ్యలో చెరువులు అభివృద్ధి కావడంతో పాటు నిండుకుండను తలపించడంతో  గ్రామీణ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

యాసంగిపై రైతుల ఆశలు

 ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే మిషన్‌ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టిందో ఆ పథకం ఫలాలు రైతులకు అందనున్నాయి. కొన్నేండ్లుగా బీటలు వారి, పిచ్చి మొక్కలతో ఉన్న చెరువులు, కుంటలు నేడు జల కళతో ఉట్టిపడుతున్నాయి. కేశంపేట మండలంలో అమ్మచెరువు, బ్రహ్మా చెరువు, మేడి కుంట, రాయికుంట, గాజుల కుంట, చౌలపల్లి చెరువు, కొత్తపేట చెరువు, తొమ్మిది రేకుల చెక్‌డ్యాం, కొత్తమర్రి కుంట, కల్వల కుంట, కొత్త కుంట, పోచమ్మ చెరువు, దొంతిబాయి కుంట, ఊట చెరువు, బండ్ల కుంట, పెద్ద చెరువు, మోడి కుంట, కొత్త చెరువు, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని  అన్ని చెరువులు, కుంటలు, కొత్తూరు, నందిగామ మండలాల్లోని నర్సప్పగూడ, కుమ్మరికుంట చెరువులు, అక్కమ్మ చెరువు, కొత్తూరు, పెంజర్ల, మేకగూడ, నందిగామ చెరువులు,  ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట చెరువు, మొగిలిగిద్ద చెరువు, బొబ్బిలి చెరవు, రాయికల్‌, చిల్కమర్రి, బూర్గుల, కమ్మదనం,  లింగారెడ్డిగుడా చెరువులతో పాటు అన్ని కుంటలు, చెక్‌డ్యాంముల్లో జల కళ సంతరించుకుంది.  చెరువుల్లోకి నీళ్లు రావడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. యాసంగిలో సాగుచేసే పల్లి, వరి, మిరప, కూరగాయల పంటలతో పాటు ఉద్యానవ పంటల సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు భావిస్తున్నారు.  

బోరుబావుల్లో నీళ్లు పెరిగాయి.

ఈ వాన కాలంలో కురిసిన వానలకు మా ఊర్లో చెరువులకు నీళ్లు వచ్చినవి. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువు కట్టను అభివృద్ధి చేసిండ్రు. వచ్చిన నీళ్లన్నీ బయటకు పోకుండ నిలిచినవి. దీంతో చెరువు చుట్టుపక్కల పొలాల్లోని బోరుబావుల్లో నీళ్లు పెరిగాయి. యాసంగి పంటను సాగుచేసేందుకు రైతులు వెనుకాడరు. -  శానమోని శ్రీశైలం, రైతు, చౌలపల్లి, కేశంపేట మండలం 

కరువు అనే మాట  ఉండదు

ఈ యాసంగిలో కరువు అనే మాట ఉండదు. ఎందుకంటే మా ఊర్లో ఉన్న రెండు చెరువుల్లోకి నీళ్లు వచ్చినవి. ప్రభుత్వం చెరువు పనులు చేయడంతో నీళ్లు బాగ నిల్చినవి. బోరుబావుల్లో నీళ్లు పెరుగుతాయి కాబట్టి రైతు ధైర్యంగా పంటలు వేస్తాడు. ఎలాగో కరెంట్‌కు డోకా లేదు కాబట్టి యాసంగిలో పంటలు ఎండవని అనుకుంటున్నం. వెంకటయ్య, రైతు, చింతగూడ, ఫరూఖ్‌నగర్‌ మండలం