శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Nov 12, 2020 , 04:51:39

ఆలయాల అభివృద్ధికి కృషి

ఆలయాల అభివృద్ధికి కృషి

మహేశ్వరం,నవంబర్‌11: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం గ్రామానికి చెందిన పేయల నర్సింహను  శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా ఎన్నుకున్న సందర్భంగా నగరంలోని మంత్రి నివాసంలో బుధవారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం  అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయాలను అభివృద్ధి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకొని  సన్మార్గంలో నడవాలని సూచించారు. ఆలయాల్లో మంచి వాతావరణం ఏర్పడేటట్లు దేవస్థానం కమిటీ తగిన చర్యలు తీసుకొని   అభివృద్ధికి పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఆలయాలకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి  నాయకులు కూన యాదయ్య, చంద్రయ్య ముదిరాజ్‌, బ్యాంకు డైరెక్టర్లు పొల్కం బాలయ్య, కడమోని ప్రభాకర్‌, నాగులదోని సర్పంచ్‌ మెగావత్‌ రాజునాయక్‌, అంబయ్య యాదవ్‌  పాల్గొన్నారు.

రహదారులకు నిధులు కేటాయించాలి

పహాడీషరీప్‌: శ్రీరామకాలనీ ప్రధాన రహదారికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని 18వ వార్డు కౌన్సిలర్‌ లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామకాలనీ ప్రధాన రహదారి గత ఏడాది నుంచి గుంతలమయంగా మారిందన్నారు. ఇటీవల వర్షాలకు వరదల కారణంగా రహదారి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి  అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాలనీ వాసులు వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. దీనికి తోడు అంతర్గత డ్రైనేజీ సమస్య ఉందన్నారు. మ్యాన్‌హోళ్లు లీకేజీలతో, రోడ్డుకిరువైపులా ఉన్న ఫిల్టర్‌ వాటర్‌ యజమానులు రోడ్డుపై నీరు వదలడంతో శ్రీరామకాలనీ ప్రధాన రహదారిపై నీరు నిలిచి ఉంటుందన్నారు. నిత్యం వాహనాల రద్దీతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిందన్నారు. నిధులు కేటాయించి అంతర్గత డ్రైనేజీ, రహదారిని అభివృద్ధి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని  కోరారు. మంత్రి స్పందించి త్వరలో నిధులు కేటాయించి మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని తెలిపారని  కౌన్సిలర్‌ పేర్కొన్నారు. నాయకులు ఆంజనేయులు, నర్సింగ్‌, తిరందాస్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.