ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Nov 02, 2020 , 03:16:41

తలసరి ఆదాయంలో రారాజు

తలసరి ఆదాయంలో రారాజు

 • రూ.5.78లక్షల రాబడి
 • గతేడాది కంటే అధికం
 • ఉత్పాదకరంగంలో అగ్రగామి
 • అక్షరాస్యతలో 4వ స్థానం
 • అధికంగా పాఠశాలలు కలిగిన జిల్లాల్లో రెండోది 
 • పల్లెల్లో కన్నా పట్టణాల్లోనే జనాభా అధికం 
 • ఆందోళనకరంగా బాలబాలికల నిష్పత్తి
 • తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం గణాంకాలు

తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలిచింది. ఏకంగా రూ.5.78లక్షలతో గతేడాదికి మించి నమోదైంది. రాష్ట్ర సగటు ఆదాయం కంటే జిల్లా రాబడి ఒకటిన్నర రేట్లు అధికంగా ఉండటం విశేషం.  అంతేకాకుండా 2020 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం విడుదల చేసిన గణాంకాల్లో జిల్లా పలు అంశాల్లో ముందు వరుసలో ఉన్నది. ఉత్పాదక రంగంలో అగ్రస్థానం సాధించింది. జిల్లాలో ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతోపాటు వాటి అనుబంధరంగ పరిశ్రమలు ఉండడం కలిసొచ్చింది. శివారు ప్రాంతాలు ఉత్పత్తి సేవల రంగాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండడంతో స్థూల ఉత్పత్తి విలువ గణనీయంగా పెరిగింది. అత్యధిక పాఠశాలలు కలిగిన జిల్లాల్లో రంగారెడ్డి రెండోది కాగా, అక్షరాస్యతలో 4వ స్థానంలో ఉన్నది. జిల్లావ్యాప్తంగా మొత్తం 2711 స్కూల్స్‌ ఉన్నాయి. ఇక బాలబాలికల నిష్పత్తిలో జిల్లా కాస్త వెనుకబడింది. 1000 మంది బాలురకు 925 బాలికలు మాత్రమే ఉండగా 11వ స్థానంలో నిలిచింది. -రంగారెడ్డి, నమస్తే తెలంగాణ 

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం 2020 సంవత్సరానికి  విడుదల చేసిన లెక్కల్లో జిల్లా పలు అంశాల్లో ముందు వరుసలో నిలిచింది. తలసరి ఆదాయంలో జిల్లా ప్రథమస్థానంలో ఉన్నది.  రాష్ట్ర సగటు ఆదాయం కంటే రంగారెడ్డి తలసరి ఆదాయం ఒకటిన్నర రేట్లు అధికంగా ఉన్నది. జిల్లా తలసరి ఆదాయాన్ని రూ.5.78లక్షలుగా ఉంది. జిల్లా జనాభాలో 42.15% మంది ఖాళీగా ఉండకుండా మిగిలిన వారు దొరికిన ఏదో ఒక పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనిచేసే వాళ్లకంటే అసలు ఏ పని చేయని వారే అధికంగా ఉన్న ట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకా రం రంగారెడ్డి జిల్లా జనాభా 24లక్షల 26వేల మంది  ఉన్నారు. ఇందులో 10.12 లక్షల మంది పలు రంగాల్లో పనులు చేస్తు న్నట్లు లెక్కలు చెబుతున్నాయి.అసలు పని చేయకుండా ఖాళీ ఉన్నవారు జిల్లాలో 14.03లక్షల మంది ఉన్నారు. కాగా 6.12 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పని చేస్తున్నారు. 2.13లక్షల మంది వ్యవసాయ కూలీలు కాగా1.65 లక్షల మంది మాత్రమే సాగుదారులు ఉన్నారు. 

రంగారెడ్డి జిల్లాలో  ఐటీ, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలతో పాటుగా వాటి అనుబంధ రంగ పరిశ్రమలు ఉండడంతో అదే స్థాయిలో ఉద్యోగులకు ఆదాయం వస్తోంది. దీంతో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది విడుదల చేసిన దాంట్లో తలసరి ఆదాయం కంటే ప్రస్తుతం విడుదల చేసిన నివేదిక ప్రకారం పెరిగిందని చెప్పవచ్చు. 

