సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Oct 29, 2020 , 06:23:31

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

  • ప్లాంటేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
  • ఆమనగల్లు బ్లాక్‌ మండలాల్లో నర్సరీలను తనిఖీ చేసిన సీసీఎఫ్‌ సునీతభగవత్‌

ఆమనగల్లు : అటవీ సంరక్షణ, మొక్కల పెంపకంపై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సీసీఎఫ్‌(చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) సునీతభగవత్‌ అన్నారు. బుధవారం ఆమనగల్లు, కడ్తాల, కందుకూరు మండలంలోని గుమ్మడవెల్లిలో నర్సరీలు, ప్లాంటేషన్‌లను ఆమె పరిశీలించారు. హరితహారంలో భాగంగా ఫారెస్ట్‌ పర్యవేక్షణలో  ఏర్పాటు చేసిన నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమనగల్లు మండలంలోని అయ్యసాగర్‌ క్షేత్రం, తలకొండపల్లి మండలంలోని పడకల్‌ గ్రామంలో నర్సరీలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమనగల్లు ఫారెస్ట్‌ డివిజన్‌లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని డీఎఫ్‌ఓ భీమానాయక్‌, డివిజన్‌ అధికారి జానకీరామ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాధారణ తనిఖీలో భాగంగా నర్సరీలను సందర్శించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది 160 హెక్టార్లలో నూతనంగా ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆమనగల్లు ఫారెస్ట్‌ డివిజన్‌లో వన్యప్రాణులకు హాని తలపెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అటవీ సంరక్షణ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించినవారిని చట్టపరంగా శిక్షిస్తామని, అనుమతిలేకుండా చెట్లను నరికి కలపను అక్రమంగా తరలించేవారిపై కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. డివిజన్‌ పరిధిలో చిరుత దాడిలో లేగదూడలు మృతిచెందడం బాధాకరమని.. బాధితులకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ సమీపంలో పొలాలు ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. బీట్‌ అధికారులు, ఫారెస్ట్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు చేపట్టాలని.. నర్సరీల పర్యవేక్షణ చేయాలని ఎఫ్‌ఆర్‌ఓ కమాలొద్దీన్‌ను ఆదేశించారు. అంతకుముందు ఆమనగల్లు ఫారెస్ట్‌ డివిజన్‌ కార్యాలయం ఆవరణలో నక్సల్స్‌ దాడిలో కూలిపోయిన బంగ్లాను పరిశీలించారు. నూతన అతిథిగృహం నిర్మాణానికి సంబంధించి అంచనా వివరాలను తనకు  ప్రపోజల్‌ పంపించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి దేవేందర్‌, సెక్షన్‌ అధికారి రవీందర్‌, బీట్‌ అధికారులు లలిత, రాజు, ఉదయశ్రీ పాల్గొన్నారు.