బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Nov 18, 2020 , 06:00:43

జోరందుకోనున్న భూ క్రయవిక్రయాలు

జోరందుకోనున్న భూ క్రయవిక్రయాలు

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : ఉన్నదాంట్లో ఎంతో కొంత భూమి కొనుగోలు చేసి ఇల్లు కటుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం ప్లాట్లు కొనుగోలు చేసే ప్రయత్నంలో భూములపై పెట్టుబడి పెట్టాలని మరికొందరు ఆలోచిస్తుంటారు. మార్కెట్‌లో ఇతరాత్రలపై పెట్టుబడులు పెట్టి మోసపోవడం, నష్టపోవడం కంటే భూమి మీద పెట్టుబడి పెడితే మేలని భావిస్తుంటారు. భూమిపై పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు కూడా వస్తుండడంతో జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఎల్బీ నగర్‌ నియోజకవర్గాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆగస్టు 22నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో కొనుగోలుదారులు, విక్రయదారులు, మధ్యవర్తులు కొంత ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఈనెల 23నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు లైన్‌ క్లియరైంది. 

రెండు నెలలు నిరీక్షణ అనంతరం ...

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మొదలు కాకపోవడంతో చాలాచోట్ల ఇబ్బందులు పడుతున్నా రు. ధరణి పోర్టల్‌ ద్వారా ప్రభుత్వం ఈనెల 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తాసిల్దార్‌ కార్యాలయాల్లో ప్రారంభించారు. వీఆర్వో వ్యవస్థ రద్దు, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ప్రారంభించగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తారని సీఎం ప్రకటించారు. దీంతో ఇప్పటికే భూములను కొనుగోలు చేసిన వారు, అడ్వాన్స్‌లు ఇచ్చిన వారు, ఒప్పందాలు కుదుర్చుకున్నవారు ఆందోళన చెందారు. జిల్లా వ్యాప్తంగా 30వేల వరకు రిజిస్ట్రేషన్లు ఒప్పంద దశలో నిలిచి ఉన్నాయి. రిజిస్ట్రేషన్లకు దాదాపుగా రూ.60-70కోట్ల మేర ఆదాయం నిలిచిపోయింది.

 ఆదాయం సమకూర్చడంలో జిల్లాది మొదటి స్థానం..

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో రంగారెడ్డి జిల్లాది మొదటి స్థానం. అలాంటి జిల్లాలో భారీగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, జిల్లా నగర శివారు కావడంతో పెద్దఎత్తున రియల్‌ ఎస్టేట్‌ ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే కరోనా వల్ల వ్యాపారం జరుగక ఇబ్బందులు పడుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలు కొంచెం ఇబ్బందికరంగా మారినా రియల్‌ వ్యాపారం జిల్లాలో భారీగా జరుగుతున్నది. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి రెండు నెలలు దాటింది. తాజాగా ఆదివారం భూముల రిజిస్ట్రేషన్లపై స్పష్టతనివ్వడంతో రెండునెలలు నిరీక్షణకు ముగింపు పలికినట్లయ్యింది.

ధరణికి ప్రజల ఆదరణ..

ధరణి పోర్టల్‌ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది. ఆద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నది. భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైంది. ధరణి పోర్టల్‌ ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని నిశ్చింతను రైతులు, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.