మహిళలు, బాలికల నిష్పత్తిలో రంగారెడ్డి జిల్లా ఆందోళనకరంగా ఉండడం గమనార్హం. ప్రతి 1000 మంది పురుషులకు సరాసరి 950 మంది మగువలే ఉన్నారు. స్త్రీ, పురుషుల నిష్ఫత్తిలో రంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా కంటే మిగతా జిల్లాలో మహిళలు అధిక నిష్పత్తిలో ఉన్నా రు. ఆరేండ్ల లోపు బాలికల నిష్పత్తి మరింత ఆందోళ కరంగా కలిగిస్తోంది.1000 బాలురకు 925 మంది బాలికలే ఉన్నట్లు గణాంకాల్లో వెల్లడి అవుతున్నది. ఈ విషయంలో మన జిల్లా 11వ స్థానంలో నిలిచింది. రంగారెడ్డిలో ఆడ పిల్లల పట్ల వివక్ష ఉండడానికి తాజా గణాంకాలే అద్దం పడుతున్నాయి. 

*అక్షరాస్యత విషయంలో జిల్లా 4వ స్థానం దక్కించుకుంది. 71.9%తో రాష్ట్ర సగటు (66.5%)కంటే మన జిల్లా ముందు వరుసలో ఉంది. హైదరాబాద్‌,వరంగల్‌ అర్బన్‌, మేడ్చల్‌ జిల్లా లు రంగారెడ్డి జిల్లా కంటే ముందు వరసలో ఉన్నాయి.జిల్లాలో పురుషుల అక్షరాస్యత 78.9%,మహిళల అక్షరాస్యత 64.6% లో ఉన్నది. 

*గ్రామీణ పల్లెలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లోనే అధి కంగా జనాభా ఉన్నట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. రంగారెడ్డి పరిధిలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 14లక్షల మంది నివాసం ఉన్నారు. పల్లెలో 10.26లక్షల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. 

*2018-19 వానకాలం సీజన్‌లో అధికంగా రంగారెడ్డి జిల్లాలోనే టమాటా, జామ పంటల సాగు చేశారు.14,202 ఎకరాల విస్తీర్ణంలో రైతులు టమాటా సాగు చేశారు.2.47 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చిన్నట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. హార్టికల్చర్‌ పంటల్లో టమట సాగు 34%,4,160 ఎకరాల్లో జామ తోటలపను పెంచారు. మామిడి సాగులో 4వ స్థానం. 22,583 ఎకరాల్లో సాగు చేస్తే 90వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడిని రైతులు సాధించారు.  2019-20లో పత్తి సాగులో రంగారెడ్డి జిల్లా 8వ స్థానంలో నిలిచింది. 

2018-2019 గణాంకాల ప్రకారం అధికంగా పాఠశాలలు గల జిల్లాల సరసన రంగారెడ్డి జిల్లా 2వ స్థానంలో నిలబడింది. రంగారెడ్డి జిల్లాలో 2,711 పాఠశాలలు ఉండగా..6.30లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తలసరి ఆదాయంలో నెంబర్‌ వన్‌గా జిల్లా నిలిచి దూసుకుపోతున్నది. ఉత్పాదక రంగం.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే కీలక రంగాలు జిల్లాలో కేంద్రీకృతమై  ఉన్నాయి. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించే రంగాల్లో పెట్టుబడులు జోరందుకున్నాయి. తెలంగాణ రాష్ర్టానికి రాబడి తీసుకురావడంలో మన జిల్లానే ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఉత్పత్తి రంగం ద్వారా రాష్ర్టానికి సమకూరుతున్న ఆదాయంలో రంగారెడ్డి జిల్లాదే ముఖ్య పాత్ర ఉన్నది. 

గణాంకాలు

 • జిల్లా తలసరి ఆదాయం : రూ.5.78లక్షలు
 • జిల్లా సగటు అక్షరాస్యత : 71.9%
 • పురుషుల అక్షరాస్యత : 78.9%
 • మహిళల అక్షరాస్యత : 64.6% 
 • స్త్రీ,పురుషుల నిష్పత్తి : 1000 మందికి            950 మంది 
 • బాలబాలికల నిష్పత్తి : 1000 బాలురకు 925 మంది బాలికలే 
 • పని చేసేవారు : 42.1%
 • ఏ పనీ చేయని వారు : 57.9%
 • రైతులు  : 1,65,705
 • వ్యవసాయ కూలీలు : 2,13,624