బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Nov 01, 2020 , 04:54:40

ఘనంగా వాల్మీకి, పటేల్‌ జయంతి

ఘనంగా వాల్మీకి, పటేల్‌ జయంతి

 ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వాల్మీకి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వాల్మీకి, పటేల్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. రంగారెడ్డి, వికారాబాద్‌ కలెక్టర్లు అమయ్‌కుమార్‌, పౌసుమిబసు నివాళులర్చించి అధికారులు, సిబ్బందితో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. 

షాద్‌నగర్‌టౌన్‌: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. శనివారం షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని పటేల్‌రోడ్డులోని ఆయన విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. పోలీస్‌ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. గ్రంథాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పి.లక్ష్మీనర్సింహారెడ్డి, పటేల్‌రోడ్డులోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌ అహ్మద్‌, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో శరత్‌బాబు నివాళులర్పించారు. అనంతరం జాతీయ ఐక్యత దివస్‌ ప్రతిజ్ఞను చేశారు. అంతకు ముందు రామాయణ రచయిత వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

జాతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలి

చేవెళ్ల : జాతీయ సమగ్రతకు అందరూ కట్టుబడి ఉండాలని చేవెళ్ల తాసిల్దార్‌ షర్మిల అన్నారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని నిర్వహించారు. అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలన్నారు. చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలో పటేల్‌ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో, తాసిల్దార్‌ కార్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

కేశంపేట తాసిల్దార్‌ కార్యాలయంలో..

కేశంపేట: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. శనివారం కేశంపేట తాసిల్దార్‌ కార్యాలయంలో పటేల్‌ చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ మురళీకృష్ణ, ఎంపీడీవో చంద్రకళ, ఏఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.