శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Nov 05, 2020 , 02:48:53

రైతును రాజు చేస్తాం

రైతును రాజు చేస్తాం

  • వందేండ్లలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు
  • రంగారెడ్డి జిల్లాలో సగటుకన్నా  90 శాతం అధిక వర్షపాతం
  • అధైర్యపడొద్దు..ఆదుకుంటాం,   ప్రతీ పంటను కొనుగోలు చేస్తాం
  • జడ్పీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
  • హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.  ఖైరతాబాద్‌లో బుధవారం జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది.  ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్య యాదవ్‌, జైపాల్‌యాదవ్‌, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ గణేశ్‌ , డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్లోళ్ల కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  వందేండ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది వర్షాలు కురిశాయన్నారు. జిల్లాలో సగటు కన్నా 90శాతం అధికంగా వర్షపాతం నమోదైందన్నారు. నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని ఆదుకుంటామన్నారు. ప్రతీ పంటను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ:  రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలకు నష్ట  పరిహారం అం దించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.  మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్య యాదవ్‌, జైపాల్‌ యాదవ్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌ , డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్లోళ్ల కృష్ణారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సభ్యులు కొనియడారు. ఎంతసేపు ప్రభుత్వాన్ని నిందించడం తప్ప,  చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు చూడాలి. విమర్శలు కాదు..సద్వివిమర్శ చేసుకోవాలని అధికార పార్టీ సభ్యులు సూచించగా..ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ చేపట్టిన పథకాలకు తాము కూడా స్వాగ తం పలుకుతామంటూ  ప్రకటించారు.  

సమావేశంలో  మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ..గతంలో ఎన్న డూ లేని విధంగా జిల్లాలో సగటుకన్నా 90 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ వర్షాల వల్ల లక్షా 44 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రం లో పండిన ప్రతీ పంటను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు.  జిల్లాలో ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చి ఆయా కంపెనీల్లో ఉద్యోగం కల్పించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని,ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రుణమాఫీ దశలవారిగా అమలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని, సకాలంలో రైతు బంధు, రైతు బీమా అందజేస్తామన్నారు. 

సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ .. అకాల వర్షాలతో పంట నష్టం జరిగినందున పంట నష్టంపై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. అందరికి రైతు బంధు, రైతు బీమా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ లే అవుట్ల విషయంలో కనీస సౌకర్యాలు ఆట స్థలం.. పార్కు లేని వెంచర్లను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక పంపి వాటిపై చర్య తీసుకోవాలని సూచించారు. నందిగామ మండలంలోని కొన్ని  ఫ్యాక్టరీల ద్వారా వెలువడే కాలుష్యం వలన ప్రజలకు అనారో గ్యం కలుగుతుందని దీనిపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. 57 సంవత్సరాల వయస్సు గల వారి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం నివేదిక తయారు చేసి చర్య తీసుకుంటుందన్నారు. పెన్షన్లు తీసుకుని మధ్యలో ఆగిపోయిన వారి వివరాలను అందజేయాలని సూచించారు. నందిగామ పరిధిలో కాలుష్య వెదజల్లుతున్న పరిశ్రమలను మూసీ వేయాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌ సభ దృష్టికి తీసుకురావడంతో మంత్రి పైవిధంగా స్పందించారు. 

జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో  వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని సభ్యులు ఆమె దృష్టికి తీసుకు రాగా సమస్య పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. కాలుష్యం వెలువడుతున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.  జిల్లాలో వానకాలంలో వివిధ రకాల పంటలు నాలుగు లక్షల ఎకరాల్లో సాగవతాయని అంచనా వేయగా అంచనాలను మించి 4,71,795 ఎకరాల్లో సాగు చేశారని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి  తెలిపారు. యాసంగి పం టకు కూడా పూర్తి స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉం చామని తెలిపారు.ఇటీవలి వానాకాలం లో జిల్లాలోని 2,63, 271 మంది రైతులకు రూ.336 కోట్లను రైతు బంధు కింద అందజేశామని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి తెలిపారు. రైతు జీవిత బీమా కింద 2020 -21 ఆర్థిక సంవత్సరం లో ఇప్పటివరకు 84 మంది రైతులకు రూ.4.20లక్షల బీమా మొత్తాన్ని అందించామని వివరించారు.  కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రైతులకు అనుకూలంగా సీ.సీ.ఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అధిక వర్షాలకు చెరువులు, కుంటలు తెగి పంటలు నీట మునిగి పోగా..వరద కారణంగా పశువులు సైతం మృత్యువాత పడ్డాయన్నారు. పెన్షన్లపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ప్రతి నెల చనిపోయిన వారి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరారు.

