శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Nov 19, 2020 , 03:21:25

ఇక పూర్తిస్థాయిలో బీపాస్‌

ఇక పూర్తిస్థాయిలో బీపాస్‌

వికారాబాద్‌/రంగారెడ్డి నమస్తే తెలంగాణ: భవన నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఉండేందుకు అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్‌-బీపాస్‌ విధానా న్ని రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మరో రెండురోజుల్లో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రా నుంది. ముఖ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఆదా చేసే సదుద్దేశంతోనే టీఎస్‌ బీ-పాస్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. రాష్ట్రంలోనే వికారాబాద్‌ మున్సిపాలిటీతోపాటు మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపి క చేసి విజయవంతం కావడంతో సంబంధిత నూతన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గతంలో మాదిరిగా భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే ప్లానర్‌ దగ్గర్నుంచి టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల వరకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉండేది. అంతేకాకుండా భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రెండు, మూడు నెలలకు అనుమతులను మంజూరు చేసేవారు. 

మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగంలో అంతా అవినీతిమయం కావడంతో లంచమిస్తేనే అనుమతులిచ్చే పరిస్థితి ఉండడంతో భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు సంబంధం లేకుండా, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇండ్ల నిర్మాణ అనుమతులిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ బీ-పాస్‌ విధానాన్ని తీసుకువచ్చింది. అంతేకాకుండా భవన నిర్మాణ అనుమతుల్లో ప్లానర్స్‌ ప్రమేయం లేకుండా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చారు. అంతేకాకుండా తప్పనిసరిగా నిర్మాణానికి సంబంధించి ప్లానింగ్‌ ఉంటేనే రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకర్లు చెబుతుండడంతో ప్రభుత్వం త్వరలో బ్యాంకర్లతో చర్చించి సమస్యను పరిష్కరించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

600గజాల వరకు స్వీయ ధృవీకరణ ద్వారా అనుమతులు..

టీఎస్‌-బీపాస్‌తో దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు మంజూరు కానున్నాయి. ఇకపై భవన నిర్మాణ అనుమతులకు రోజుల తరబడి మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చి దరఖాస్తు చేసుకుంటే చాలు క్షణాల్లో స్వీయ ధృవీకరణ (సెల్ఫ్‌ సర్టిఫికెట్‌) పత్రం జారీ అవుతుంది. 

అయితే గతంలోనూ భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌ విధానంలోనే జారీ అవుతున్నప్పటికీ ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్న అనంతరం 21 రోజుల్లో అనుమతులివ్వాలని నిబంధనలున్నప్పటికీ మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరమే అనుమతులు జారీ చేసేవారు. టీఎస్‌-బీపాస్‌ నిబంధనల ప్రకారం 75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మించే భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభు త్వం నిర్ణయించింది. అయితే కేవలం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి నామమాత్రంగా ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. 75గజాల నుంచి 600 గజాల వరకు స్వీయ ధృవీకరణ పత్రం ద్వారా అనుమతులు రానున్నాయి. 600 గజాలపైన 21రోజుల్లో అనుమతులు మంజూరు చేయనున్నారు, ఒకవేళ నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయలేనట్లయితే డీమ్డ్‌ అప్రూవల్‌ జారీ కానుంది. అయితే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు సంబంధంలేకుండా కలెక్టర్‌ నియమించే స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం (ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు) క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. అయితే వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాన్ని చేసినట్లయితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సదరు నిర్మాణదారులకు జరిమానా విధించడంతోపాటు సంబంధిత భవన నిర్మాణాన్ని కూలగొట్టడం లేదా స్వాధీనపర్చుకోనున్నారు.