మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Nov 04, 2020 , 04:24:43

ముమ్మరం..మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం

ముమ్మరం..మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలో రూ.కోటితో నిర్మిస్తున్న మోడల్‌ మార్కెట్‌ పనులు శరవేగంగా పూర్తికావస్తున్నాయి. జిల్లాలోనే ఇబ్రహీంపట్నం కూరగాయల మార్కెట్‌ను మోడల్‌ మార్కెట్‌గా నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని మంచాల రోడ్డులోగల పాత పోలీస్‌ క్వాటర్స్‌ స్థలంలో ఈ మార్కెట్‌ను అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. మార్కెట్‌ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో అధికారులు పనులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. దసరా నాటికే మార్కెట్‌ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరిగినప్పటికీ మార్కెట్‌ను త్వరలోనే పూర్తిచేసి వ్యాపారులకు అందించాలని అధికారులు యోచిస్తున్నారు. 

 హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం అంబేద్కర్‌ చౌరస్తాలో ఉన్న కూరగాయల వ్యాపారులకు ఇబ్రహీంపట్నం పాత పోలీస్‌క్వాటర్స్‌ వద్ద అత్యాధునిక హంగులతో మోడల్‌ మార్కెట్‌ను నిర్మిస్తామని ఇచ్చిన హామీ మేరకు నూతన మార్కెట్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. అంబేద్కర్‌ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుతో పాటు పార్కు తయారీ సందర్భంగా అక్కడున్న వీధి కూరగాయల వ్యాపారులను వేరేచోటుకు తరలించారు. దీంతో వారు ప్రస్తుతం రోడ్డుకిరువైపులా కూరగాయల వ్యాపారాలు సాగిస్తున్నారు. అలాంటి వారందరి కోసం ఈ మోడల్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే మోడల్‌ మార్కెట్‌ను పూర్తిచేసి వారందరికి దుకాణాలను కేటాయించే దిశగా అధికారులు ముందుకెళ్తున్నారు. 

ఒకేచోట క్రయ విక్రయాలు

ఇబ్రహీంపట్నంలో నిర్మిస్తున్న మోడల్‌ మార్కెట్‌ ప్రారంభమైతే ఇకనుంచి ఒకేచోట కూరగాయల క్రయ విక్రయాలు జరుగనున్నాయి. ఇబ్రహీంపట్నంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన అనేకమంది ప్రతిరోజు కూరగాయల క్రయ విక్రయాలు ఇబ్రహీంపట్నంలో కొనసాగిస్తారు. వారందరికి ఈ మోడల్‌ మార్కెట్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.

త్వరలోనే మార్కెట్‌ పనులు పూర్తి 

కోటి రూపాయలతో ఇబ్రహీంపట్నం మంచాల రోడ్డులో నిర్మించతలపెట్టిన కూరగాయల మోడల్‌ మార్కెట్‌ను త్వరలోనే పూర్తిచేస్తాం. ఈ మార్కెట్‌ను అత్యాధునిక హంగులతో నిర్మించేందుకు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కృషిచేస్తున్నారు. ఈ మార్కెట్‌ పనులు పూర్తయితే జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ కూరగాయల వ్యాపారులు క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశముంటుంది. త్వరితగతిన పనులు పూర్తిచేస్తాం. - జయంత్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