గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Nov 13, 2020 , 03:42:29

కొనుగోళ్లు షురూ

కొనుగోళ్లు షురూ

 రంగారెడ్డి,నమస్తే తెలంగాణ :  రంగారెడ్డి జిల్లాలో పెద్ద మొత్తంలో సాగు చేసిన పత్తి,వరి పంటల దిగుబడులు చేతికి వస్తున్నాయి. జిల్లాలో 30వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా 25 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 20 అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగిలిన వాటిని ఒకటి,రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. జిల్లాలో సాధారణంగా 14,400 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు ప్రణాళిక ఉండగా..26,804 ఎకరాల వరి సాగు చేశారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర ఎ- గ్రేడ్‌కు రూ.1888,కామన్‌ రకానికి రూ.1868గా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో వరి సాగు పెరగడంతో గతేడాది 13 కేంద్రాలు ఉండగా, ఈ సారి 25 ఏర్పాటు చేశారు. గతేడాది 13 కేంద్రాల ద్వారా 6674 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా.. రూ.12.25 కోట్లు రైతులకు చెల్లించారు. 

టోకెన్లు జారీ

   రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్‌ 17, మెప్మా 1,డీసీఎంఎస్‌ 2,మార్కెట్‌ కమిటీ 2, ఎఫ్‌ఎస్‌సీఏఎస్‌ 3 ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి 5 గ్రామాల చొప్పున ధాన్యాన్ని సేకరించేందుకు వీలు కల్పించారు. ముందుగా వ్యవసాయ శాఖ అధికారుల నుంచి టోకెన్లు తీసుకుని తేదీల వారీగా రైతులు కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 20 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వాటికి కావాల్సిన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచినట్లు సివిల్‌ సప్లయ్‌ అధికారులు చెబుతున్నారు. 

 రంగారెడ్డి జిల్లాలో గణనీయంగా పత్తి సాగు చేయడంతో  సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది వానకాలంలో 4,71,795 ఎకరాల వివిధ రకాల పంటలు సాగు చేశారు. అందులో అత్యధికంగా 2,73,227 ఎకరాల్లో పత్తి సాగైంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో 15 పత్తి కొనుగోలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 15 జిన్నింగ్‌ మిల్లులను గుర్తించారు. అత్యధికంగా షాద్‌ నగర్‌లో  12, ఆమనగల్లు పరిధిలోని తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం పరిధిలో ఒకటి, చేవెళ్లలో ఒకటి చొప్పున మిల్లులను గుర్తించారు.  రెండు రోజుల  నుంచి వీటి ద్వారా పత్తి సేకరణ చేపట్టారు.  

20లక్షల క్వింటాళ్ల కొనుగోలు 

 పత్తి దిగుబడి కూడా పెరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. హెక్టారుకు 10 నుంచి 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించారు. 20లక్షల క్వింటాళ్లు సేకరించాలని నిర్ణయించింది. కానీ..ఇటీవల వర్షాలకు 82,870 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. దీంతో 5లక్షల క్వింటాళ్లు తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది కూడా 15లక్షల క్వింటాళ్ల పత్తిని సేకరించారు. 

పత్తికి మద్ధతు ధర 

  ప్రతి సంవత్సరం మద్ధతు ధర కూడా పెరుగుతున్నది. గతేడాది క్వింటాళ్ల పత్తికి రూ.5,450 నిర్ణయించారు. ఈసారి మద్ధతు ధర క్వింటాలుకు రూ.5,825 నిర్ణయించారు. తేమ శాతం 8-12 వరకు ఉంటే సీసీఐ కొనుగోలు చేస్తున్నది.  

కేంద్రానికి ఒక ఏఈవో 

  పత్తి కొనుగోళ్ల విషయంలో సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొనుగోలు కేంద్రం ఉన్న ప్రతి జిన్నింగ్‌ మిల్లుకు ఏఈవోను నియమించింది. పత్తి  రైతులను సమన్వయం చేయడం,సేకరించిన పత్తిని సకాలంలో కేంద్రం నుంచి తరలించడం, చెల్లింపులు తదితర అంశాలను ఏఈవో పర్యవేక్షిస్తారు.  పత్తిని సేకరించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఛాయాదేవి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.

