గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 31, 2020 , 03:32:37

ప్రారంభానికి సిద్ధమైన రైతు వేదికలు

ప్రారంభానికి సిద్ధమైన రైతు వేదికలు

  • రంగారెడ్డి జిల్లాలో 83 నిర్మాణం 
  • 75 భవనాల పనులు పూర్తి.. తుదిదశలో మరో 8
  • మొత్తం రూ.18.26 కోట్ల వ్యయం 
  • వికారాబాద్‌ జిల్లాలో రూ.21.34 కోట్లతో 97 వేదికలు
  • ఒక్కోదానికి 20 గుంటల స్థలం.. రూ.22లక్షల ఖర్చు 
  • ఆధునిక హంగులు, సకల సౌకర్యాలు 
  • ఏఈవోలకు ప్రత్యేక గది 
  • కంప్యూటర్‌, వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం టీవీలు ఏర్పాటు
  • అవగాహన సదస్సులు, చర్చలకు సరైన ‘వేదిక’
  • రైతులకు తప్పనున్న ఇబ్బందులు

రైతు వేదికలు సిద్ధమయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్లలో మొదటి రైతువేదికను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు. పంటల సాగు, చీడపీడల నివారణ, సంక్షేమ పథకాలు, యాంత్రీకరణ తదితర అంశాలపై చర్చించుకునేందుకు రైతులకు ఒక సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని నిర్మిస్తున్నది. ఒక్కోదాన్ని 20 గుంటల స్థలంలో రూ.22లక్షల వ్యయంతో చేపడుతున్నది. ఆధునిక హంగులతోపాటు  కంప్యూటర్‌, వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం టీవీలు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నది. రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు అందించేందుకు ఏఈవోల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేస్తున్నది. సాగుపై అవగాహన సదస్సులు, సమావేశాలు,  శిక్షణా తరగతులు నిర్వహించేందుకు రైతు వేదికలు ఉపయోగపడనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో రూ.18.26కోట్లతో మొత్తం 83 రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ఇందులో 75 పూర్తికాగా మరో 8 తుదిదశకు చేరుకున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో రూ.21.34కోట్లతో 97 నిర్మిస్తుండగా, చాలావరకు పూర్తికావొస్తున్నాయి. రైతువేదికలు అందుబాటులోకి రానుండడంతో రైతుల ఇబ్బందులు తీరనున్నాయి. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు ప్రతిరూపమైన రైతు వేదికల నిర్మాణం రంగారెడ్డి జిల్లాలో దాదాపు పూరై, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 83 వ్యవసాయ క్లస్టర్లలో ఈ వేదికల నిర్మాణం వేగంగా జరిగాయి. గ్రామీణ జిల్లాలో 80, అర్బన్‌ ప్రాంతాల్లో 3 (రాజేంద్రనగర్‌, ఖానాపూర్‌, ఆమనగల్లు) ఉన్నాయి. రాష్ట్రంలోనే తొలి రైతు వేదిక మహేశ్వరం క్లస్టర్‌లో నెల రోజుల క్రితమే పూర్తిచేశారు. ఇప్పటికే 74 వేదికల నిర్మా ణం పూర్తయ్యింది. మరో 8 తుదిదశలో నాలుగైదు రోజుల్లో పూర్తికానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ నేతృత్వంలో జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వ్యవసాయ శాఖ, పంచాయితీ రాజ్‌ అధికారులు రైతు వేదికల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 

తప్పనున్న సాగు తిప్పలు

రైతు బంధు, ఆత్మ, రైతు శిక్షణ కార్యక్రమాల కోసం రైతులను ఒక చోట చేర్చి సమావేశాలు నిర్వహించడానికి వ్యవసాయ శాఖకు ఇప్పటివరకు సరైన వేదికలు అందుబాటులో లేవు. వీటన్నింటిని నిర్వహించేందుకు నిర్ణీత స్థలం, భవనాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు చెట్ల కింద, పంచాయతీ కార్యాలయాల్లో, ఆలయాల ప్రాంగణాల్లో, కమ్యూనిటీ భవనాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఈ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

వేదికతో ప్రయోజనాలు

రైతు వేదికల వల్ల వ్యవసాయ మండల పాలన వికేంద్రీకరించినట్లు అవుతుంది. రైతులకు వ్యవసాయ శాఖ మరింత చేరవవుతుంది. ఈ వేదికలో ఏఈవోలకు ప్రత్యేక గది కేటాయిస్తారు. ఒక్కో వేదిక పరిధిలో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉండడంతో రైతులకు అందుబాటులో ఉంటుంది. పంటలకు సంబంధించిన వివరాలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ పథకాలు, సూచనలు, సలహాలను తమకు చేరువలో ఉన్న రైతు వేదికకు వెళ్లి తెలుసుకోవచ్చు. రైతు వేదికలో సమావేశ మందిరం, ఏఈవో గది, మరుగుదొడ్లు, మైక్‌ సౌకర్యం వంట గది, 200 మంది పట్టే సమావేశ మందిరం నిర్మించారు. క్లస్టర్ల పరిధిలో మట్టి నమూనాలు సేకరించి ప్రయోగాలు చేసేందుకు రైతువేదికల్లో ఏర్పాట్లు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 

24 మండలాల్లో వేదికలు

జిల్లాలోని 27 మండలాల్లో 24 వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అర్బన్‌లోని రాజేంద్ర నగర్‌, ఖానాపూర్‌, ఆమనగల్లు మున్సిపాలిటీలో నిర్మించారు. ఇక్కడ ఉపాధి హామీ పథకం నిధులు ఉండకపోవడంతో ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారు. 5వేల ఎకరాలు, 2,500 మంది రైతులకు చొప్పున మొత్తం 2లక్షల 7వేల 500 మంది రైతులకు ఇవి ఉపయోగపడనున్నాయి. 

రైతులకు ఉపయోగకరంగా వేదికలు 

ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, రైతువేదికలు నిర్మించిం ది. వ్యవసాయ విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు సంబంధ అంశాలపై చర్చించుకునేందుకు వేదికలుగా మారనున్నాయి. రైతువేదికల తో వ్యవసాయ రంగంలో మరిన్ని గొప్ప మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. వీటిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి.- అరవిందరావు, ఎంపీపీ, పరిగి 

రైతులకు మరింత పరిజ్ఞానం 

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరింత పరిజ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రైతువేదికలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో పాటు వ్యవసాయంలో వస్తున్న అత్యాధునిక పరిజ్ఞానం కూడా ఈ వేదికల ద్వారా రైతులకు చేరనున్నది. ఈ వేదికలతో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలను రైతులు సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. - బూడిద రాంరెడ్డి, సర్పంచ్‌, ఉప్పరిగూడ 

నూతన అధ్యాయానికి శ్రీకారం

రైతువేదికల నిర్మాణాలతో రాష్ట్రంలో రైతుల కోసం నూతన అధ్యాయం మొదలైంది. రైతులందరూ ఒక చోట చేరి సమస్యలతోపాటు వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటల మార్పిడి, భూసార పరీక్షలు వంటి వాటిపై వ్యవసాయాధికారులతో చర్చించుకునే అవకాశం ఉంటుంది. రైతు సాంకేతిక పరిజ్ఞానంతో నూతన వ్యవసాయ పద్దతుల ద్వారా పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. - బిచ్చన్న, నారాయణపూర్‌, తాండూరు

త్వరితగతిన పూర్తి చేస్తాం

వికారాబాద్‌ జిల్లాలో 97 క్లస్టర్లకుగాను 5 క్లస్టర్లలో రైతు వేదికలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుం డా పెండింగ్‌లో ఉన్న వేదికల నిర్మాణాలన్నీ దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. దాదాపు 10 నుంచి 15 రోజుల్లో వాటిని పూర్తి చేయిస్తాం. రైతు వేదికలు అందుబాటులోకి వచ్చిన అనంతరం ప్రతీ క్లస్టర్‌లో ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటారు. - గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి వికారాబాద్‌

త్వరలోనే రైతు వేదికలు ప్రారంభిస్తాం 

వ్యవసాయంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను రైతుల చెంతకు తీసుకెళ్లడానికి రైతు వేదికలు వారధిగా ఉంటాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణం దాదాపుగా పూర్తి  కావచ్చింది. వీటిని త్వరలోనే ప్రారంభిస్తాం. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. వీటిని ప్రారంభించి రైతులను మరింత చైతన్యం చేసి అధిక దిగుబడులు సాధించడానికి వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయి. - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం