శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Nov 06, 2020 , 03:31:39

సవ్యంగా... సులభంగా..

సవ్యంగా... సులభంగా..

  • పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు
  • ఆమనగల్లులో ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను 
  • పరిశీలించిన కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ధరణి సేవలు సజావుగా సాగుతున్నాయి. స్లాట్‌ బుకింగ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. రైతులతో తాసిల్దార్‌ కార్యాలయాలు సందడిగా మారాయి. గురువారం నాలుగోరోజు రంగారెడ్డి జిల్లాలో 66 రిజిస్ట్రేషన్లు కాగా, వికారాబాద్‌ జిల్లాలో 39 అయ్యాయి. ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రింటెడ్‌ డాక్యుమెంట్లు ఇస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వచ్చేదని, డబ్బులిచ్చినా పనులయ్యేవి కాదని, ధరణితో  పైసా ఖర్చు లేకుండా నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుందన్నారు. 

ఆమనగల్లు : భూముల రిజిస్ట్రేషన్లల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని, దీనివల్ల రైతులు, భూ కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌  పేర్కొన్నారు. గురువారం  ఆమనగల్లు తాసిల్దార్‌ కార్యాలయం ఆవరణలో  ధరణి పోర్టల్‌ ద్వారా  నిర్వహిస్తున్న  భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆర్డీవో రవీందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆమనగల్లు మండలంలో గురువారం 10 రిజిస్ట్రేషన్లు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పూర్తి కావడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం ఆవరణలో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన రైతులతో మాట్లాడి  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి సేవల గురించి ఆరా తీసారు. అనంతరం సింగంపల్లి గ్రామానికి చెందిన రాజుకు భూమి కొనుగోలుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 21 తాసిల్దార్‌ కార్యాలయాల్లో సజావుగా ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నదన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 188 స్లాట్‌లు బుక్‌ కాగా అందులో 160 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు పేర్కొన్నారు. ధరణి ప్రక్రియ ద్వారా ప్రజలకు ఆస్తులకు సంబంధించి పూర్తి రక్షణ ఉంటుందని.. ఈ పోర్టల్‌ ద్వారా ఎక్కడి నుంచి అయినా స్లాట్‌ను బుక్‌ చేసుకునే వీలుంటుందన్నారు. ఆమనగల్లులో ఒకే రోజు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినందుకు తాసిల్దార్‌ చందర్‌రావుతోపాటు సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు.