మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Nov 08, 2020 , 03:45:07

పెట్టుబడులు.. జిల్లాకు వరం

పెట్టుబడులు.. జిల్లాకు వరం

రంగారెడ్డి జిల్లాలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ కేంద్రం ఏర్పాటు చేయనుండడంపై జిల్లా      ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషి చేసిన మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి శనివారం కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ప్రపంచ శ్రేణి బహుళజాతి సంస్థ అమెజాన్‌ తమ కొత్త ఆసియా పస్‌పిక్‌ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ప్రగతిభవన్‌లో శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పారదర్శకమైన, వేగవంతమైన పరిపాలనా విధానాల వల్లే రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ పెట్టుబడులతో స్థానికంగా ఉన్న యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని  ఆమె ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాను పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నందున ఐటీశాఖమంత్రి రామారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  అమెజాన్‌ సంస్థ దేశంలోనే అతిపెద్ద పుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతుందని, ఇందుకు ప్రత్యేకంగా కృషి చేసిన మంత్రి కేటీఆర్‌ కృషి సంతోషకరమన్నారు. అమెజాన్‌ సంస్థ చేసిన ప్రకటలనతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పెట్టుబడిదారులు జిల్లా వైపు చూడటం ఖాయమని పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఆసియా, పస్‌పిక్‌ ప్రాంతీయ కేంద్రం ద్వారా వేలాది మంది స్థానికులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నా రు. అంకుర పరిశ్రమలను స్థాపించాలనుకునే యువతకు మంచి లాభం చేకూరుతుందని తెలిపారు. ప్రఖ్యాత సంస్థ ఇంత భారీ ఎత్తున జిల్లాలో డాటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో డాటా సెంటర్ల ఏర్పాటుకు జిల్లా ఆకర్షిణీయమైన కేంద్రంగా మారే అవకాశముందని మంత్రి తెలిపారు.  కార్యక్రమంలో మూసీ రివర్‌ఫ్రంట్‌ చైర్మన్‌, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, హామీల అమలు కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కార్తీక్‌రెడ్డి తదితరులున్నారు.