మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Nov 12, 2020 , 04:28:53

పార్ట్‌-బీలోని భూముల పరిష్కారానికి చర్యలు

పార్ట్‌-బీలోని భూముల పరిష్కారానికి చర్యలు

పార్ట్‌-బీలోని భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో  ప్రత్యేక కమిటీ 

సమగ్ర అధ్యయనం చేసి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని ఆదేశం

రంగారెడ్డి జిల్లాలో పార్ట్‌-బీలో 7,342 ఖాతాలు..

65,704 సర్వే నెంబర్లు.. 67,382.32 ఎకరాలు 

వివాదాస్పద భూముల జాబితా(పార్ట్‌-బీ)లోని భూముల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2017లో భూరికార్డుల నవీకరణకు ముందు ఎలాంటి వివాదంలో లేని భూములను కూడా 2018 మేలో పార్ట్‌-బీలో చేర్చారు. దీంతో చాలామంది రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు దూరం కాగా, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇది గమనించిన సర్కార్‌ గత రెండున్నరేండ్లుగా పార్ట్‌-బీ జాబితాలో నమోదైన భూములకు పరిష్కార మార్గం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నది.  అందుకోసం నలుగురు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో బి.వెంకట్రామయ్య నేతృత్వంలో కమిటీని నియమించింది. దీనిపై సమగ్ర అధ్యయనం చేపట్టి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పార్ట్‌-బీలో 7,342 ఖాతాలు, 65,704 సర్వే నెంబర్లు ఉండగా, 67,382.32 ఎకరాల భూమి ఉన్నది. 
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : రెండున్నరేండ్లుగా వివాదాస్పద భూముల జాబితా (పార్ట్‌-బీ)లో పెట్టిన భూముల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్ట్‌-బీలోని భూములు, అటవీ భూములు, వక్ఫ్‌, దేవాదాయ భూముల సరిహద్దు భూముల వివాదాలన్నింటినీ తేల్చేయాలని, ఇందుకు సంబంధించి ఆయా అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి నలుగురు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో బి.వెంకట్రారామయ్య నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ గడిచిన 5 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనుంది. ఇటీవల పటాన్‌చెరు, జడ్చర్ల మండల తాసిల్దార్‌ కార్యాలయాల్లో పార్ట్‌-బీలోని వివాదాలపై కేసులవారీగా రివ్యూ నిర్వహించారు. వాస్తవానికి కొన్నిచోట్ల ఎటువంటి కేసులు, స్టేటస్‌ కో వంటి తీర్పులు లేకపోయినా.. భూములను వివాదాస్పద జాబితాలో చేర్చారు.  
2017 సెప్టెంబర్‌ 15 నుంచి జరిగిన భూరికార్డుల నవీకరణకు ముందు వివాదాల్లేని భూములు కూడా నవీకరణ అనంతరం 2018 మేలో పార్ట్‌-బీ జాబితాలో చేరిపోయాయి. దీంతో రైతులు రైతు బంధు సాయం, రైతు బీమాతో పాటు కనీసం విత్తన, ఎరువుల సబ్సిడీ కూడా పొందలేకపోతున్నారు. వారంతా ప్రభుత్వ నిర్ణయంపై ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘ధరణి పోర్టల్‌' ప్రారంభం కావడంతో వారు తాసిల్దార్‌ కార్యాలయానికి వచ్చి పార్ట్‌-బీలో నుంచి తమ భూములను తొలగించాలని కోరుతున్నారు. రైతుల సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. పార్ట్‌-బి వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే నూతన కమిటీ ఏర్పాటు జరిగింది. 
సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నలుగురు అధికారుల బృందం ఒక్కో రోజు ఒక్కో తాసిల్దార్‌ కార్యాలయాలకు వెళ్లి.. వివాదాలను ఆయా అంశాలవారీగా ఎలా పరిష్కరించాలన్న దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. సివిల్‌ కోర్టులో కేసులున్న భూములపై న్యాయస్థానం తీర్పు వచ్చేదాకా వేచి చూడాలని నిర్ణయానికొచ్చారు. ఇక రెవెన్యూ కోర్టు వివాదాల్లో ఉన్న భూములపై త్వరలో ఏర్పడే తాత్కాలిక ట్రిబ్యునళ్లు నిర్ణయం తీసుకుంటాయనే అభిప్రాయం ఉన్నది. అటవీ సరిహద్దు వివాదాలు, అసైన్డ్‌ భూములు, కుటుంబ సరిహద్దు భూములు, వక్ఫ్‌, దేవాదాయ భూములపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు జిల్లాలో పర్యటించి త్వరలోనే సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించనుంది. ఆ తర్వాత దీనిపై సీఎం కేసీఆర్‌ విధాన నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఒకటికి రెండుసార్లు సమావేశం ఏర్పాటు చేసి కూలంకషంగా చర్చించి మార్గదర్శకాలు ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 3,83,337 ఖాతాలున్నాయి. 11,40,988 సర్వే నంబర్లలో 12,21,447.32 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో పార్ట్‌-బీలో 7,342 ఖాతాలుండగా.. 65,704 సర్వేలు.. 67,382.32 ఎకరాలు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.