మక్కల కొనుగోళ్లు 

    జిల్లాలో మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 18 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 12 పీఏసీఎస్‌, 4 డీసీఎంఎస్‌, ఒక సబ్‌ సెంటర్‌,1ఎఫ్‌ఎస్‌సీఏఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, మద్దతు ధర రూ.1850గా ప్రకటించారు. 

హయత్‌నగర్‌ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. పంటను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి లబ్ధిపొందాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ ఉమర్‌ఖాన్‌గూడ 2వ వార్డులోని సంఘీ స్పిన్నర్స్‌లో భారతీయ పత్తి సంస్థ మహబూబ్‌నగర్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిసన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌(డీసీసీబీ) కొత్తకుర్మ సత్తయ్య, కౌన్సిలర్లు, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి, పత్తిని మొదటి, రెండో ప్రాధాన్యత పంటలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సీసీఐ సహకారంతో క్వింటాలు పత్తికి రూ.5825 చెల్లిస్తుందన్నారు. పంటల కొనుగోలులో గత సంవత్సరం రైతులకు తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ యేడు మార్కెటింగ్‌ శాఖ నుంచి ఏడీని ప్రత్యేకాధికారిగా నియమించారన్నారు. రైతులు తమ పంటను మధ్య దళారీలకు ఇవ్వొద్దని, తద్వారా రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. మార్కెటింగ్‌ శాఖ సీసీఐ వారితో సమన్వయం చేసుకొని సరైన పద్ధతిలో మెజర్‌మెంట్లు తీసుకొని రైతులకు న్యాయం చేస్తుందన్నారు. 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వరి తరువాత రెండో పంటగా పత్తి పంట పెద్దఎత్తున ఉందన్నారు. గత సంవత్సరం లక్షా18 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు కేంద్రానికి వస్తే.. ఈ యేడు సీఎం కేసీఆర్‌ సూచించిన నియంత్రిత సాగుతో లక్షా50 వేల క్వింటాళ్ల పత్తి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు తమ పంటను పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. రైతులు టోకెన్లు తీసుకొని అధికారులు సూచించిన సమయం ప్రకారం పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. తూకంలో అవకతవకలు జరిగి రైతులు మోసపోకుండా మార్కెటింగ్‌ శాఖ వారికి చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే పత్తిని ఎక్కువ రోజులు నిల్వపెట్టకుండా ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర మార్కెటింగ్‌ శాఖ సీవో వరప్రసాద్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి ఛాయాదేవి, కమిషనర్‌ అహ్మద్‌ సఫీ ఉల్లా, ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, తుర్కయాంజాల్‌ రైతు సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ఆఫీసర్‌ తిరుపతయ్య, డైరెక్టర్‌ సంజీవరెడ్డి, కౌన్సిలర్లు కళ్యాణ్‌నాయక్‌, శ్రీలత, జ్యోతి, స్వాతి అమరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు బలదేవరెడ్డి పాల్గొన్నారు.

రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

షాబాద్‌ : రాష్ట్రంలో రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం షాబాద్‌ మండల పరిధిలోని సర్దార్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో చేవెళ్ల, కొడంగల్‌ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.22లక్షలతో రైతు వేదికలు నిర్మాణం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. క్లస్టర్లవారీగా రైతులకు సమావేశాలు నిర్వహించి పంటల సాగుపై అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేయవద్దనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఎకరానికి రూ. 5వేలు పెట్టుబడి సాయం అందించి అన్నదాతను ఆదుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించి ఆ కుటుంబాలకు సర్కార్‌ అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేలా తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు కోట్ల ప్రశాంతి, గునుగుర్తి నక్షత్రం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొన్న స్వప్న, వైస్‌ ఎంపీపీ జడల లక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్లా శేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మద్దూరి మల్లేశ్‌, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌ మునగపాటి స్వరూప, ఎంపీటీసీ వనిత, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌రావు, శ్రీరాంరెడ్డి, నాయకులు మహేందర్‌రెడ్డి, రాందేవ్‌యాదవ్‌, నర్సింహులు ఉన్నారు. 

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

నందిగామ : రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ మంజులరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరై జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని, రైతులను రాజులను చేయాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. గ్రామాలలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవాలని సూచించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ పాండురంగారెడ్డి, కొత్తూరు ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, కొత్తూరు మండల అధ్యక్షుడు యాదగిరి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మండల వ్యవసాయధికారి శ్వేత, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, ప్రభాకర్‌,  ఆంజనేయులు, రాజు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.