గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Nov 16, 2020 , 03:57:02

చేవెళ్ల, పరిగి ప్రాంతాలకు రానున్న మంత్రులు

చేవెళ్ల, పరిగి ప్రాంతాలకు రానున్న మంత్రులు

చేవెళ్ల/చేవెళ్ల రూరల్‌ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పాలియేటివ్‌ కేర్‌ దవాఖానను సోమవారం ప్రారంభించడానికి రాష్ట్ర వైద్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌, విద్యాశాఖమంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి రానున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చేవెళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పాలియేటివ్‌ కేర్‌ దవాఖాన ప్రారంభోత్సవం ఉదయం 11గంటలకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 

దీర్ఘకాలిక వాధ్యులతో బాధపడుతున్న వారికి పాలియేటివ్‌ కేర్‌ (ఆత్మీయ చికిత్స కేంద్రం.. ఉపశమన ఆరోగ్య సంరక్షణ కేంద్రం) అండగా నిలుస్తున్నది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. మొట్టమొదటగా పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ను 2013 సంవత్సరంలో కూకట్‌పల్లిలోని కుముదినిదేవి దవాఖానలో ఏర్పాటు చేసి సేవలందించారు. 

చేవెళ్లలో మరో కేంద్రం ఏర్పాటుకు..

చేవెళ్లలో ఆత్మీయ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలోనే ఏర్పాటు చేసే విధం గా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. 2017 సంవత్సరం అక్టోబర్‌లో అప్పటి ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి, రవాణాశాఖ మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చేవెళ్లలో ఉపశమన ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. క్యాన్సర్‌, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ, డయాలసిస్‌, షుగర్‌, హెచ్‌ఐవీ, మానసికవ్యాధి గ్రస్తులతోపాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఆత్మీయ చికిత్స కేంద్రం ఆసరాగా నిలుస్తున్నది. 

మొట్టమొదట ఎంఎన్‌జే కేన్సర్‌ దవాఖనాలో..

మొట్టమొదట ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖనాలో (ఐఎన్‌సీటీఆర్‌) ఇంటర్‌నేషనల్‌ నెట్‌వర్క్‌ కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ అండ్‌ రిసె ర్చ్‌ ద్వారా ఉపశమన ఆరోగ్య సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశా రు. బ్రెజిల్‌, కెనడా దేశాలకు చెందిన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ భారత్‌లో దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోతున్నట్లు గుర్తించింది. దీంతో 2006లో ఇక్కడ పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాజగోపాల్‌ ఎన్‌ఎంజే క్యాన్సర్‌ దవాఖాన ఆధ్వర్యంలో సెంటర్‌ ఏర్పాటు చేసి దానికి కేరళకు చెందిన డాక్టర్‌ గాయత్రీని డైరెక్టర్‌గా నియమించారు. 2006 సంవత్సరంలో ఎంవీఎఫ్‌ సిబ్బంది తోడుకావడంతో గ్రామాల్లో పర్యటించి ఇంటింటి సర్వే నిర్వహించారు. చేవెళ్ల మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న 250 మంది రోగులను గుర్తించారు.  2013 సంవత్సరంలో కూకట్‌పల్లిలోని కుముదినిదేవి (శివానంద ట్రస్టు స్థలంలో) హోస్పైస్‌ (ఆత్మీయ చికిత్స కేంద్రాన్ని 22 పడకలతో నెలకొల్పారు. 70 శాతం మంది చివరి దశలో ఉన్న వారిని అడ్మిట్‌ చేసుకొని ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. 

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆసరాగా.. 

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.  

ఆధునిక వైద్య శాస్త్రంలో పాలియేటివ్‌కేర్‌..

ఆధునిక వైద్యశాస్త్రంలో పాలియేటివ్‌కేర్‌ అనేది ఒక కొత్త శాఖ. క్యాన్సర్‌, హృదయ సంబంధిత, శ్వాసకోశ, షుగర్‌ వంటి ఎ న్నో వ్యాధులు వాటికి అనుబంధంగా ఉన్న కుటుంబ సభ్యులు ఎదుర్కొనే బాధను దృష్టిలో ఉంచుకొని చికిత్స అందిస్తారు.  

ఐదు పడకలతో ఏర్పాటు

2017 సంవత్సరంలో వరల్డ్‌ హోస్సైస్‌ అండ్‌ పాలియేటివ్‌ కేర్‌ ఆధ్వర్యంలో విశ్వ ఆరోగ్య సంరక్షణ, ఆత్మీయ చికిత్స పరిపూర్ణ బాధా విముక్తి అనే భావనతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని చేవెళ్ల మండల కేంద్రంలోని ఏరియా దవాఖానలో పాలియేటివ్‌ కేర్‌ కేంద్రాన్ని ప్రారంభించింది.  ప్రస్తుతం చేవెళ్లలోని పాలియేటివ్‌ హోం కేర్‌ సర్వీసెస్‌ నెంబర్‌ 9121691902ను సంప్రదిస్తే సేవలు అందుబాటులో ఉంటాయని పాలియేటివ్‌ హెల్త్‌ కేర్‌ నిర్వాహకులు తెలుపుతున్నారు.

చిన్నపిల్లలకూ వైద్యం.. 

ఎన్‌ఎంజే క్యాన్సర్‌ దవాఖాన, టాటా ట్రస్ట్‌ అండ్‌ యునైటెడ్‌ కేర్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ భాగస్వామ్యంతో క్యాన్సర్‌ రోగులు ఇతరులకు బాసటగా నిలుస్తున్నది. కూకట్‌పల్లిలో కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి సేవలు చేయడమే కాకుండా చిన్నపిల్లకు ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులుంటే వారికి కూడా సేవలిందిస్తున్నారు. 

మరో ఏడు చికిత్స కేంద్రాలు.. 

చౌటుప్పల్‌, కామారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్‌, రామాయంపేట, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పెయిన్‌ రిలీఫ్‌ అండ్‌ పాలియేటివ్‌ కేర్‌, టాటా, యునైటెడ్‌ కేర్‌ సంయుక్తాధ్వర్యం లో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసింది.