శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Oct 31, 2020 , 03:52:14

ప్రకృతివనం..పచ్చతోరణం

ప్రకృతివనం..పచ్చతోరణం

శంషాబాద్‌: పచ్చని పల్లె సీమలకు ప్రభుత్వ మార్గదర్శకాలతో ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు పచ్చ తోరణాలను తలపిస్తున్నాయి. పచ్చని చెట్లు....పూల మొక్కలు..., మూలికా,సుగంధపరిమళాలు...పలురకాల వృక్షసంపద ప్రకృతిసౌందర్యాలతో ఆహ్లాదాన్నిచ్చే పచ్చ‘ధనం’ నిండి ఉన్నవి. శంషాబాద్‌ మండలంలోని 27 పంచాయతీల్లో ఆకట్టుకునే మొక్కలు, అందమైన పూల సుగంధ పరిమళాలతో,మనసును దోచే పచ్చని వాతావరణంలో ఏర్పా టు చేసినప్రకృతివనాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దషాపూర్‌ తండా, మదనపల్లి, సుల్తాన్‌పల్లి, మల్కారం, నర్కుడ, పెద్దగోల్కొండ, జూకల్‌, పాలమాకుల, పెద్దతూప్ర తది పంచాయతీల్లో విస్తృతంగా ప్రకృతివనాల్లో మొక్కలు నాటారు. ఒక్కో ప్రకృతి వనంలో సుమారు 40 వేల  మొక్కలు పెంచుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంగా మొక్కలను ఆయా ప్రకృతివనాలకు తగు రక్షణ చర్యలు చేపట్టారు.  

పచ్చదనాన్ని పంచుతున్న పంచవటి

నగర శివారు హరిత సుందరీకరణ దిశగా శంషాబాద్‌ పరిధిలోని కొత్వాల్‌గూడ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ ‘పంచవటి’ పార్క్‌ను నిర్మించారు.సుమారు 165 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 2.17 కోట్లతో మూడేండ్ల పాటు శ్రమించి పార్కు నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో పంచవటి, పర్ణశాల, నక్షత్రవనం, మూలికావనం, నవగ్రహవనం, మెడిసినల్‌ గార్డెన్‌, రాశివనంతో పాటు దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ వాకింగ్‌ ఉన్నాయి. నగరశివారులో ఎంతో ప్రకృతిసహజసిద్ధమైన వాతావరణంతో ఆవరించిన పార్క్‌ ఆకర్షణీయ ఉద్యానవనం శంషాబాద్‌ పరిధిలో ఏర్పాటు కావడం పలువురిని ఆకట్టుకుంటుంది.

ఎకరా భూమిలో  ఏర్పాటు చేశాం

మా పంచాయతీ పరిధిలో ఎకరా భూమిలో ప్రకృతి వనం ఏర్పాటు చేశాం. సుమారు 40 వేల పైగా మొక్కలు నాటాం. రక్షణ చర్యలు కూడా ఏర్పాటు చేశాం.అధికారులు ఎప్పటికపుడు తగు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఆ మేరకు ఎకరా భూమిలో అన్నిరకాల మొక్కలు నాటాం. -నీలా నాయక్‌, సర్పంచ్‌, పెద్దషాపూర్‌ తండా 

 ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుంది

ప్రకృతివనాలు ఏర్పాటు చాలా ప్రయోజనకరం. ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిది. బీడు భూములు అందుబాటులోకి రావడం జరిగింది. ప్రజలు కూడా మొక్కలు పెంచడంపై శ్రద్ధ కనబరుస్తున్నారు.పల్లె వనాల పెంపు కేవలం సర్పంచ్‌ లే చేయాలి, లేదా అధికారులే చేయాలి అనుకోవద్దు. ప్రతి ఒక్కరి బాధ్యత. - శ్రీనివాస్‌, స్థానికుడు