మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Nov 08, 2020 , 03:59:08

అరమీటర్‌ లోతులోనే భూగర్భజలాలు

అరమీటర్‌ లోతులోనే భూగర్భజలాలు

  • రంగారెడ్డి జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు
  • భారీ వర్షాల ఫలితం 306.29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు 
  • నిండుకుండల్లా చెరువులు, కుంటలు 
  • సమృద్ధిగా సాగునీరు
  • ఆనందంలో అన్నదాతలు

రంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు భారీగా పెరిగాయి.  ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురువడంతో వాగులు, కాల్వలు పొంగిపొర్లాయి. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 306.29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో అరమీటర్‌ లోతులోనే నీటి నిల్వలు అందుబాటులోకి వచ్చాయి.  ఇక బోర్లలోనూ నీరు సమృద్ధిగా ఉండటంతో ఆపకుండా పోస్తున్నాయి. ఈసారి సాగునీటికి ఢోకాలేదని అన్నదాతలు మురిసిపోతున్నారు. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ:  దశాబ్దాల తర్వాత రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈసారి కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు పైపైకి వచ్చాయి. గతేడాది అక్టోబర్‌ నెలలో పోల్చితే జిల్లాలో 2.07 మీటర్ల పైకి భూగర్భ జలాలు వచ్చిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని మండలాల వారీగా ప్రతి నెలా మూడవ వారంలో ఫిజియోమీటర్లతో నీటిమట్టాలు కొలుస్తారు. లెక్కించిన లెవల్స్‌ను ప్రతి నెలా 28వ తేదీలోపు రాష్ట్ర స్థాయి అధికారులకు పంపిస్తారు.అక్కడ వారు జిల్లాల వారీగా రిపోర్టు తయారు చేసి ప్రతినెల చివరి రోజున విడుదల చేస్తారు. ప్రస్తుతం భూగర్భ జల శాఖ అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం 2020 అక్టోబర్‌ మాసంలో సాధారణ వర్షపాతం కంటే 84.9శాతం ఎక్కువ నమోదైంది.రంగారెడ్డి జిల్లాలో 18,754.3 మి.మీ. వర్షం కురియాల్సి ఉండగా.. ఇప్పటి వరకు జిల్లాలో 30,629.8 మి.మీ. వర్ష పాతం నమోదైంది. జిల్లాలో 27 మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. గతేడాది అక్టోబర్‌లో 128.1 మి.మీ. నమోదు కాగా..ఈ సంవత్సరం మాత్రం 288.3 మి.మీటర్లుగా నమోదైంది. దీంతో ఐదేళ్లలో ఇంతగా ఎన్నడూ వర్షపాతం నమోదు కాలేదని భూగర్భ జల పరిశోధన శాఖ అధికారులు వెల్లడించారు.ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే అత్యధికంగా 160 మిల్లీమీటర్ల మేర వర్షాలు కురిసాయి. కందుకూరు మండలంలో 0.25, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో 0.40, హయత్‌నగర్‌ మండలంలో 0.18, సరూర్‌నగర్‌ మండలంలో 0.62,బాలాపూర్‌ మండలంలో 0.32 మీటర్లలోనే భూగర్భజల స్థాయి నమోదు అయింది.

  భారీ వర్షపాతం నమోదు 

 రంగారెడ్డి జిల్లాలో 27 మండలాల్లో ఉన్న 40 ఫిజియో మీటర్‌ వాటర్‌ లెవల్స్‌ను లెక్కించిన ప్రకారం ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 30,629 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.. కాగా అందులో కొన్ని టీఎంసీల నీరు భూమిలో ఇంకింది. అధికారుల లెక్కల ప్రకారం .. కురిసిన వర్షంలో పది శాతం భూమిలోకి ఇంకుతుంది. 90శాతం నీరు చెరువులు, కుంటలు, కాల్వల ద్వారా ఇతర ప్రాంతాలకు పారుతుంది. 

 అక్టోబర్‌లో 100శాతం అధికంగా ..

   అక్టోబర్‌ మాసంలో 128.1 మి.మీ. సాధారణ వర్షపాతం కాగా..288.3 మి.మీ. వర్షం కురిసింది. 160 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.  

అంచనాలకు మించి.. 

చాలా సంవత్సరాల తర్వాత రంగారెడ్డి జిల్లా పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఆశించిన మేరకు భూగర్భ జలాలు వృద్ధి చెందా యి. అత్యధికంగా సెప్టెంబర్‌,అక్టోబర్‌  నెలల్లో వర్షం కురిసింది. గతేడాది సరాసరి 10 మీటర్ల లోతులో నీరు ఉంటే ఈ ఏడాది 4 మీటర్లపైకి భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. సాధారణంగా భూగర్భ జలాలు 13.06 ఉండగా..ప్రస్తుతం 3.87మీటర్ల పైకి భూగర్భ జలాలు వచ్చాయి. 

నందిగామ మండలంలో 0.95 మీటర్ల లోతులోనే.. 

  రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలంలో 0.95 మీటర్లలోనే భూగర్భజల స్థాయి నమోదు అయింది. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల పరిధిలోని 40 చోట్ల భూగర్భజలాల పరిస్థితిపై అధ్యయనం చేశారు. గతేడాది అక్టోబరు -19తో పోల్చితే ఈ ఏడాది అక్టోబరు నెలాఖరు నాటికి 2.80 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగినట్టు అధికారులు తెలిపారు.  

అక్టోబరు వర్షాలతో ఉబికివచ్చిన పాతాళగంగ 

  వందేళ్ల తర్వాత కురిసిన రికార్డు స్థాయి కుండపోత వర్షాలతో భూ గర్భజలాలు పైకి వచ్చాయి. సాధారణంగా ఈ అక్టోబర్‌లో సగటు వర్షపాతం 694.6 మి.మీ అంచనా ఉండగా.. 1134.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 84.9 శాతం మేర అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పాతాళగంగ ఉబికివచ్చింది. రంగారెడ్డి జిల్లా చరిత్రలోనే లేనంతగా అన్ని మండలాల్లో భూగర్భజలాలు పెరగగా, 27 మండలాల్లో రికార్డు స్థాయిలో గ్రౌండ్‌ వాటర్‌ గణనీయంగా పెరిగిందని రంగారెడ్డి జిల్లా భూగర్భజలశాఖ అధికారి జగన్నాథ రావు తెలిపారు.