మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Nov 11, 2020 , 04:32:52

జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తాం

జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తాం

షాబాద్‌ : రంగారెడ్డి జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామని, ఆమేరకు నిరంతరం కృషి చేస్తామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ఆయన నివాసంలో షాబాద్‌ మండలంలోని చందనవెళ్లి సర్పంచ్‌ కొలన్‌ ప్రభాకర్‌రెడ్డితోపాటు గ్రామస్తులు మహేందర్‌రెడ్డిని కలిసి భూ పరిహారం పెంచేందుకు కృషి చేసినందుకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌లను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరానికి దగ్గర్లో ఉన్న షాబాద్‌ మండలంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి ఆవకాశాలు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. 

మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఇప్పటికే వెల్స్‌ పన్‌ టెక్స్‌టైల్స్‌ పార్కు, కటేరా, కుందానా, అమెజాన్‌ కంపెనీలు నిర్మాణం జరుగుతున్నాయన్నారు. టెక్స్‌టైల్స్‌ పార్కులో స్థానిక యువతకు ఉపాధి ఆవకాశాలు లభిస్తాయన్నారు. మొదట్లో ఎకరాకు రూ. 9లక్షలు భూ పరిహారం చెల్లించడం జరిగిందని, రైతుల కోరిక మేరకు మరో రూ.1.50 లక్షలు పెంచి రూ.10.50లక్షలు ఇస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సూద యాదయ్య, గ్రామస్తులు కృష్ణగౌడ్‌, వెంకటయ్య, యాదయ్య, విష్ణు ఉన్నారు.