ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Nov 03, 2020 , 04:01:31

కేంద్ర చట్టంతో.. రైతులకు‘మద్దతు’ కరువు

కేంద్ర చట్టంతో.. రైతులకు‘మద్దతు’ కరువు

  • మద్దతు ధర ఊసే లేదు 
  • రైతులను దోచుకునే విధానాలు 
  • అన్నదాతల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి
  • రైతు వేదికలు దేవాలయాలు
  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

శంకర్‌పల్లి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు   రైతులకు గుదిబండగా మారనున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం శంకర్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని మణిగార్డెన్స్‌లో జరిగిన శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రైతు చట్టంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఊసే లేదన్నారు. కార్పొరేట్‌ వ్యాపారులు రాబోయే కాలంలో రైతులను దోచుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసమే పంజాబ్‌, హర్యానా తదితర రాష్ర్టాలలో రైతులు ఆందోళన చేస్తున్నారని  చెప్పారు. సీఎం కేసీఆర్‌  రాష్ట్ర రైతుల శ్రేయస్సు కోసం అహర్నిషలు పాటుపడుతున్నారని కొనియాడారు. ఈసారి మక్కలు పండించ వద్దని చెప్పినా రాష్ట్రంలోని కొందరు రైతులు మక్కజొన్న  పండించారన్నారు. వాటికి బయట మార్కెట్‌లో ధర లేదని,  అయినా ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. సన్నరకం ధాన్యం  పండించే రైతులకు సీఎం కేసీఆర్‌ మద్దతు ధర ప్రకటించి ఆదుకుంటారని తెలిపారు. రైతు వేదికలను సద్వినియయోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు ఒకే చోట పోగై తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ వేదికలు దోహదపడుతాయన్నారు. కర్షకులకు రైతు వేదికలు దేవాలయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో 2600ల రైతు వేదికలను నిర్మిస్తున్నారని తెలిపారు. 

చేవేళ్ళ ఎంపీ డాక్టర్‌ రంజి త్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్‌ వన్‌గా సీఎం కేసీఆర్‌ నిలిపారని కొనియాడారు. రైతు బంధు పథకాన్ని యావత్‌ ప్రపంచం ప్రశంసిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి చేవెళ్ల  నియోజక వర్గం సమీపంలోనే ఉన్నందున నగరంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. 

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పీ.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ శంకర్‌పల్లి మార్కెట్‌ పెద్దదని రైతులు పండించిన పంటలకు లాభాలు రావాలంటే పాలక వర్గం బాగా కృషి చేయాలన్నారు. గతంలో ఇతర రాష్ర్టాల నుంచి మనకు పువ్వులు దిగుమతి అయ్యేవని, ఆ పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. బెంగళూరులో పండిస్తున్న పూలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో రైతులు పండిస్తున్నారని తెలిపారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేవెళ్ల నియోజక వర్గంలోని గ్రా మాలలో పరిశ్రమల స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి మాట్లాడుతూ రైతులకు సీఎం కేసీఆర్‌ అండగా ఉన్నారని చెప్పారు. కాగా రైతులు పండించిన పంటలు నిల్వ ఉంచడానికి కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. 

ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సర్ధార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి రూ.2కోట్లు మంజూరు చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరారు. అలాగే నాగర్‌గూడ్‌, షాబాద్‌, శంకర్‌పల్లిలలో మోడల్‌ రైతు బజార్లు ఏర్పా చేయాలన్నారు. కాగా ఏఎంసీ చైర్మన్‌గా నల్ల బుచ్చిరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఎంపికైన బీ.శ్రీధర్‌, పాలక వర్గ సభ్యులను వ్యవసాయ శాఖ ఏడీ ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. బీడీఎల్‌ చౌరస్తా నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ఊరేగింపును భారీగా నిర్వహించారు.కార్యక్రమంలో ఎంపీపీ డి.గోవర్ధన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కె.రాములమ్మ, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బి.శశిధర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మిప్రవీణ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ బి. వెంకట్‌రాంరెడ్డి, స్థానిక వర్తక సంఘం అధ్యక్షుడు వి. సత్యనారాయణ, గుడిమల్కాపూర్‌ ఏఎంసీ మాజీ చైర్మన్‌ డి. వెంకట్‌రెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్‌ రవీందర్‌గౌడ్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు, ప్రొద్దటూరు సర్పంచ్‌ ఎ. నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కె. గోపాల్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనిత, ఎంపీడీవో సత్తయ్య, డిప్యూటీ తాసిల్దార్‌ మల్లారెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి వెంకటయ్య పాల్గొన్నారు. 

పలువురు టీఆర్‌ఎస్‌లో చేరిక 

శంకర్‌పల్లి రూరల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెడుత్ను అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు కౌన్సిలర్‌ చాకలి అశోక్‌ 200 మంది అనుచరులతో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి నిరంజన్‌రెడ్డి  పార్టీ కండువా కప్పి ఆయనను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు.