శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Nov 20, 2020 , 03:51:14

పల్లెప్రకృతి వనాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

పల్లెప్రకృతి వనాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

  • డంపింగ్‌యార్డు, వైకుంఠధామాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌  అమయ్‌కుమార్‌
  • కడ్తాల్‌ మండలంలో పర్యటన పలు అభివృద్ధి పనుల పరిశీలన

కడ్తాల్‌ : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నెలాఖరుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. గురువారం కడ్తాల్‌, అన్మాస్‌పల్లి గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీల ఏర్పాటు పనులను ఆర్డీవో రవీందర్‌రెడ్డితో కలిసి  పరిశీలించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగి కలెక్టర్‌ తెలుసుకున్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డిని కలెక్టర్‌ అభినందించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కడ్తాల్‌లోని పల్లెప్రకృతి వనాన్ని రోల్‌మోడల్‌గా తీసుకొని ఇతర గ్రామాల్లో పల్లెప్రకృతి వనాల పనులను చేట్టాలని అధికారులను ఆదేశించారు.

 కడ్తాల్‌ పట్టణంలో నూతన గ్రామ పంచాయతీ భవనంతోపాటు, పల్లెప్రకృతి వనంలో బెంచీల ఏర్పాటుకు, వాకింగ్‌ ట్రాక్‌ అభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ని సర్పంచ్‌ కోరగా, నివేదికలు తయారు చేసి పంపాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. అనంతరం కడ్తాల్‌లోని నర్సరీని పరిశీలించి, మండలంలో ఎన్ని నర్సరీలు ఏర్పాటు చేశారు, ఎన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు, వాటిని ఎలా సంరక్షిస్తున్నారు తదితర విషయాలను ఎంపీవో తేజ్‌సింగ్‌ని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో మొక్కలను సంరక్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, వార్డు సభ్యుడు భిక్షపతి, నాయకులు లాయక్‌అలీ పాల్గొన్నారు.

అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

మండలంలో అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లు ఎంపీవో తేజ్‌సింగ్‌, పంచాయతీ కార్యదర్శులు రాంచంద్రారెడ్డి, హరీశ్‌రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడ్తాల్‌ పట్టణంలో నిర్మించిన డంపింగ్‌యార్డును చిన్నగా నిర్మించడం, యార్డులో చెత్తకు నిప్పంటించి ఉండటం, నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కడ్తాల్‌ పట్టణానికి ఇంత చిన్న యార్డు సరిపోతుందా? అని అధికారులను కలెక్టర్‌ ప్రశ్నించారు. అన్మాస్‌పల్లిలోని నర్సరీలో నత్తనడకన పనులు జరుగుతుండటం, నర్సరీకి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తు, పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. 15 రోజుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్‌కి ఎంపీవో తేజ్‌సింగ్‌ వివరించారు.