మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Oct 29, 2020 , 06:38:28

సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ రాజేశ్వర్‌రెడ్డి

కడ్తాల్‌ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ రాజేశ్వర్‌రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల పనులను బుధవారం ఎంపీడీవో అనురాధ, ఏంపీవో తేజ్‌సింగ్‌తో కలిసి పీడీ పరిశీలించారు. పల్లెప్రకృతి వనాల్లో ఎన్ని మొక్కలు నాటుతున్నారు, ఏయే మొక్కలు నాటారు, వాటిని ఎలా సంరక్షిస్తున్నారు తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలో ఉపాధి హామీ పథకంలో ఏయే పనులు చేపడుతున్నారని ఈజీఎస్‌ అధికారులను ఆయన అడిగారు. ఈ సందర్భంగా పీడీ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ 2020-21 సంవత్సరంలో చేపట్టే హరితహారం కార్యక్రమానికి గ్రామాల్లోని నర్సీరీలను అధికారులు సిద్ధం చేయాలని తెలిపారు. మొక్కలను పెంచడానికి నర్సరీల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పల్లెప్రకృతి వనాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, వార్డు సభ్యుడు భిక్షపతి, ఈజీఎస్‌ టీఏ సద్గుణ పాల్గొన్నారు.

పల్లె ప్రకృతి వనాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి

ఆమనగల్లు : పల్లెవాసులకు ఆహ్లాదకర వాతావరణం చేకూరేలా పల్లెప్రకృతి వనాలను తీర్చిదిద్దుతున్నట్లు పీడీ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని ఇన్‌చార్జి పీడీ రాజారామ్‌, ఎంపీడీవో వెంకట్రాములుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. మండలంలోని 13 పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు పూర్తయ్యాయని.. త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు ఉద్దేశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. స్థానిక సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలను కాపాడాలని ఆయన సూచించారు. అనంతరం మండలంలో ఈజీఎస్‌ పనుల పురోగతి, జాబ్‌కార్డులు, కూలీల సంఖ్య, పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులపై ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ఉపాధి పనుల పర్యవేక్షణ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.