తలకొండపల్లి, ఫరూఖ్‌నగర్‌, యాచారం మండలాల ఎంపీపీ లు మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణం, పసుపురంగులోకి వరి పంట, పత్తి కొనుగోలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్‌ మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ అధికారులు పోచారం పంచాయతీలో జరుగుతున్న అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్నట్లు రుజువు అయినా చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా అదనపు కలెక్టర్‌, డీపీవోలు చర్యలు తీసుకోవాలని లేకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సర్పంచ్‌,ఉపసర్పంచ్‌లకు నోటీసులు జారీ చేశామని డీపీవో శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తలకొండపల్లి జడ్పీటీసీ వెంకటేశ్‌ మాట్లాడుతూ..సర్పంచ్‌లను ఉపసర్పంచ్‌లు ఇబ్బందులు పెడుతున్నారని,ఎంబీ చేసిన తర్వాత చెక్‌లు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. మంచాల, శంకర్‌పల్లి ఎంపీపీలు వైకుంఠధామాలు నిర్మాణాలకు సంబంధించి ముందు చూపుతో నిర్మాణాలు జరుగుతుంటే కొందరు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. అబ్దూల్లాపూర్‌మెట్‌ మండలంలో 273 అక్రమ లే అవుట్లు ఉన్నాయని గుర్తించారు. వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టారు, అక్కడ పార్కు స్థలాలు, ఆట స్థలాలు ఎలా అని అధికారులను ప్రశ్నించారు. అక్రమ వెంచర్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఆ మండలా అధికారి వెంచర్ల వారి దగ్గరకు వెళ్లి జడ్పీటీసీ ఒత్తిడి చేస్తున్నారని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. కడ్తాల్‌లో 3600 ఎకరాల్లో బటర్‌ ప్లేయ్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారని ఇక్కడ 7,8 చెరువులు ఉన్నాయని వాటిని పరిరక్షించాలని కోరారు. ప్రస్తుతం 2700 ఎకరాల్లో వెంచర్‌ ఉండగా..పంచాయతీకి రావాల్సిన 270 ఎకరాలు ఎక్కడ అని ఆ మండలా సభ్యులు ప్రశ్నించారు. ఈ అశంపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి సబితారెడ్డి సభ్యులకు సమాధానం ఇచ్చారు. ఇబ్రహీంపట్నం మండలంలో కూడా 20వేల ఎకరాల్లో జనహర్ష, ఏబీసీ వెంచర్లు పంచాయతీలకు 10శాతం భూమి కేటాయించారని ఎంపీపీ కృపేష్‌ తెలిపారు.  ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ముగ్గురు మహిళా ప్రజాప్రతినిధులను అగౌరవ పరుస్తూన్నారని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా ల్లో అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఆయా మం డలాల మహిళా ప్రజాప్రతినిధులు సభలో మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. పీసీబీ అధికారులు జిల్లా పరిషత్‌ సమావేశాలకు ఎందుకు రారని సభ్యులు ప్రశ్నించారు. జిల్లాలో భారీగా పరిశ్రమలు ఉన్నాయని వారిని ప్రతి సమావేశానికి పిలువాల్సిందిగా జిల్లా అధికారులకు సభ్యులు సూచించారు.జిల్లా పీసీబీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారి నిర్వాహాకం వల్ల జిల్లాలో పరిశ్రమలల్లో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని  జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. 

కన్నీళ్లు పెట్టుకున్న డీసీహెచ్‌ఎస్‌ 

వైద్య,ఆగర్యోశాఖపై చర్చ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య విధానపరిషత్‌ అధికారి ఝాన్సీ సభ్యులకు సమాధానం ఇచ్చారు.అయితే తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్‌ డీసీహెచ్‌ఎస్‌ డ్యూటీ సక్రమంగా చేయ డం లేదని విమర్శలు చేయడంతో ఆమె కంటతడి పెట్టుకుంది.