గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Nov 05, 2020 , 02:48:53

ధరణి పోర్టల్‌తో సులభంగా రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టల్‌తో సులభంగా రిజిస్ట్రేషన్లు

  •  నిమిషాల్లో ప్రక్రియ పూర్తి
  • మండలంలో విజయవంతంగా ప్రారంభం
  • ధ్రువపత్రాలు అందజేసిన ఎంపీపీ, జడ్పీటీసీ

యాచారం: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అనేక మార్పులు తీసుకొస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. తాసిల్దార్‌ కార్యాలయంలో బుధవారం భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల పక్రియ తాసిల్దార్‌ అండ్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్ట్రార్‌ నాగయ్య ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. మండలంలో మొదటి రిజిస్ట్రేషన్‌ కొత్తపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌ అఖిల్‌, దూదిపాల చంద్రారెడ్డిది. వీరితో పాటుగా మరో రెండు రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం అయ్యాయి. మొదటి రోజే ధరణి సక్సెస్‌ కావడంతో అధికారులు, కొనుగోలు దారులు, విక్రేతలు, సాక్షులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. సంబురంతో చప్పట్లు కొట్టి, స్వీట్లు పంచుకున్నారు. 10 నిమిషాల్లో మ్యుటేషన్‌, రిజిస్ట్రేషన్‌తో పాటు పట్టాదారు పాస్‌బుక్‌ రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నూతన పట్టాదారు పాస్‌బుక్‌లను ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్‌ భాస్కర్‌, కొత్తపల్లి సర్పంచ్‌ హబీబ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, పాచ్చ భాష, లోహిత్‌రెడ్డి, బీజేపీ నాయకుడు రవీందర్‌, ఎస్వీ ఇన్ఫో మీసేవా ఆపరేటర్‌ కొండాపురం మహేశ్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు. 

నియోజకవర్గంలో ఊపందుకున్న ధరణి సేవలు

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకర్గంలో ధరణి సేవలు ఊపందుకున్నాయి. బుధవారం నాలుగు తాసిల్దార్‌ కార్యాలయాల్లో 6 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్లు అయిన వెంటనే సంబంధిత రైతులకు మ్యుటేషన్‌ చేసి పత్రాలను అందజేశారు. యాచారం మండలంలో -3, అబ్దుల్లాపూర్‌మెట్‌లో-1, ఇబ్రహీంపట్నంలో-2 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తిచేశారు. ప్రక్రియ తొందరగా పూర్తికావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.