ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Nov 01, 2020 , 05:00:27

పరిహారంలో పక్షపాతం

పరిహారంలో పక్షపాతం

హయత్‌నగర్‌ : వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ప్రకటించిన నగదు పరిహారం అర్హులైన వారికి అందించకుండా స్థానిక కాంగ్రెస్‌ నాయకులు తమ అనుచరులకు అందించారని ఆరోపిస్తూ కమ్మగూడ 22వ వార్డుకు చెందిన లక్ష్మీనగర్‌, ఇందిరమ్మ కాలనీలకు చెందిన పలువురు వరద బాధితులు శనివారం తుర్కయాంజాల్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక వార్డు కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమ వారికి మాత్రమే పరిహారం అందించి అసలైన అర్హులకు ఇవ్వకుండా పక్షపాతం చూపించడంపై మండిపడుతూ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిజమైన అర్హులను గుర్తించడంతో ప్రభుత్వ అధికారులను సైతం స్థానిక నాయకులు తప్పుదోవ పట్టించారని కాలనీ మహిళలు ఆరోపించారు. ప్రభుత్వ పరిహారం వరద బాధితులకు కాకుండా ఇతరులకు ఎలా ఇస్తారని వారు అధికారులను ప్రశ్నించారు. పరిహారం చెల్లింపులో ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నంలో భాగంగానే వరద బాధితులను అసహనానికి గురి చేసి ప్రభుత్వంపై నింద వేసేందుకు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ సమాచారం. 

ప్రైసల చెల్లింపులో పక్షపాతం చూపించిండ్రు : 

వరద బాధితులకు డబ్బులు ఇస్తమని చెప్పి రెండు మూడు రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సతాయిస్తుండ్రు. కాంగ్రెస్‌ నాయకులకు తెలిసినోళ్లకు, అనుచరులకు మాత్రమే డబ్బులు ఇప్పించారు. ప్రభుత్వం వరద బాధితులకు పైసలు పంపినా స్థానిక నాయకులు మాత్రం చెల్లింపులో పక్షపాతం చూపించారు. మాకు ఇవ్వమని అడుగితే ప్రభుత్వం సరిపడా ఇవ్వలేదు మమ్మల్ని ఎక్కడి నుంచి ఇవ్వమంటారని బదులిచ్చారు. ఆఫీస్‌కు వెళ్లి అధికారులను నిలదీయండి అని మమ్మల్ని రెచ్చగొట్టారు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి.    - కొప్పుల వరమ్మ, ఇందిరమ్మ కాలనీ, కమ్మగూడ 

కాంగ్రెస్సోళ్ల మనుషులకే ఇప్పించిండ్రు : 

భారీ వర్షాలు, వరదలతో అతలాకులం అయినం. మా ఇంట్లోకి వరద నీరు వచ్చి ఇంట్లోని వస్తువులు అన్ని తడిసిపోయినయి రోడ్డున పడ్డాం. ఇండ్లు మునిగినోళ్లకు ప్రభుత్వం అందించిన డబ్బులను కాంగ్రెస్సోళ్లు వాళ్ల మనుషులకే ఇప్పించిండ్రు. మాకు ఇవ్వమని అడుగుతే తరువాత ఇస్తామని తప్పించుకుండ్రు. కమిషనర్‌ సార్‌ను అడిగితే మునిగినోళ్ల పేర్లు రాసి ఇస్తే పైసలు ఇస్తామని చెప్పి రాలేదు. మా గోడును వినిపించేందుకే మున్సిపల్‌ ఆఫీస్‌ వద్దకు వచ్చినం. - తోట రమ,  ఇందిరమ్మ కాలనీ, కమ్మగూడ 

ప్రభుత్వ ఆదేశిస్తే పరిహారం చెల్లింపు : 

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వరద బాధితులకు నగదు పరిహారం చెల్లించాం. వరద బాధితుల పేర్లు రాసి కార్యాలయానికి అందిస్తే డబ్బులు ఇస్తామని నేను ఎవరికి హామీ ఇవ్వలేదు. నేను అనారోగ్యానికి గురి కావడంతో కలెక్టర్‌ అనుమతితో విశ్రాంతి తీసుకుంటున్నాను. అనర్హులకు పరిహారం అందితే స్థానిక నాయకులపై చర్యలు తీసుకుంటాం. - కమిషనర్‌ అహ్మద్‌ సఫీ ఉల్లా